మరీ చల్లని ప్రాంతాల్లో తప్ప ప్రపంచమంతటా విరివిగా పండే వంకాయ శాస్త్రీయ నామం సొలానమ్ మెలాంజినా. బ్రింజాల్ అనే పేరు మనదేశంలో ఎక్కువగా వాడుకలో ఉంది. అబర్‌గెన్ అన్నా ఇదే. దీన్ని ఎగ్ ప్లాంట్ అనీ అంటారు. ఒక రకం వంకాయలు తెల్లగా, అండాకారంలో అచ్చంగా కోడిగుడ్లు మొక్కకు వేలాడుతున్నాయా అన్నట్లు ఉంటాయి మరి. మనదేశంలో ఎన్నో రకాల వంకాయలు - రంగూ, ఆకారం, పరిమాణం, ప్రాంతం, అభిరుచిని బట్టి ఎవరి ఎంపిక వారిదే. అలాగే కొన్ని వంటలు కొన్ని రకాలతో చేస్తేనే బాగుంటాయి కూడా.
వంకాయల్ని అన్ని కాలాల్లోనూ పండించుకోవచ్చు. వర్షాకాలం పంటగా జూన్-జులై నెలల్లో నాటుకోవాలి. కావాల్సిన రకం విత్తనాలు తెచ్చి నారు పోసుకోవడమో లేదా షేడ్‌నెట్లలో పెంచి అమ్ముతున్న నారు తెచ్చి నాటుకోవడమో చేయాలి. నారు వయసు 25-30 రోజుల మధ్య ఉన్నప్పుడు కుండీల్లో లేదా ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మళ్లలో నాటుకోవాలి. నేలలో నాటుకుంటే, మొక్కకూ మొక్కకూ మధ్య అడుగున్నర దూరం ఉండేలా చూసుకోవాలి. కుండీలో అయితే దాని పరిమాణాన్ని బట్టి 2-3 మొక్కలు నాటుకోవచ్చు.
ఎప్పుడైనా సరే సాయంత్రం పూట మట్టిని తడిపి నాటుకుంటే తెల్లారేసరికి చక్కగా కుదురుకుని ఉంటాయి. వంగకు ఎండ సరిగ్గా తగలాలి. మట్టి పూర్తిగా పొడిబారి పోకుండా నీళ్లు పోస్తూ ఉండాలి. వంగ నాటిన 45-50 రోజుల్లో కాయడం మొదలెట్టి రెండు నెలలపాటు బాగా కాస్తుంది. మళ్లీ అక్టోబరు-నవంబరు నెలల్లో నాటుకుని కాపు వచ్చేవరకూ కావాలంటే అలాగే ఉంచి నీళ్లూ, ఎరువులు సరిగా ఇవ్వాలి. మొక్క మీదే ముదిరిన కాయలను అలాగే ఉంచి, పండాక విత్తనాలు తీసి బాగా కడిగి నీడలో ఎండబెట్టి దాచుకుంటే మళ్లీ నాటుకోవడానికి పనికొస్తాయి.
ఎరువూ ఉండాలి: కుండీలో లేదా మడిలో ముందుగానే తగినంత పశువుల ఎరువూ, ఎముకల పొడీ, పిండి ఎరువులూ, జీవ ఎరువులు కలపడం వల్ల తరువాత పోషకాలను ఇవ్వాల్సిన అవసరం అంతగా రాదు. అప్పుడప్పుడూ జీవామృతం, వర్మీవాష్ వంటివి అందించడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. కుండీలో లేదా మడిలో పుదీనా కొమ్మలు నాటుకోవడం వల్ల పురుగులు దరిచేరవు. అలాగే బంతి మొక్కలు ఒకటి రెండింటిని అదే కుండీలో నాటుకుంటే నులిపురుగుల నుంచి రక్షణ దొరుకుతుంది.
మునగాకు రసాన్ని 24 గంటలు నిల్వ ఉంచి 2-3 సార్లు చల్లడం వల్ల వడలు తెగులూ, సీతాఫలం ఆకు కషాయం చల్లడం వల్ల కాండం లేదా కాయతొలిచే పురుగు అదుపులో ఉంటాయి. వంగకు ప్రమాదం కలిగించే సమస్యలు ప్రధానంగా ఇవే. అయితే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే - సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పెంచదలుచుకున్నప్పుడు సమస్యను ముందుగానే గుర్తించాలి. అంటే తప్పకుండా మీరు తీరిక చేసుకుని మీ మొక్కలతో రోజూ ముచ్చటించాలి.
దేశవాళీ రకాలతోపాటు ప్రతి విషయంలోనూ అధిక దిగుబడిని ఇచ్చే సంకర రకాలున్నాయి. సంకర రకాల్లో ఈ కిందవి
దొరుకుతాయోమో చూడండి. ఇవి అధిక దిగుబడిని ఇవ్వడంతోపాటు కొన్ని రకాల చీడపీడలను తట్టుకుంటాయి .
ఊదారంగు సన్నని, పొడవు కాయల కోసం - పూసాపర్పుల్ లాంగ్, పూసా పర్పుల్ క్లస్టర్, హైబ్రిడ్ 5
ఊదారంగు లావు, పొడవు కాయల కోసం - పూసాక్రాంతి
ఊదారంగు గుండ్రని కాయలకు - శ్యామల, అర్కనవనీల్, అంబారా
చారల అండాకారపు కాయలకు - మహి సూపర్ 10, కల్పతరు, మంజుశ్రీ
ఆకుపచ్చని అండాకారపు కాయలకు - ఆర్తి, మహి99, అర్క కుసుమాకర్
ఆకుపచ్చని పొడవు కాయలకు - అర్క షిరీన్
తెల్లని అండాకారపు కాయలకు - వైట్ పొన్ని
- బోడెంపూడి శ్రీదేవి, ల్యాండ్‌స్కేప్ కన్సల్టెంట్…సౌజన్యంతో