దేశవాళి చింతపండుకు ప్రత్యాయామ్నం రుధిర చింత. ఇవి మామూలు చింతకాయల లాగానే ఉంటాయి. కానీ లోపల కండమాత్రం ఎర్రగా ఉంటుంది. ఎర్ర చింత రకాన్ని అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేకులకుంటలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. ‘అనంత రుధిర’ అనే పేరుతో ఈ కొత్త రకాన్ని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి దేశవ్యాప్తంగా విడుదల చేసింది.
గింజ సైజు తక్కువగా ఉండి కండ ఎక్కువగా ఉన్న ఈ ఎర్ర చింతకాయలపైన శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు, పరిశోధనలు చేసి వీటిలో ఆంథోసైనిన్లు పుష్కలంగా ఉన్నట్లు గుర్తించారు.ఇవి యాంటీ ఆక్సిడెంట్లలాగా పనిచేసి శరీరంలోని విషవ్యర్ధాలను బయటకు పంపుతాయి. బి.పి., మూత్ర సమస్యలను అదుపులో ఉంచుతాయి.
ఎర్రచింతతో అనేక ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. ఈ రకం చింతపండు, ఇతర ఉత్పత్తులు ఆరోగ్యపరంగా మనిషి ఎంతగానో మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. మానవ శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ (చెడు కలిగించే పదార్థాల)ను ఇవి నిర్వీర్యం చేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే ఇందులో టార్టారిక్ యాసిడ్, భాస్వరం, పొటాషియం, నియాసిన్, రెబోఫ్లేవీన్, బీటా కెరోటిన్ లాంటి విటమిన్లు, మినరల్స్(ఖనిజాలు) ఉన్నట్లు తేలింది. మరీ ముఖ్యంగా టార్టారిక్ యాసిడ్ 16 శాతం ఉంటుంది. దీన్ని చింత తొక్కుగా, చింతపండుగా వంటకాల్లో వాడితే మంచి రుచిని ఇస్తుందన్నారు.
ఎర్ర చింతపండును వినియోగించి జామ్, జెల్లీ, సాస్, చిక్కటిగుజ్జు, పొడి, టోఫీస్(చాక్లెట్లు), బేకరీ పదార్ధాల తయారీలో వాడుకుండే ఆయా ఉత్పత్తులు సహజమైన ఎర్ర రంగుతో అదనపు పోషక విలువలతో కూడి మరింత ఆకర్షణీయంగా మారుతాయని డా. శ్రీనివాసులు అంటున్నారు.
మనం నిత్యం వాడే చింతపండుతో పోలిస్తే ఇది మరింత రుచిగా ఉంటుందంటున్నారు. అంతేకాకుండా ఈ చింతపండు కూరలలో వేస్తే కూరల రంగు, పులిహోర రంగు ఎర్రగా మారుతుందట. నోట్లో వేసుకున్నా నోరంతా ఎర్రగా మారుతుందంటున్నారు.
వర్షాభావ పరిస్థితులను తట్టుకునే వాణిజ్య పంట కావటం, ఏటా పంట చేతికి రావటంతో రైతులు రుధిర చింత సాగుకు ఆసక్తి చూపుతున్నారు.
చెట్లు, కొమ్మలు గుబురుగా, దట్టంగా పెరుగుతాయి, కొన్ని దశాబ్దాల పాటు పెద్ద చెట్లుగా ఎదుగుతాయి కాబట్టి ఎటు చూసినా 8 మీటర్ల దూరంలో చింత మొక్కలు నాటుకోవాలన్నారు. మొక్కలు నాటిన తర్వాత ఐదో ఏడాది కాపునకు వస్తాయి. పూత వచ్చిన 7–8 నెలలకు పండ్లు తయారవుతాయి. తొలి ఏడాది చెట్టుకు 15–20 కిలోల చింతపండ్ల దిగుబడి వస్తుంది. 10–12 సంవత్సరాల చెట్టు ఏటా 40–50 కిలోల దిగుబడినిస్తుంది. 20 సంవత్సరాల నుంచి ఒక్కో చెట్టుకు ఏటా 70–80 కిలోల చొప్పున చింత పండ్ల దిగుబడి వస్తుంది.
ఈ చెట్లు కావలసిన వారు అనంతపురు రేకులకుంట పరిశోధనా కేంద్రం వారిని సంప్రదించవచ్చు. ఫోన్ : 08554-261655