మిరపను సంవత్సరం పొడవునా పెంచుకోవచ్చు. కుండీలోనూ చక్కగా పెరుగుతాయివి. ఒకవేళ అవసరానికి మించి కాసినా వృథా అయిపోవు. కోయడం కొంచెం ఆలస్యమైతే ముదిరి, పనికి రాకుండా పోతాయనే భయం లేదు. పచ్చిమిర్చిగా కాకుంటే పండు మిరప, ఆ తరువాత ఎండుమిర్చిలా హాయిగా వాడుకోవచ్చు.
మిరప అనగానే ఘాటే గుర్తుకొస్తుంది కానీ ఆ ఘాటుకు కారణం వాటిలో ఉండే ‘క్యాప్సిసిన్’ అనే రసాయనమే. దీన్ని చాలా ఔషధాల్లో వాడతారు. మనకు మిర్చి అంటే కారం కోసం అనుకుంటాం కానీ అది చాలా రకాలుగా మేలు చేస్తుంది. మిరపలో కెలొరీలు తక్కువ. జీవక్రియలను వేగవంతం చేస్తుంది. అంటే సులువుగా బరువు తగ్గుతామన్నమాట. బోలెడన్ని విటమిన్లూ, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ప్రోస్టేట్ గ్రంథిని ఆరోగ్యంగా ఉంచుతుంది.
మిరప కూడా వంగా, టొమాటోల కుటుంబానికి చెందిందే. కొన్నిచోట్ల నేరుగా విత్తనాలే నాటుకుంటారు గానీ సాధారణంగా నారు పెంచుకుని నాటుకోవచ్చు. ఈ నారుని ఎత్తుగా చేసిన బెడ్లలో లేదా ప్రోట్రేలలో తయారు చేసుకుంటారు. మన పెరటి తోట కోసం కొన్ని గింజలు చాలు కాబట్టి రంధ్రాలు చేసిన మూడు అంగుళాల లోతు ప్లాస్టిక్ ట్రేలో కూడా నారు పోసుకోవచ్చు. లేదా దగ్గరలోని నర్సరీ నుంచి కొంచెం నారు తెచ్చుకోవచ్చు. మిరపలో ఎన్నో రకాలుంటాయి. బజ్జీలుగా, కూరలా చేసుకునేవీ, కారం ఎక్కువగా ఉన్నవీ, వివిధ రంగుల్లో అందంగా ఉండేవి...
ఇలా ఎన్నో. వాటిల్లో జి3, భాగ్యలక్ష్మి, కిరణ్, ప్రకాష్, జ్వాల రకాలు బాగా కాయడంతోపాటు చీడపీడలనూ కొంతవరకు తట్టుకుంటాయి. తక్కువ కారం ఉండాలంటే సూర్య (ఇండో అమెరికన్), గాయత్రి (సిరిజెంటా), సోనాక్షి (విఎస్‌ఆర్) బాడగి రకాలు బాగుంటాయి. మీ దగ్గర నాటు రకాలున్నా, ఒకటి రెండు ఇంట్లో వాడే మిరపకాయలైనా నారుపోసుకోవచ్చు. .
మీరే నారు పోసుకునేటట్లయితే ఇసుకా, కోకోపీట్, వర్మికంపోస్టు కలిపిన మిశ్రమాన్ని ట్రే లేదా ప్రో ట్రేలలో నింపి బాగా తడపాలి. ట్రేలో అయితే పల్చగా, ప్రోట్రేలలో అయితే గుంటకు ఒకట్రెండు విత్తనాలు తీసుకుని పైన మళ్లీ పల్చగా ఇసుక చల్లి షేడ్ నెట్‌తో కప్పాలి. విత్తనాలు నాటిన వారం రోజుల్లో మొలుస్తాయి. 40-45 రోజుల వయసున్న నారును ఒకట్రెండు గ్రాముల ట్రైకోడెర్మా పొడి కలిపిన నీళ్లలో అరగంట ఉంచి మొక్కకు మొక్క మధ్య అడుగున్నర దూరం ఉండేలా బోదెల మీద నాటుకోవాలి.
