టొమాటోలో పోషకాలు ఎక్కువ. గుండె జబ్బులూ, క్యాన్సర్ను నిరోధించే లైకోపిన్ అధికం. విటమిన్లు - బి, సి, కె లతోపాటు పొటాషియం కూడా ఎక్కువే. కొలెస్ట్రాల్ను తగ్గించడం, రక్తప్రసరణను క్రమబద్ధం చేయడం, మూత్రపిండాలను సంరక్షించడం... లాంటి ఎన్నో ప్రయోజనాలు దీనివల్ల కలుగుతాయి.
ప్రపంచంలో అత్యధికంగా సాగులో ఉన్న కూరగాయల్లో అధిక పోషకాలున్న కూరగాయ టొమాటో. దీని శాస్త్రీయ నామం లైకోపెర్సికమ్ ఎస్క్యులెంటమ్. అధిక వర్షాలూ, అత్యధిక ఉష్ణోగ్రతలు టొమాటో పండించడానికి ఆటంకాలైనా... ఈ పరిస్థితులను తట్టుకునే రకాల రూపకల్పన వల్ల దీన్ని అన్ని కాలాల్లోనూ పండించవచ్చు.
టొమాటోకు సాధారణంగా చీడపీడల బెడద ఎక్కువ. సేంద్రియ పద్ధతిలో పెంచుకునేటప్పుడు దేశవాళీ రకాలు లేదా తెగుళ్లను తట్టుకోగలిగిన సంకర రకాలను ఎంచుకోవాలి. మనమే నారు పోసుకోదలచుకున్నప్పుడు ట్రైకోడెర్మా పొడి కొద్దిగా విత్తనాలకు కలిపి నారు పోసుకోవాలి. సాధారణంగా 20-25 రోజుల వయసున్న నారును నాటుకుంటే మంచిది. నాటిన రెండు నెలలకు కాపు మొదలై మరో రెండో నెలల వరకూ కొనసాగుతుంది. నేలలో అయితే పశువుల ఎరువూ, జీవ ఎరువులు కలిపి చక్కగా తయారుచేసిన మళ్లలో, బోదెల మీదా అడుగున్నర దూరంతో నాటుకోవచ్చు. అదే కుండీలో అయితే ముందే తయారుచేసి పెట్టుకున్న సారవంతమైన మట్టి మిశ్రమంలో కుండీ సైజును బట్టి 2 - 3 మొక్కలు నాటుకోవాలి.
మూడు రకాల్లో...
టొమాటోలో నిలువుగా పెరిగేవి, కొద్దిగా సాగేవి, ఎక్కువగా సాగేవి అని మూడు రకాలుంటాయి. సాగే రకాలైనా కొద్దిగా పెరగ్గానే వెదురు బద్దలు లేదా కర్రలను ఆధారంగా కట్టుకుంటే చక్కగా పెరుగుతాయి. 2-3 రోజులకొకసారి నీళ్లు పోస్తే చాలు. ఎరువులు ముందే కలుపుతాం కాబట్టి నాటిన వారం, పది రోజులకోసారి జీవామృతం, వర్మివాష్, వీలైతే పంచగవ్వ లాంటివి ఇస్తుంటే మొక్క ఆరోగ్యంగా పెరిగి బాగా కాస్తుంది. సేంద్రియ పద్ధతిలో పెంచుకునేటప్పుడు ఒకసారి టొమాటో నాటిన మట్టిలో రెండోసారి వేరే కూరగాయలేవైనా అంటే... వంగా, మిరపా, క్యాప్సికమ్, (ఒకే కుటుంబానికి చెందినవి) కాకుండా నాటుకోవాలి. ఫ్రెంచ్ బీన్స్, గుట్టచిక్కుడూ, గోరు చిక్కుడు లాంటివి నాటుకుంటే నేల సారవంతం కావడమే కాదు, తెగుళ్ల సమస్యా తగ్గుతుంది. ఈ పంటలు తీసేశాక మళ్లీ టొమాటోను అదేచోట నాటుకోవచ్చు.
మొక్కలే రక్షణగా...
ఎండుటాకులు ఎప్పటికప్పుడు తీసేసి మొక్క చుట్టూ శుభ్రంగా ఉంచుకోవాలి. కుండీలయితే దూరం దూరంగా అమర్చి మొక్కలకు సరిగా గాలి తగిలేలా చూసుకోవాలి. వర్షాలు పడుతున్నప్పుడు కుండీల్లో నీరు నిలవనివ్వకూడదు. పురుగులూ, తెగుళ్లు ఆశిస్తున్నాయా లేదా అనేది ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. ఈ జాగ్రత్తల వల్ల పురుగు మందులు ఎక్కువ వాడనవసరం లేకుండా మొక్కలు ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. తీపి జొన్న మొక్కలు కొన్ని, బంతి మొక్కలు కొన్ని టొమాటో మొక్కలతో కలిపి పెంచుకోవడం వల్ల కాయ తొలిచే పురుగు ఆశించే ప్రమాదం తగ్గుతుంది. అలాగే తోటకూరా, పుదీనా వంటివి కలిపి నాటుకోవడం వల్ల కూడా చాలా పురుగులు దూరంగా ఉంటాయి. వేప కషాయం, కానుగ కషాయం అప్పుడప్పుడూ చల్లుతూ ఉండాలి. వెల్లుల్లి కషాయం వాడటం వల్ల ఆకుమచ్చ ఎండుతెగులు లాంటివి అదుపులో ఉంటాయి. స్టికీట్రాప్స్ రెండు-మూడూ అమర్చుకోవడం వల్ల రసం పీల్చే పురుగుల సమస్య తగ్గుతుంది.
టొమాటోలోనూ చాలా రకాలున్నాయి. మనదగ్గర పులుపు ఎక్కువ ఉండే రకాలు కొందరికి నచ్చితే, తక్కువ కండతో తియ్యగా ఉన్నవాటికి మరికొందరు ప్రాధాన్యం ఇస్తారు.
బాగా పండిన కాయల నుంచి విత్తనాలు తీసి కడిగి నీడలో ఆరబెట్టి మళ్లీ పంటకు వాడుకోవచ్చు.
క్యారెట్లను టొమాటోతో కలిపి నాటుకుంటే, వాటి రుచి పెరుగుతుందట. మీ ఇంట్లో గులాబీ మొక్కలుంటే టొమాటో ఆకుల రసాన్ని నీళ్లలో కలిపి వాటిపై చల్లండి. అలా చేస్తే గులాబీ ఆకుల మీద వచ్చే నల్ల మచ్చ తగ్గుతుంది.
- బోడెంపూడి శ్రీదేవి ల్యాండ్స్కేప్ కన్సల్టెంట్ సౌజన్యంతో...