దుంపజాతికి చెందిన అధిక పోషకాలుండే కూరగాయల్లో చేమదుంప (చేమగడ్డ) ప్రముఖంగా చెప్పొచ్చు. సాధారణంగా దుంపల్లో పిండిపదార్థాలు ఎక్కువ. దాంతో బరువు పెరుగుతామనుకుంటాం. కానీ చేమదుంపలో పీచు అధికంగా ఉండటంతో బరువు తగ్గడం కూడా సులువే.
చేమదుంపను ఆర్వి, టారో, ఎలిఫెంట్ ఇయర్ అని రకరకాలుగా పిలుస్తారు. మూడు అడుగుల ఎత్తు పెరిగే ఈ మొక్క లేతాకు పచ్చరంగులో ఉండే పెద్దపెద్ద ఆకులతో అలంకరణ మొక్కలా కనిపిస్తుంది. ఎండతోపాటు కొద్దిపాటి నీడ ఉన్నా చేమదుంపను చక్కగా నాటుకోవచ్చు. లావుగా, గుండ్రంగా ఉండే తల్లి దుంపల కంటే, కొంచెం పొడవుగా, కోలగా ఉండే పిల్ల దుంపలే నాటుకోవడానికి శ్రేష్ఠమైనవి.
నేలలో నాటుకునేటప్పుడు అడుగున్నర దూరంతో బోదెల మీదా, అదే కుండీలో అయితే వెడల్పాటి కుండీలో నాటుకోవాలి. కుండీ కనీసం అడుగులోతు ఉండాలి. దుంపల్ని 2-3 అంగుళాల లోతులో నాటుకోవాలి. దుంపలను బీజామృతం లేదా ట్రైకోడెర్మా విరిడి కలిపిన నీళ్లలో అరగంట నానబెట్టి, ఆ తరువాత ఆరబెట్టి నాటుకోవాలి. దుంపలు నాటిన దగ్గర్నుంచి పంట తీసుకోవడానికి ఆరేడు నెలలు పడుతుంది. అందువల్ల మట్టిమిశ్రమంలో పశువుల ఎరువు, పిండి ఎరువులు కలిపి సారవంతంగా ఉండేలా చూసుకోవాలి.
సాధారణంగా జూన్-జులై, ఫిబ్రవరి-మార్చి నెలల్లో నాటుకుంటారు. ఇంటిల్లిపాదికీ సరిపడా చేమదుంపలు కావాలంటే మనిషికి రెండుమూడు కుండీల్లో చొప్పున (10-15 మొక్కలు) నాటుకోవాలి.
ఆకులూ ఉపయోగమే!
చేమదుంపకు నేల సారవంతంగా, తేమగా ఉండాలి. ఇసుక పాలు ఎక్కువగా ఉంటే దుంపలు బాగా తయారవుతాయి. ఆమ్లతత్వం ఉన్న నేల అనుకూలం. అందువల్ల వాడేసిన టీపొడి, కాఫీ పొడి, మట్టి మిశ్రమంలో కలపడంతోపాటు ఎరువుగా కుండీలో కూడా వేయచ్చు. చేమదుంపలో దుంపలే కాకుండా ఆకులు కూడా కూరగాయగా వాడుకోవచ్చు. దుంపలో కంటే ఆకుల్లోనే విటమిన్లు అధికం. అన్ని ఆకులు ఒక్కసారిగా కోయకుండా ఉంటే కొత్త ఆకులు మళ్లీ మళ్లీ వస్తుంటాయు.
కషాయాలు తప్పనిసరి!
చేమదుంపకు ఎక్కువ బలం కావాలి. వర్మికంపోస్టు, ఆముదం పిండి, వేరుశనగ పిండి, వేప పిండి కలిపిన మిశ్రమాన్ని నెలకొకసారి వేయడంతోపాటు పది రోజులకోసారి పంచగవ్వ, జీవామృతం, వర్మివాష్‌లను మార్చి మార్చి చల్లాలి. చేమదుంపను దుంపకుళ్లు తెగులు ఆశించకుండా నిమ్మగడ్డి లేదా బొప్పాయి ఆకులు మరగించి చల్లార్చిన నీళ్లను చల్లుతూ ఉండాలి. అలాగే ఆకుమచ్చ రాకుండా మునగాకు కషాయం, మందార ఆకు కషాయం చల్లాలి. వేప, మిరప కషాయాలు చల్లుతుంటే రసం పీల్చే పురుగులు తగ్గుముఖం పడతాయి. చేమదుంపలో అనేక ఖనిజలవణాలు, విటమిన్లు ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు, పీచు అధికం, కెలొరీలు బాగా తక్కువ.
- బోడెంపూడి శ్రీదేవి, ల్యాండ్‌స్కేప్ కన్సల్టెంట్