పోషక విలువల్లో ప్రథమస్థానంలోనూ, రుచికీ, ఆరోగ్యానికీ మారుపేరుగా ఉండే కూరగాయల కోసం వెతికే వారికి మొదటి ఎంపిక బ్రకోలి. దీని శాస్త్రీయ నామం బ్రాసికా ఒలరేషియా ఇటాలికా. క్యాబేజీ కుటుంబానికి చెందిన ఈ కూరగాయను ఒకసారి రుచి చూసినవాళ్లెవ్వరూ మరిక వదలరు. ఇంతకు ముందు ఎక్కడో తప్ప దొరకని ఈ కూరగాయ ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో సులువుగా దొరుకుతోంది. అంటే దీన్ని మనం కూడా పెంచుకోవచ్చన్నమాట.
బ్రకోలీ రుచికరమైందే కాకుండా పోషకాలకూ, ఔషధ గుణాలకూ సాటిలేనిది కూడా. రొమ్మూ, గర్భాశయ క్యాన్సర్లు రాకుండా చేయడంలో దీని పాత్ర అమోఘం. ఇది కొలెస్ట్రాల్‌తోపాటు ఎలర్జీలూ, కీళ్లనొప్పుల్ని తగ్గిస్తుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేరనివ్వదు. ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆస్టియోపొరోసిన్‌ను రానివ్వదు.
విటమిన్లూ, ఖనిజలవణాలు సమృద్ధిగా ఉండటంతో పసిపిల్లలూ, పాలిచ్చే తల్లులూ, వృద్ధులకు ఎంతో మంచిది. కళ్లకూ, చర్మానికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. మరి ఇన్ని మంచి లక్షణాలున్న బ్రకోలీని మన ఆహారంలో ఈ రోజునుంచే భాగం చేసుకుందాం. సేంద్రియ పద్ధతిలో మనమే పెంచుకుందాం.
ఆవాల్లాంటి విత్తనాలు!
బ్రకోలీ తక్కువ ఉష్ణోగ్రతలోనే పెరుగుతుంది. క్యాబేజీ, కాలీఫ్లవర్‌లాగానే పెంచుకుంటాం. కానీ ఇది ఇంకొంచెం సున్నితమైంది కాబట్టి మన ప్రాంతాల్లో పెంచుకునేటప్పుడు మరి కాస్త జాగ్రత్త తీసుకోవాలి.
బ్రకోలీ పూర్తి ఎండలో పెరిగినా, మన ప్రాంతంలో కొద్దిపాటి నీడ దీనికి అనువుగా ఉంటుంది. నీరు నిలవని తేలికపాటి నేలలు దీనికనువుగా ఉంటాయి. పెరటి తోటలో పెంచుకునేటప్పుడు ఒక వంతు వర్మీకంపోస్టూ, రెండు వంతులు కోకోపీట్, ఒక వంతు ఇసుక కలిపిన సారవంతమైన, తేమగా ఉండే, నీరు నిలవని మట్టి మిశ్రమంలో నాటుకోవాలి.
దీని గింజలు చూడటానికి పెద్ద ఆవాల్లా ఉంటాయి. ఇవి వారంలోపే మొలకెత్తుతాయి. నీడలో ఉంచిన ట్రేలలో నారు పోసుకుని 20-30 రోజుల తరువాత నాలుగైదు ఆకులున్నప్పుడు అడుగున్నర దూరంతో నాటుకోవాలి. కుండీల్లో కాకుండా నేలలో నాటుకునేటప్పుడు ఎత్తయిన బెడ్లు ఎంచుకోవాలి. కుండీలో మట్టిని గానీ, ఈ బెడ్లను గానీ నారు నాటుకునే ముందు పూర్తిగా తడిపి సాయంత్రంపూట నారు నాటుకోవాలి. నాటిన వారానికి ఒకసారి, ఆ తరువాత పదిహేను రోజులకోసారి వర్మీవాష్ లేదా వేరుశనగ పిండీ, బోన్‌మీల్ లాంటివి ఆవుపేడతో కలిపి నానబెట్టిన స్లర్రీని గానీ పోస్త్తుండాలి. నేల పూర్తిగా పొడారిపోకుండా నీళ్లు పోస్తూ ఉండాలి.
వెల్లుల్లి కషాయంతో...
బ్రకోలీకి ఉష్ణోగ్రత ఎక్కువ ఉండకూడదు. కాబట్టి బెడ్‌ని లేదా కుండీలో మొక్క చుట్టూ ఎండుటాకులతో కప్పితే నేల త్వరగా పొడారిపోకుండా ఉండటమే కాకుండా చల్లగా ఉంటుంది కూడా. బ్రకోలీకి వేళ్లు పైపైనే ఉంటాయి. అందువల్ల చుట్టూ మట్టిని ఎక్కువగా కదిలించకూడదు. ఈ మొక్కకు ఆకు తినే పురుగులు, రసం పీల్చే పురుగులు ఇబ్బంది కలిగించకుండా వారం, పదిరోజులకొకసారి పచ్చిమిరపకాయల కషాయం, వెల్లుల్లి కషాయం లాంటివి చల్లుతూ ఉండాలి.
నీళ్లు పోసేటప్పుడు నీళ్లు మొక్క మీద పోయకుండా నేల తడిచేలా పోస్తే కుళ్లు తెగులు రాకుండా ఉంటుంది. నాటిన రెండు నెలల్లో బ్రకోలీని కోసుకోవచ్చు. పక్క కొమ్మలను పెరగనిస్తే వాటి నుంచి కూడా బ్రకోలీ తయారవుతుంది కానీ పరిమాణం కొంచెం చిన్నగా ఉంటుంది.
- బోడెంపూడి శ్రీదేవి, ల్యాండ్‌స్కేప్ కన్సల్టెంట్…సౌజన్యంతో