అదే కుండీల్లో అయితే కుండీ సైజును బట్టి 1 నుంచి 3 మొక్కలు నాటుకోవాలి. మిరపకు కనీసం ఆరు గంటలపాటు ఎండ ఉండాలి. నీరు నిలిచే మట్టి మిశ్రమం వాడాలి. ఎక్కువగా నీళ్లు పోయకూడదు. 3 నుంచి 4 రోజులకోసారి లేదా సాయంత్రంపూట ఆకులు వడలినట్లు కనిపిస్తే నీళ్లు పోయాలి. మిర్చికి నేల బాగా సారవంతంగా ఉండాలి. మట్టి మిశ్రమంలో ముందే జీవ ఎరువులూ, పశువుల ఎరువూ, వేరుశనగ పిండి ఎరువులూ, ఎముకల పొడి కలిపి పెట్టుకుని ఉంటారు కాబట్టి 15 రోజుల కొకసారి జీవామృతం, వర్మివాష్ లాంటివి పోస్తుంటే సరిపోతుంది. .
చీడపీడలూ ఆశించకుండా పది రోజులకొకసారి వేపకషాయం చల్లుతూ ఉండాలి. స్టిక్కీట్రాపులు ఒకట్రెండు పెట్టుకుంటే రసం పీల్చే పురుగులు అదుపులో ఉంటాయి. దానివల్ల వైరస్ తెగులు కూడా అదుపులో ఉంటాయి. ఫిరమోన్ ట్రాపులు కూడా 1 నుంచి 2 పెట్టుకుంటే (స్థలాన్ని బట్టి ) అన్ని మొక్కలకూ కాయ తొలిచే పురుగుల నుంచి రక్షణ ఉంటుంది.
ఒకసారి మిర్చి నాటుకున్న స్థలంలో లేదా కుండీలో ఇంకోసారి ఆకుకూరలూ, బెండా, చిక్కుడూ, బీన్స్ - ఇంకేదైనా (వంగ, టొమాటో కాకుండా) వేసుకోవచ్చు. దీనివల్ల తెగుళ్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. మిర్చి సాధారణంగా రకాన్ని బట్టి విత్తినం నుంచి పంట పూర్తవడానికి 150 నుంచి 180 రోజులు పడుతుంది. నారు నాటిన 30 నుంచి 40 రోజుల్లో కాపు రావడం మొదలై 2 నుంచి 3 నెలలపాటు కాస్తుంది. ఇంకా త్వరగా కాపు వచ్చే హైబ్రిడ్ రకాలు కూడా ఉన్నాయి. .
- బోడెంపూడి శ్రీదేవి, ల్యాండ్‌స్కేప్ కన్సల్టెంట్…సౌజన్యంతో
చైనీస్ ఫైవ్ కలర్: చెట్టునిండుగా గులాబీలో మందారాలో విరబూసినట్లుగా పూసే ఈ మొక్క చూడ్డానికి చాలా బాగుంటుంది. ఊదా రంగులో కాసిన కాయలు క్రమంగా లేతపసుపు, నారింజ, ఎరుపు, ముదురు ఎరుపు రంగుల్లోకి మారుతూ పంచ రంగుల్లో కనువిందు చేస్తుంటాయి.
ప్రెయిరీ ఫైర్: నింగిలోని చుక్కల్లా మొక్కంతా గుండ్రని కాయలు కాయడమే కాకుండా అవి తెలుపు నుంచి నారింజ, ఎరుపు, ముదురు గులాబీ, ఊదా, వంకాయ వర్ణాల్లోకి మారుతుంటాయి.
ఇంకా చిన్నగా గుండ్రంగా ఉండే హాట్‌పాప్, కాస్త పెద్ద సైజులో మెరిసే విక్‌డ్ క్యాప్సికమ్, నారింజరంగులోని టాంజరిన్ డ్రీమ్, సన్నగా పొడవుగా ఉండే మెడుసా, పొట్టిగా రంగురంగుల్లో ఉండే న్యూమెక్స్ ట్విలైట్, మరీ పొట్టీ పొడవూ కాకుండా ఉండే బొలీవియన్ రెయిన్‌బో, ఊదా రంగు ఆకులతో అదే రంగులో కాసే పర్పుల్, ఒకేదాంట్లో రెండుమూడు రంగుల్లో కనిపించే అజి ఓమ్నికలర్... ఎన్నో రకాలు. రకాల్ని బట్టి వీటిల్లోనూ అంతో ఇంతో కారం ఉంటుంది. బ్లాక్ పెరల్, బొలీవియన్ రెయిన్‌బో, న్యూమెక్స్ ట్విలైట్, ప్రెయిరీ ఫైర్... వంటి వాటిల్లో సాధారణ మిర్చి కన్నా ఘాటెక్కువే.