బెండకాయలను పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకూ అందరూ ఇష్టపడతారు. తక్కువ కెలొరీలూ, ఎక్కువ పోషకాలతో ఉండే బెండ క్రమం తప్పకుండా తినాల్సిన కూరగాయ. ఇంట్లో పెంచుకుంటే తాజాగా, లేతగా, పురుగు మందులు లేని రుచికరమైన బెండకాయలు సొంతమవుతాయి.
బెండకాయను లేడీస్ ఫింగర్ అనే కాదు, ఓక్రా అనీ అంటారు. ఇది గోంగూర కుటుంబానికి చెందింది. బెండను ఏడాది పొడవునా పండించుకోవచ్చు. దీనికి ఎండ బాగా కావాలి. కనీసం 5-6 గంటలన్నా ఎండ పడేలా చూసుకోవాలి. బలంగా పెరిగే తల్లివేరు వల్ల నారు కాకుండా నేరుగా విత్తనాలే నాటుకోవాలి. దీనికి నీరు నిల్వకూడదు. నేలలో అయితే అడుగున్నర దూరంతో బోదెల మీద నాటుకోవాలి. విత్తనాలను అంగుళం లోతులో నాటుకోవాలి.
నేల తయారు చేసుకునేటప్పుడే పశువుల ఎరువూ, వేపపిండి వంటివి కలిపి మట్టిని బాగా తిరగేసి సారవంతంగా చేసుకోవాలి. కుండీలయితే లోతు ఎక్కువగా ఉన్నవి ఎంచుకోవాలి. 20 లీటర్ల పాత పెయింట్ బక్కెట్లు కూడా బెండను పెంచుకోవడానికి బాగా అనువుగా ఉంటాయి. పాదుకు 2-3 విత్తనాల చొప్పున నాటుకుని 3-4 ఆకులు వచ్చాక బలహీనమైన మొక్కలను తీసేసి ఒక్కో బలమైన మొక్క చొప్పున ఉంచుకోవాలి. కుండిలోనైనా 1-2 మొక్కలకు మించి నాటుకోకపోవడం మంచిది.
రెండు నెలలకో కాపు... నాటిన 5-8 రోజుల్లో బెండ గింజలు మొలకెత్తుతాయి. మొలకెత్తిన నెలరోజులకు పూత రావడం మొదలవుతుంది. పూత వచ్చిన వారానికే కాయలు తయారవుతాయి. అప్పటి నుంచి దాదాపు రెండు నెలలపాటు కాపు ఉంటుంది. బెండకాయలు లేతగా ఉంటేనే రుచిగా ఉంటాయి. అందుకే రెండురోజులకోసారి కోస్తుండాలి. ఓ పది మొక్కలుంటే చాలు, ఇంటి అవసరానికి సరిపోతాయి. పూత రావడం మొదలయ్యాక 10 రోజులకొకసారి జీవామృతం పోస్తూ ఉంటే కాపు బాగా వస్తుంది. మనం ముందుగానే మట్టి మిశ్రమంలో వేపపిండీ, ఆముదం పిండీ, జీవ కీటక, శిలీంద్ర నాశనులను పశువుల ఎరువు లేదా వర్మికంపోస్టుకలుపుతాం కాబట్టి చీడపీడలు ఆశించే ప్రమాదం చాలా తక్కువ. అప్పుడప్పుడూ వేపకషాయం చల్లుతూ ఉంటే ఆ భయం కూడా ఉండదు.
రకాలున్నాయి... ఇంట్లో పెంచుకునే మొక్కలే కాబట్టి పూర్తిగా నేల పొడారిపోకుండా 2 - 3 రోజులకోసారి నీళ్లు పోస్తుంటే సరిపోతుంది. ఏడాది పొడవునా బెండకాయలు మనింట్లో ఉండాలంటే రెండు నెలలకొకసారి గింజలు నాటుకుంటే ఒక పంట అయ్యేలోపు మళ్లీ కొత్త మొక్కల నుంచి కాపు రావడం మొదలవుతుంది.
మీకు నాణ్యమైన నాటు విత్తనాలు దొరికితే సరే, లేకపోతే హైబ్రిడ్ రకాలైన జనార్ధన్, హరిత, అర్క అభయ్, అర్క అనామిక లాంటి వాటికోసం ప్రయత్నించండి. ఈ రకాలు వైరస్ తెగుళ్లను కూడా తట్టుకుంటాయి. కో1 రకం బెండకాయలు గులాబి ఎరుపు రంగులో ఉంటాయి. రుచిలో తేడా ఏమీ ఉండదు. కానీ ఆకుపచ్చ కాయలతో పాటు చూస్తే అందంగా ఉంటాయి కదా. కాయలు ముదిరిపోతే వాటిని మొక్క మీద అలానేఉంచి ఎండిన తరువాత విత్తనాలు తీసి మళ్లీ వాడుకోవచ్చు.
- బోడెంపూడి శ్రీదేవి, ల్యాండ్‌స్కేప్ కన్సల్టెంట్…సౌజన్యంతో