గుమ్మడి కాయని చాలామంది కూరగాయ అనే దృష్టితోనే చూడరు. కానీ ప్రపంచంలో గుమ్మడిని అధికంగా పండించే దేశాల్లో చైనా తరువాత స్థానం మనదే! గుమ్మడిలో చాలా రకాలున్నాయి. రకరకాల ఆకారాల్లో, పరిమాణాల్లో, గోధుమా, ఆకుపచ్చ రంగుల్లో లభిస్తుంది. మనం ఎక్కువగా పులుసూ, కూర చేసుకుంటాం. అయితే ప్రపంచవ్యాప్తంగా దీంతో ఎన్నో రకాల స్వీట్లూ, కేకులూ, ఇతర బేకింగ్ పదార్థాలూ, పానీయాలు తయారు చేస్తారు. విదేశాల్లో హాలోవీన్ పండగకు ముఖ్య అలంకరణ దీంతోనే.
గుమ్మడిలో పోషకాలూ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. కంటిచూపు మెరుగవడం మాత్రమే కాదు నిద్ర కూడా బాగా పడుతుంది. దీని కాయలే కాదు ఆకులూ, పూలూ, కొమ్మలూ, గింజలు... ఇలా అన్నీ ఔషధ గుణాలున్నవే.
ఎప్పుడు నాటుకోవచ్చు!
గుమ్మడిని దాదాపు సంవత్సరం పొడవునా పండించొచ్చు. రకాన్ని బట్టి నాటిన దగ్గర్నుంచి కాయ పూర్తిగా తయారవడానికి 70 నుంచి 120 రోజులు పడుతుంది. అన్ని నేలల్లోనూ పండినా, నీరు నిలవని సారవంతమైన మట్టి మిశ్రమం దీనికి అనుకూలం. కుండీలో పెంచుకునేటప్పుడు ఎర్రమట్టి, పశువుల ఎరువులతోపాటు ఇసుక కూడా కలిపిన మట్టి మిశ్రమం తయారు చేసుకుంటే మంచిది. దీనిలో పిండి ఎరువులూ, ఎముకల పొడి కూడా కలిపితే రసాయన ఎరువుల అవసరం ఉండదు. కుండీల కంటే పెద్దపెద్ద రీపర్ చెక్కపెట్టెలు గుమ్మడి పాదుకు అనువుగా ఉంటాయి.
పాదులో లేదా కుండీలో మూడునాలుగు గింజలు నాటుకోవాలి. మొలకలు పెరిగి నాలుగైదాకులు వేశాక ఆరోగ్యంగా ఉన్న మొక్కను ఉంచి మిగిలిన వాటిని తీసేయాలి. సాధారణంగా నాటిన 10-12 రోజుల్లో గుమ్మడి విత్తనాలు మొలకెత్తుతాయి. విత్తనాలను బీజామృతం లేదా ట్రైకోడెర్మా పేస్టుతో కలిపి, నీడలో ఆరబెట్టి నాటుకోవడం మంచిది. ఇప్పుడు జులై-ఆగస్టులో నాటుకోవచ్చు.
తొట్టెలో లేదా నేలలో దీంతోపాటు మొక్కజొన్నా, గోరుచిక్కుడూ, ముల్లంగి కూడా ఒకటి రెండు మొక్కలు కలిపి నాటుకుంటే మంచిది. ఇవి చక్కని స్నేహితుల్లా చీడపీడల నుంచి ఒకదానినొకటి రక్షించుకుంటాయి. అయితే అన్ని మొక్కలు నాటినప్పుడు అన్నిటికీ సరిపడా పోషకాలు ఇస్తుండాలి. అన్నిటి వేరు వ్యవస్థకూ సరిపడేలా తొట్టె పరిమాణం ఉండాలి.
మొక్కకు పది కాయలు!
గుమ్మడికి క్రమం తప్పకుండా నీళ్లు పోయాలి. కుండీల్లో మట్టి త్వరగా పొడిబారుతుంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. గుమ్మడిలో ఆడపూలూ, మగపూలు వేర్వేరుగా ఉంటాయి. పూత వచ్చే సమయంలో పలచగా చేసిన పుల్లటి మజ్జిగను చల్లుతూ ఉండటం వల్ల ఆడపూలు ఎక్కువగా వస్తాయి. గుమ్మడి పాదు ఆరు నుంచి పది కాయలు కాస్తుంది. జీవామృతం, పంచగవ్వ, వర్మివాష్ లాంటివి మొదట్లో పదిరోజులకు ఒకసారి, పిందె పడ్డాక వారానికొకసారి ఇస్తూ ఉంటే చక్కగా పెరిగి పెద్దకాయలు వస్తాయి. అర్క సూర్యముఖి, అర్క చందన్, సరస్, సువర్ణ, సూరజ్, అంబి... గుమ్మడిలో అభివృద్ధి పరచిన రకాలు.
మిరపా, గన్నేరు, జట్రోపా ఆకుల కషాయాలు చల్లుతూ ఉండటం వల్ల ఆకు తినే పురుగులూ, రసం పీల్చే పురుగులు అదుపులో ఉంటాయి. లాంటానా ఆకుల కషాయం పొడ తెగులును తగ్గిస్తుంది. వెల్లుల్లీ, పుదీనా, లేదా మునగాకు కషాయాలు ఆకుమచ్చను, ఇతర తెగుళ్లను అదుపులో ఉంచుతాయి. ఈ కషాయాలన్నీ అప్పుడప్పుడూ చల్లుతూ ఉండటం వల్ల చీడపీడలు మొదట్లోనే అదుపులో ఉండి మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. వేప కషాయం మాత్రం గుమ్మడి మీద వాడకపోవడమే మంచిది. దీనివల్ల ఒక్కోసారి ఆకులు మాడిపోతాయి.
రసాయన పురుగు మందులు వాడకుండా ఉన్నప్పుడు సీతాకోక చిలుకలూ, తేనెటీగలే పరాగ సంపర్కపు బాధ్యత తీసుకుంటాయి. గుమ్మడిలో కొవ్వుశాతం చాలా తక్కువ ఎ, సి, ఇ, బి1, బి2, బి6, బి12 విటమిన్‌లతోపాటు పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, ఇనుము, రాగి లాంటి ఖనిజ లవణాలూ అధికంగా ఉంటాయి. గుమ్మడి గింజల్లో ఒమేగా3 ఫ్యాటీ ఆసిడ్లు అపారంగా ఉంటాయి. సరిగ్గా చెప్పాలంటే ఇదో పోషకాల గని. ఆరోగ్యంగా, నాజుగ్గా ఉండాలనుకుంటే వెంటనే గుమ్మడిని తినడం అలవాటు చేసుకోండి.