header

Spine Gourd ….Akakara Kaya.....ఆగాకర
అగాకరను బోడ కాకర, కాంటోలా, కాక్రోల్‌, స్పైన్‌గార్డ్‌ అనీ అంటారు. ఇవి చేదుండవు. ఇది అడవుల్లో, తుప్పల్లో సహజంగా పెరగడమే తప్ప సాగులో ఉన్నది లేదు. అయితే దీనికున్న ప్రత్యేకమైన రుచీ, అద్భుతమైన ఔషధ లక్షణాల వల్ల ఇప్పుడు చాలా చోట్ల వాణిజ్య పద్ధతిలో సాగు చేస్తున్నారు. అగాకరలో ఎన్నో పోషకాలూ ఉన్నాయి.
గింజలూ, దుంపలతో సాగు... అగాకరకు ఎక్కువ ఉష్ణోగ్రత ఉండకూడదు. పొడి వాతావరణం, పూర్తి ఎండ ఉండాలి. నీరు నిలవని, సారవంతమైన, సేంద్రియ పదార్థం అధికంగా ఉండే మట్టి మిశ్రమం అవసరం. తప్పనిసరిగా పందిరి, కంచె లేదా జాలీ కావాలి. అగాకరను గింజలూ, దుంపల ద్వారా సాగు చేస్తారు. గింజలను వాడటం ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. ఈ విత్తనాల మొలక శాతం బాగా తక్కువ. అందుకే మంచి విత్తన కంపెనీల నుంచి లేదా తెలిసినవాళ్ల దగ్గర తెచ్చుకోవాలి.
దుంపలు దొరికితే మరీ మంచిది. కొంతమంది తీగ కత్తిరింపుల నుంచి ప్రవర్థనం చేస్తుంటే కొన్ని సంస్థలు టిష్యూ కల్చర్‌(కణజాలవర్థనం) ద్వారా ప్రవర్థనం చేసి అమ్ముతున్నాయి. దుంపలను నాటిన 35-40 రోజుల్లో, విత్తనాలను నాటితే మొలకెత్తిన 70-80 రోజుల్లో కాపునకు వస్తుంది.
పదిరోజులకోసారి ఎరువు... విత్తనాలను మే నెలాఖరులో నారు పోసుకుంటే దాదాపు 15-18 రోజుల్లో మొలకెత్తుతాయి. అదే కుండీలో లేదా నేలలో పాదు అయితే నాలుగైదు గింజల చొప్పున నాటుకోవచ్చు. నారు అయితే 40 రోజుల వయసులో నాటుకోవాలి. నేలలో నాటుకుంటే పాదుకు పాదుకు రెండున్నర నుంచి మూడు అడుగులూ, వరుసకూ వరుసకూ మధ్య ఆరు అడుగులు ఉండేలా చూసుకోవాలి.
విత్తనాలను నాటే ముందు బీజామృతంతో లేదా ట్రైకోడెర్మా పిండి పొడి కలిపిన నీళ్లు వాటికి కలిపి ఆరబెట్టి నాటుకోవడం మంచిది. నీళ్లు నిలవకుండా, మరీ నేల పొడారిపోకుండా చూసుకోవాలి. తీగలు సాగాక జాగ్రత్తగా పందిరి లేదా జాలికి అల్లించుకోవాలి. పిండి ఎరువులూ, జీవ ఎరువులూ, వర్మికం పోస్టుల మిశ్రమం పదిరోజులకొకసారి వేస్తూండాలి.
వర్మివాష్‌, జీవామృతం, పంచగవ్య కూడా ఇవ్వడం మంచిది. నారు దశలో క్రమంతప్పకుండా వేప కషాయం చల్లాలి. మట్టిమిశ్రమం తయారు చేసుకునేటప్పుడు పాసిలోమైసిస్‌ అనే జీవ శిలీంద్రనాశనిని కలిపిన పశువుల ఎరువును వాడితే నులిపురుగుల బెడద ఉండదు. ఫ్రూట్‌ఫ్లై ట్రాపులను వాడితే పండు ఈగతో సమస్య ఉండదు.
త్వరత్వరగా కాపు... కాపు మొదలయ్యాక మూడు నాలుగు నెలలపాటు వస్తుంది. కాయలు లేతగా, ముదురాకుపచ్చ రంగులో ఉన్నప్పుడే కోయాలి. పిందె కాయగా మారడానికి మొదటి సంవత్సరం కొంచెం సమయం పడుతుంది కానీ తరువాత త్వరత్వరగా కోత కొస్తాయి. ఒకసారి నాటుకుంటే దాదాపు అయిదారేళ్లపాటు కాపు నిస్తుంది.
- బోడెంపూడి శ్రీదేవి, ల్యాండ్‌స్కేప్‌ కన్సల్టెంట్‌…సౌజన్యంతో