చిక్కుడుకాయలను దాదాపు ప్రపంచమంతటా సాగు చేస్తారు. చిక్కుడుకాయలు లేతగా ఉండగానే కోసి, వంటల్లో వాడతారు. ముదిరిన చిక్కుడు కాయల నుంచి గింజలను వేరుచేసి, వాటిని ఎండబెట్టుకుని వంటకాల్లో వాడతారు. ఇక లేలేత చిక్కుడు ఆకులను పాలకూర మాదిరి ఆకుకూరలా ఉపయోగిస్తారు. ప్రొటీన్లు పుష్కలంగా ఉండటంతో కూరగాయల్లో చిక్కుడు కాయలు బలవర్ధకమైనవి.
చిక్కుడుకాయల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, స్వల్పంగా కొవ్వులు, పీచుపదార్థాలు, విటమిన్– బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్–సి, విటమిన్–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, మాంగనీస్, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
రక్తహీనతను అరికట్టి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్‌ను నిరోధిస్తాయి. కండరాలకు, ఎముకలకు బలాన్నిస్తాయి. వార్ధక్య లక్షణాలను అరికడతాయి. కంటిచూపును మెరుగుపరుస్తాయి. మెదడుకు మేలు చేస్తాయి. పక్షవాతం, గుండెపోటు వంటి జబ్బుల ముప్పును తగ్గిస్తాయి.