ఇటీవల వైద్యులు క్యాన్సర్ను నిరోధించేందుకు ఎక్కువగా తినమంటోన్న కూరగాయల్లో ఇదీ ఒకటి. కొత్తగా దీన్నుంచి పొడి రూపంలో సేకరించిన ఎక్స్ట్రాక్ట్ మధుమేహాన్నీ తగ్గిస్తుందని స్వీడన్లోని యూనివర్సిటీ ఆఫ్ గోతెన్బర్గ్కు చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. ఇన్సులిన్ స్రావాన్ని నియంత్రించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయుల్ని క్రమబద్ధీకరించడంతోబాటు గుండెజబ్బుల్నీ, అంధత్వాన్నీ, మూత్రపిండ సమస్యల్నీ కూడా ఇది నివారిస్తుందని పేర్కొంటున్నారు.
బ్రకోలీ మొలకల్లో ఉండే సల్ఫొరాఫేన్ రక్తంలో చక్కెర స్థాయుల్ని నియంత్రిస్తుందని ప్రయోగపూర్వకంగా నిరూపించారు. ముఖ్యంగా వూబకాయుల్లో ఈ బ్రకోలీ ఎక్స్ట్రాక్ట్ వల్ల చక్కెర నిల్వలు పదిశాతం తగ్గినట్లు తేలింది. ఫలితంగా కళ్లూ మూత్రపిండాలు కూడా దెబ్బతినకుండా ఉంటాయని తేలింది.
మున్ముందు చక్కెరస్థాయుల్ని తగ్గించేందుకు ప్రస్తుతం వాడుతోన్న ఔషధానికి బదులుగా ఈ బ్రకోలీ పొడితో చేసిన క్యాప్సూ్ల్స్ మంచి ఫలితాన్ని ఇస్తాయని సంబంధిత నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి బ్రకోలీని ఆహారంలో భాగంగా చేసుకుంటే వ్యాధుల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.