కంటిచూపు తగ్గుతోందన్న విషయం తెలంగాణ బామ్మల చెవినబడితే వెంటనే వాళ్లు రోజూ పొన్నగంటి కూర తినమని సలహా ఇస్తారు. నిజానికి చూపు పోయినవాళ్లకీ చూపు తెప్పించగలదనే అర్థంలో దీన్ని ‘పోయిన కంటి కూర’ అని పిలిచేవారు. అదే వాడుకలో పొన్నగంటి అయింది. ఈ ఆకునే సంస్కృతంలో మత్సా్యక్షి అనీ, ఇంగ్లిషులో డ్వార్ఫ్ కాపర్‌లీఫ్, సెసైల్ జాయ్‌వీడ్ అనీ పిలుస్తారు. సామాన్యుడి బంగారు భస్మంగానూ దీన్ని పిలుస్తారు. పూర్వం తిరిగి శక్తిని పుంజుకునేందుకు కాయకల్పచికిత్స చేయించుకునేవారు. అందులో వాడే బంగారు భస్మానికి బదులు దీన్ని వాడేవారట. మనకన్నా ఉత్తరాదిన దీని వాడకం మరింత ఎక్కువ. ఇందులో పోషకాలూ ఎక్కువే. వంద గ్రా. ఆకులో 60 క్యాలరీలూ 12గ్రా. పిండిపదార్థాలూ, 4.7గ్రా. ప్రొటీన్లూ, 2.1గ్రా. పీచూ, 146మి.గ్రా. కాల్షియం, 45 మి.గ్రా. పొటాషియంలతోబాటు ఎ, సి- విటమిన్లూ పుష్కలంగా లభ్యమవుతాయి.
ఈ ఆకు జీవక్రియాలోపాలనూ వీర్యకణాల్లోని లోపాలనూ సరిచేస్తుందట. టేబుల్‌స్పూను తాజా ఆకులరసంలో వెల్లుల్లి కలిపి తీసుకుంటే దీర్ఘకాలిక దగ్గు, ఆస్తమా వ్యాధులు తగ్గుతాయట.
మధుమేహుల్లో ఇది కణజాలం దెబ్బతినకుండా చూడటంతోబాటు ఆ వ్యాధి కారణంగా కంటిచూపు తగ్గకుండా చేస్తుంది. అందుకే ఇతర మందులతోబాటుగా ఆహారంలో దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. మొలల వ్యాధినీ ఇది నివారిస్తుంది. అయితే ఈ వ్యాధి బాధితులు దీన్ని ఇతర నూనెలతో కాకుండా ఆవునెయ్యితో వండుకుని తింటే మంచిదట. లేదా రెండు టేబుల్‌స్పూన్ల ఆకు రసాన్ని ముల్లంగి ఆకు రసంతో కలిపి రోజుకి రెండుమూడుసార్లు నెలరోజులపాటు తీసుకుంటే ఫలితం ఉంటుంది.
వైరల్, బ్యాక్టీరియాల కారణంగా తలెత్తే జ్వరాలనూ ఇది నివారిస్తుంది. అందుకే పూర్వం క్షయరోగులకు దీన్ని తప్పక పెట్టేవారు. హెచ్‌ఐవీ వైరస్ సోకినవాళ్లకీ ఇది మంచిదేనట.
కంటికలకలూ కురుపులతో బాధపడేవాళ్లు తాజా ఆకుల్ని కళ్లమీద కాసేపు పెట్టుకుంటే నొప్పి తగ్గుతుంది. నరాల్లో నొప్పికి ముఖ్యంగా, వెన్నునొప్పికి ఇది అద్భుతంగా పనిచేస్తుందట. జబ్బుల సంగతెలా ఉన్నా ఆనందాన్ని పెంచే రుచికరమైన ఆకుకూర.
ఆధారం : ఈనాడు, ఆదివారం బుక్