సాధారణంగా కూరగాయల్ని కుండీల్లో లేదా గ్రో బ్యాగుల్లో పెంచుకోవాలనుకుంటే అయిదు పాళ్ల చొప్పున ఎర్రమట్టీ, కోకోపీట్, ఇసుకా, పశువుల ఎరువూ/కంపోస్టూ/వర్మికంపోస్టూ... ఒక పాలు ఎముకల పొడీ, రెండు పాళ్లు వేపపిండి / ఆముదంపిండి / కానుగ పిండి కలపడం మంచిది. ఈ మిశ్రమం సారవంతంగా ఉంటుంది. నీరు కూడా నిలవదు. త్వరగా పొడారిపోదు. చెదలూ, వేరు పురుగులూ రావు. పైగా ఇది తేలికగా ఉంటుంది కాబట్టి కుండీలను అటూ ఇటూ జరపడమూ సులువే. మిద్దె మీదా, బాల్కనీలో ఉంచినా బరువు ఎక్కువ పడదు.
వీలైతే ట్రైకోడెర్మా విరిగె, సూడో మోనాస్ లాంటి జీవ శిలీంద్ర నాశనులను, అజటోబాక్టర్, ఫాస్ఫోబ్యాక్టీరియా లాంటి జీవ ఎరువులను ఒక్కోటి వంద గ్రాముల చొప్పున తీసుకోవాలి. దీన్ని పది కిలోల పశువుల ఎరువు లేదా కంపోస్టుకు కలిపి, కొద్దిగా నీళ్లు చల్లి, నీడలో, పైన గోనె సంచితో కప్పి, వారం, పదిరోజుల తరువాత మట్టి మిశ్రమంలో కలిపితే ఎంతో మంచిది. ఇలా తయారు చేసిన ఎరువును మిగిలిన ఎరువులో కలిపి మట్టి మిశ్రమంలో కలిపేసుకోవచ్చు. ఇది ఎక్కువైనా నష్టమూ ఉండదు. మొక్కకు మేలు చేసే బ్యాక్టీరియా వృద్ధి చెంది మొక్కలకు పోషకాలు అదనంగా అందజేయడమే కాకుండా వ్యాధినిరోధక శక్తీ పెంచుతాయి.
గ్రో బ్యాగులు కూడా గుండ్రంగా, చతురస్రంగా, దీర్ఘచతురస్రంగా... ఇలా మనకు కావాల్సిన సైజుల్లో దొరుకుతాయి. కుండీలతో పోలిస్తే ఇవి బరువూ, రేటు రెండూ తక్కువే. అంతేకాదు ఎక్కువ కాలం మన్నుతాయి. ఆకుకూరల దగ్గర్నుంచీ పండ్ల మొక్కల వరకూ పెంచుకోవడానికి అనువైనట్టు పట్టణాల్లోనూ దొరుకుతున్నాయి. ఆన్‌లైన్‌లోనూ తెప్పించుకోవచ్చు. ఇవే కాదు, ప్యాకింగ్ చెక్క పెట్టెలూ, పాత ప్లాస్టిక్ డబ్బాలూ, పాత బకెట్‌లూ... వేటిలోనైనా పెంచుకోవచ్చు. మంచి మట్టి మిశ్రమం, సరిపడా వెలుతురూ, నాణ్యమైన విత్తనాలూ లేదా నారు... అన్నిటినీ మించి మీ శ్రద్ధ ఉంటే చాలు... ఆరోగ్యకరమైన, రుచికరమైన కూరగాయలు పెంచుకోవడం సులువు.
- బోడెంపూడి శ్రీదేవి, ల్యాండ్‌స్కేప్ కన్సల్టెంట్