header

Micro Greens…చిట్టిమొక్కలు….

Micro Greens…చిట్టిమొక్కలు….
కేవలం రెండు, మూడు వారాలలోనే పంట దిగుబడి అందించేవి మైక్రోగ్రీన్స్. అని రకాల మొక్కలను మైక్రో గ్రీన్స్ గా పెంచవచ్చు. అయితే ఎక్కువగా ఆవకూర, ఎర్రతోటకూర, క్యాబేజీ, ముల్లంగి, బీట్ రూట్, తెల్లముల్లంగి, ఉల్లి రకాలను ఎక్కువగా పెంచుతున్నారు.
కొద్దిపాటి స్థలం ఉంటే మైక్రోగ్రీన్స్ ను పెంచవచ్చు. ఏదైనా కంటైనర్, మట్టి, విత్తనాలు ఉంటే చాలు. నాటిన పదిహేను రోజులలోనే చిట్టిమొక్కలు వస్తాయి. అయితే వీటికి గాలి, వెలుతురు తప్పనిసరి కాబట్టి డాబాల మీద పెంచుకోవచ్చు.
వీటిని మూడు, నాలుగు అంగుళాల దాకా పెరగనిచ్చి అన్నిరకాల వంటలలో వాడుకోవచ్చు, లేక నేరుగా తినవచ్చు. ఆకుకూరల కంటే 40శాతం పోషకాలు ఎక్కువంటున్నారు పోషకాహార నిపుణులు.
వీటిని పెంచే మట్టి కలుషితం కాకుండా చూసుకోవాలి. మనదేశంలో క్యాన్సర్లు పెరగటానికి కారణం పురుగుమందులతో కలుషితమైన నేలే అని అనేక అధ్యయనాలలో తేలింది. మొలకలకన్నా పెద్దగాను ఆకుల కన్నా చిన్నగాను ఉండే మైక్రో గ్రీన్స్ లో విటమిర్ కె,ఇ,సి తో పాలు కెరటోనాయిడ్లు నాలుగు నుండి ఆరుశాతం దాకా ఎక్కువని పరిశోధనలలో తేలింది. ఎర్ర క్యాబేజీ, ఎర్రతోటకూర, ఆకపచ్చ ముల్లంగి వీటి మైక్రో గ్రీన్స్ లో ఎక్కువ పోషకాలు ఉన్నాయంటారు పోషకాహార నిపుణులు.
రెండు, మూడు అంగుళాలు పెరిగిన ఈ చిట్టి మొక్కలు ఘూటైన సువాసన కలిగి ఉన్నందున రుచిగా ఉంటాయి. ముఖ్యంగా మైక్రోగ్రీన్స్ లోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫినాలిక్ పదార్ధాలు, కెరటోనాయిడ్లు ...క్యాన్సర్లు, హృద్రోగాలు, ఊబకాయం, హార్మోన్ల కొరత, మధుమేహం, ఆల్జీమర్స్, బి.పి వంటి అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయని జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్ లు వీటి నుండి లభిస్తాయని పరిశోధనలు తెలియచేస్తున్నాయి.