header

Pumpkin….. గుమ్మడి

చూడ చక్కని గుమ్మడి.. ఆకృతిలోనే కాదు పోషకాల్లోనూ భారీనే. పెళ్ళిళ్ళు ...ప్రత్యేక కార్యక్రమాల్లో పులుసులు, దప్పళాలుగా వండుకునే గుమ్మడిని తరచూ ఉపయోగించుకోవటం వల్ల అనేక పోషకాలు అందుతాయని అంటున్నారు నిపుణురాలు డాక్టర్‌ లతాశశి.
ఏ కాలంలో నయినా వ్యాధులు ఎదుర్కొనే శక్తినిస్తుంది గుమ్మడి. కారణం దీనిలో పుష్కలంగా ఉండే కెరొటోనాయిడ్లే. గుమ్మడితో చేసిన పదార్థాలని తరచూ తీసుకునే వారిలో వ్యాధి నిరోధక శక్తి అధికం. ముఖ్యంగా బీకెరిన్‌ కీలకమైన యాంటీ ఆక్సిడెంట్స్. దీనికి చెడు కొలస్ట్రాల్‌ని నియంత్రించే శక్తి అధికం. గుండె నాళాల్లో అడ్డంకులు తొలగించి గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది.
వయసుతో సంబంధం లేకుండా మేని నిగారింపు కోరుకునే వారికి గుమ్మడి చక్కని యాంటీ ఏజింగ్ పదార్థమని తెలుసుకోవాలి. దీనిలోని అల్ఫాకెరిన్‌ వృద్ధాప్య లక్షణాలను నివారిస్తుంది. కంటి శుక్లాలు రాకుండా చూస్తుంది.
పీచు పుష్కలం : గుమ్మడిలో పీచు పుష్కలంగా ఉంటుంది. దాంతో మలబద్దక సమస్యను అదుపులో ఉంటుంది. ఇక ఖనిజ లవణాల విషయానికి వస్తే ఇందులో శరీరానికి మేలు చేసే క్యాల్షియం, ఇనుము, మెగ్నీషియం, ఫాస్పరస్‌లు అధికంగా లభిస్తాయి. ఒక కప్పు తరిగిన గుమ్మడి నుంచి క్యాల్షియం 37 మి.గ్రాలు లభిస్తే మెగ్నీషియం 22 మి.గ్రాలు పొందవచ్చును.
ఆటలాడే అమ్మాయిలకు ప్రత్యేకం : పొటాషియం స్థాయిలు పుష్కలంగా ఉండే గుమ్మడిని ఏదో ఒక రూపంలో తీసుకొనే వారిలో రక్తపోటు అదుపులో ఉంటుంది. కప్పు గుమ్మడి నుంచి 564 మి.గ్రా పొటాషియం దొరుకుతుంది. క్రీడాకారిణులకు తరచూ ఏర్పడే సమస్య పొటాషియం లోపం తరచూ వ్యాయామాలు చేయడం వల్ల స్వేదం, కారణంగా చెమట రూపంలో పొటాషియం కోల్పోతారు. క్రీడాకారిణులు... గుమ్మడితో చేసిన కూరలని డెసర్ట్‌లను స్వీకరించాలి. పైగా ఇది ఎముక బలానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటితో పాటు వ్యాధినిరోధక శక్తిని పెంచే జింక్‌కు కొదువలేదు.
విటమిన్లు పుష్కలం : పండిన గుమ్మడిలో వ్యాధినిరోధక శక్తిని విటమిన్‌ సి, మేని అందానికి తోడ్పడే విటమిన్‌ ఇ, కంటి చూపునకు సహకరించే విటమిన్‌ ఎ పుష్కలంగా ఉంటాయి. ఒక గిన్నెడు గుమ్మడి నుంచి మూడు మిల్లీ గ్రాముల విటమిన్‌ లభిస్తే సి 12 మి.గ్రా వరకు లభిస్తుంది.