దొండకాయ ఆసియా, ఆఫ్రికా దేశాల్లో విరివిగా పండుతుంది. భారత్‌లో దొండకాయలతో కూరలు, వేపుళ్లు వండుకుంటారు. వంటల కోసం సాధారణంగా మన దేశంలో లేత దొండకాయలను ఉపయోగిస్తారు. కొన్ని దేశాల్లో బాగా పండిన దొండకాయలను కూడా వంటల్లో ఉపయోగిస్తారు. విటమిన్లూ ఖనిజాలూ పుష్కలంగా ఉండే దొండలో కొద్దిపాళ్లలో పీచూ ప్రొటీన్లూ కూడా లభ్యమవుతాయని పోషకాహార నిపుణులు అంటారు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్ల కారణంగానే ఇది బ్యాక్టీరియానూ అడ్డుకుంటుందని ఆయుర్వేదం చెబుతోంది.
ఆకలి లేకపోవడం, దగ్గు... వంటి వాటితో బాధపడేవాళ్లకి దీన్ని తినడంవల్ల ఫలితం ఉంటుంది. ఇందులోని యాంటీ-హిస్టమైన్ గుణాలవల్ల ఇది అలర్జీలనీ దూరం చేస్తుంది
పోషకాలు:
దొండకాయల్లో పీచు పదార్థాలు, బీటా కెరోటిన్, విటమిన్–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్–సి వంటి విటమిన్లు ఉంటాయి. స్వల్పంగా పిండి పదార్థాలు, పుష్కలంగా పీచు పదార్థాలు ఉంటాయి. క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
దొండకాయలు రక్తహీనతను నివారిస్తాయి. రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. జీర్ణకోశానికి మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని అదుపు చేస్తాయి
.
దొండలోని బి-విటమిన్ నాడీవ్యవస్థ సంరక్షణకీ దోహదపడుతుందట. ఆందోళన, మూర్ఛ వ్యాధులతో బాధపడేవాళ్లకి ఇది చాలా మంచిదట. ఆల్జీమర్స్‌నీ అడ్డుకుంటుంది. రిబోఫ్లేవిన్ ఎక్కువగా ఉండే దొండ మనసును ప్రశాంతంగా ఉంచి, డిప్రెషన్ తగ్గడానికి దోహదపడుతుంది.
దొండకాయలో థైమీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది పిండిపదార్థాలు గ్లూకోజ్‌గా మారడంలో కీలకపాత్ర వహిస్తుంది. కొవ్వులూ ప్రొటీన్ల జీవక్రియకీ తోడ్పడుతుంది. ఇందులోసి సి-విటమిన్, బీటాకెరోటిన్‌లు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ క్యాన్సర్‌ను నిరోధిస్తాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను కొంతవరకూ అడ్డుకుంటాయి.
దొండకాయలోని గుణాలు నేరుగా కాలేయంమీద పనిచేస్తాయి. ఫలితంగా శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించేందుకూ రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించేందుకూ దోహదపడతాయి. మధుమేహం వచ్చే సూచనలు ఉన్నవాళ్లు దొండని ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలావరకూ రాకుండా నియంత్రిస్తుంది.
దొండలోని కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా రక్షిస్తుంది. అదేసమయంలో ఎముక సాంద్రత పెరిగేందుకూ తోడ్పడుతుంది.
దొండకాయల్లోని బి-కాంపెక్స్ విటమిన్లు జీర్ణవ్యవస్థకీ మేలుచేస్తాయి.