header

Plaintain

కూర అరటి కాయ :

వీటిలో ఉన్న విటమిన్లు, మినరల్స్, పిండి పదార్ధాలు, రక్తంలోని చక్కెరస్థాయిలను నియంత్రించటంలోను, శరీర బరువును అదుపులో ఉంచటంలోనూ, రక్తంలోని కొవ్వు స్ధాయిలను తగ్గించటంలోను అరటికాయలు ఎంతో సహాయకారిగా ఉంటాయి.
పచ్చి అరటికాయలలో చాలా ఎక్కువ మోతాదులో రెసిస్టెంట్ స్టార్చ్ అనే పిండిపదార్ధం ఉంటుంది. మన జీర్ణ వ్యవస్ధలోని ఎంజైములు దానిని ముక్కలు చేయలేవు. అందుచేత రక్తంలోని చక్కెరశాతం నియంత్రించబడి మధుమేహం వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.
రక్తంలోని కొవ్వు శాతాన్ని తగ్గించి తద్వారా గుండె జబ్బులు రాకుండా ఈ పిండి పదార్థం మనలను కాపాడుతుంది. రెసిస్టెంట్ స్టార్చ్ ఇన్సులిన్ తీసికోవటం వలన శరీరంలో కలిగే ప్రతికూలతలను తగ్గిస్తుంది. ఇన్సులిన్ కి శరీరం స్పందించే తీరును మెరుగు పరుస్తుంది. అంతేకాక ప్లాస్మా కొలెస్ట్రాల్ను, ట్రైగ్లిజరైడ్స్ ల స్ధాయిలను, కొవ్వు పేరుకుపోవటాన్ని తగ్గిస్తుంది. అరటికాయలో పీచు పదార్ధాలు ఎక్కువ పరిమాణంలో ఉండడం వల్ల జీర్ణ ప్రక్రియను నెమ్మది చేస్తుంది. కడుపు నిండుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆకలి తగ్గుతుంది. ఎక్కువ క్యాలరీలు తీసుకోకుండా ఆపుతుంది. ఫలితంగా శరీర బరువు అదుపులో ఉంటుంది.
దీనికున్న ప్రత్యేకత వలన అనారోగ్య పరిస్థితులలో అరటిపండ్లను తీసుకుంటుంటారు. చిన్నపిల్లలలో అరుగుదల శక్తిని పెంచటంలో వారి శారీరక క్రియల మెరుగుదల విషయంలో ఇవి తోడ్పడతాయి.
అరటికాయలో పొటాషియం అధికశాతంలో లభిస్తుంది. దానివల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది. దీనిలోఉన్న విటమిన్ బి6, హిమోగ్లోబిన్ తయారవ్వటంలోను, రక్తంలోను, రక్తంలోని చక్కెర నిల్వలను నియంత్రించటంలోను ఎంతో సహాయం చేస్తంది. దీనివలన మనకు వచ్చే శక్తి ఎక్కువసేపు శరీరంలో నిలిచి ఉంటుంది. వ్యాయామ క్రీడాకారులకు ఇది ఎంతో మంచిది. తరుచుగా అరటి కాయలతో చేసినటువంటి వపదార్ధాలను తినటం ద్వారా మన ఆరోగ్యాన్ని అన్నివిధాలా మెరుగుపరుచుకోవచ్చు. ఎక్కువగా ఉన్న కొవ్వు తగ్గటం, గుండెజబ్బులను అదుపులో ఉంచటం, కడుపులోని వాయుప్రకోపం నియంత్రించబడటం వాటిలో కొన్ని.
అరటికాయ శరీరంలో కొవ్వు కరగటాన్ని పెంచుతుంది. శరీరంలో నిల్వవున్న కొవ్వును ఖండించి దానిని శరీరానికి అవసరమయ్యే శక్తిగా మార్చటంలో సహాయపడుతుంది. శరీరంలో కొవ్వు తగ్గడం వల్ల బరువు తగ్గుతారు. దీర్ఘకాలంలో శరీర బరువు మన నియంత్రణలో ఉంటుంది. అరటిపండ్ల కంటే పచ్చి (కూర) అరటి కాయలలో చక్కెరశాతం తక్కువగా ఉంటుంది. పచ్చి అరటికాయలలో ఉంటే రెసిస్టెంట్ స్టార్చ్ పండుగా మారేటపుడు చక్కెరగా మారుతుంది.
జాగ్రత్తలు : కూర అరటిని బ్రేక్ ఫాస్ట్, లంచ్ లలో తినవచ్చు. రాత్రిపూట మాత్రం 8 గంటల తరువాత తినవద్దంటారు. అలాగా ఈ కూర తిన్న తరువాత ఐస్ క్రీమ్, డైరీ ఉత్పత్తులు, పాలు, పెరుగు వంటివి, ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు. కూర అరటిని మితంగానే తినాలంటారు. కొందరికి ఉదరం అప్ సెట్ అయ్యే అవకాశం ఉంది. శ్రీ పాలపర్తి శ్రీకాంత్ గారి సౌజన్యంతో.......