header

Cucumber / దోసకాయలు

Cucumber / దోసకాయలు
దోసకాయలలో చాలా రకాలు ఉన్నాయి. ఆకుపచ్చ రంగులో పొడవుగా కనిపించే కీర దోసకాయలను పచ్చిగానే తింటారు. వీటిని సలాడ్లు వంటి వాటిలో వాడతారు. పాశ్చాత్య దేశాల్లో వీటిని ఉప్పునీటిలో ఊరవేసి కూడా తింటారు. పసుపుగా గుండ్రంగా ఉండే దోసకాయలను పచ్చడి, కూర, పప్పు మొదలగు వంటకాల్లో ఉపయోగిస్తారు.
పోషకాలు:
దోసకాయల్లో స్వల్పంగా పిండి పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్‌–బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్‌–సి, విటమిన్‌–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
దేశవాళి దోసకాయలు....
కూరగా వండుకునే దోసకాయతో పోలిస్తే కీరా దోసలోనే ఎక్కువ పోషకాలు ఉన్నాయని అనుకుంటారు. కానీ పసుపు రంగులో ఉండే దోసకాయలోనూ విటమిన్‌-కె, ఎ, బి, సి- విటమిన్లు పుష్కలంగా లభ్యమవుతాయి.
ఆరోగ్య లాభాలు:
దోసకాయల్లో నీటి శాతం ఎక్కువ. ఇవి డీహైడ్రేషన్‌ను దూరం చేస్తాయి. మెదడుకు మేలు చేస్తాయి. కడుపు మంట, అల్సర్లు వంటి బాధలను తగ్గిస్తాయి. స్థూలకాయాన్ని అరికడతాయి. రక్తపోటును అదుపు చేస్తాయి. గుండె సమస్యలను నివారిస్తాయి.
ముఖ్యంగా వీటిల్లోని విటమిన్‌-కె ఎముకల ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంది. మెదడు నరాలు దెబ్బతినకుండానూ, ఆల్జీమర్స్‌ వ్యాధి నివారణకూ తోడ్పడుతుంది.
మెగ్నీషియం, పొటాషియం, సోడియం, సిలికాన్‌, సల్ఫర్‌... వంటి ఖనిజాలతోబాటు ఇతరత్రా యాంటీ ఆక్సిడెంట్లూ దోసలో అధిక మోతాదులోనే దొరుకుతాయి. అందుకే హై బీపీతో బాధపడేవాళ్లకి దోస మంచి మందులా పనిచేస్తుంది. ఇందులోని క్షారగుణం అల్సర్లతో బాధపడేవాళ్లకి ఎంతో మేలు చేస్తుంది.
దోసకాయలో ఉండేది 96 శాతం నీరే అయినప్పటికీ ఆ నీరు, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించేందుకూ, శరీరంలోని విష పదార్థాలను తొలగించేందుకూ దోహదపడుతుంది. చర్మసౌందర్యాన్నీ పెంచుతుంది.
ముఖ్యంగా దోస మధుమేహులకి ఎంతో మేలు. ఎందుకంటే ఇందులోని పోషకాలు ఇన్సులిన్‌ స్రావాన్ని ప్రేరేపిస్తాయి. కణాల పెరుగుదలకీ తోడ్పడతాయి. వూబకాయంతో బాధపడేవాళ్లకి దోస మంచి ఆహారం. ఇంకా ఇందులోని సిలికాన్‌, సల్ఫర్‌లు శిరోజాల పెరుగుదలకీ సాయపడతాయి.