header

After delivery Precautions……ప్రసవం తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు

After delivery Precautions……ప్రసవం తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు - డా॥ ఇవటూరి రామకృష్ణ
మాతృత్వం ప్రతి స్త్రీకి భగవంతుడిచ్చిన వరం. కాని ఒకసారి గర్భం వచ్చాక, ప్రసవం తర్వాత స్త్రీ తన శరీర సామర్థ్యాని, సౌందర్యాన్ని, సౌకుమార్యాన్ని, లాలిత్యాన్ని కోల్పోయి ఒళ్ళు వచ్చి పొట్ట జారి, స్తనాలు సడలి, నడుం పెద్దదై తన పూర్వపు యవ్వనపు సౌరభాన్ని కోల్పోయినట్లు అనిపిస్తుంది.
అలాగే రాత్రి తన మడత పడ్డ పొట్ట, ఆపరేషన్‌ ప్రసవం కారణంగా పడ్డ కుట్లు, నల్ల మచ్చలు, కొట్టవచ్చినట్లు కనబడి బాధ అనిపిస్తుంది. అందుకే ఆ అందం సడలకుండా ఆ ముడతలు లేకుండా పొట్ట బరువు పెరగకుండా, నడుం నిలకడగా ఉంచుకోవడానికి ఆయుర్వేద ఆచార్యులు చక్కటి సంరక్షణను ప్రతిపాదించారు. అదే సూతికా పరిచర్య. ఈ సూతికా కాలాన్ని పోస్ట్‌ పార్టమ్‌ అంటారు. ఆధునికులు. ప్రసవం అయ్యాక తొలి నలభై రెండు రోజులను సూతికా కాలం లేదా పోస్ట్‌ పార్టమ్‌ పిరీయడ్‌ అంటారు.
ఈ కాలాన్ని చక్కగా సంరక్షించుకోవడం అటు తల్లికి, ఇటు శిశువుకు కూడా ప్రయోజనకరం. అంతే కాదు ముఖ్యమైనది కూడా. ఈ కాలంలో తీసుకునే ప్రత్యేక జాగ్రత్తలు ఆమె భవిష్యత్తు శోభయమానంగా ఉండటానికి, శిశువు ఆరోగ్య వంతంగా పెరగటానికి దోహదపడుతుంది.
నభైరెండు రోజులు చాలు : పది నెలలు మోసి ఆ కాలంలో ఎన్నో ఒడిదుడుకులు పడి చురకత్తి కోతలాంటి ప్రసవంలో ఒక కొత్త ప్రాణికి జన్మనిచ్చిన తరువాత ఆ శరీరం, మనస్సు, గుండె, హార్మోన్సు, చర్మ, ముఖం చివరికి ఆత్మ సాధారణ స్థితికి చేరుకోవటం సహజ పరిణామమైనా మన తీసుకునే జాగ్రత్తలు మరింత దోహదపరుస్తాయి. ఈ అవస్థలో ఏ మాత్రం హెచ్చుతగ్గులు జరిగినా, స్త్రీ గర్భాశయంలో లోపాలు, హార్మోన్లలో తేడాలు, అయితే అక్షయం లేదా అధిక బరువు పెరగడం స్త్రీ జననేంద్రియాల వ్యాధులు రావటానికి అవకాశం ఉంది.
సూతికా కాలంలో మనం జాగ్న్రత్తలు అంటే కాస్త విశ్రాంతిగా ఉంటే సహజ పరిణామంలోనే అంతకు ముందు గర్భిణీ కాలంలోనూ, తీవ్రమైన ప్రసవ వేదనలోనూ సంక్షుభితమైన అవయవాలన్నీ సాధారణ స్థితిని చేరుకుంటాయి.
ఆ కాలంలో కారు నడపటం, స్కూటర్‌ డ్రైవ్‌ చేయటం, ఆటలలో గెంతటం మానేయడం మంచిది. ఆ సమయంలో బయట స్నేహితులవద్దకు వెళ్ళటం,ఇంట్లో ఎక్కువ సేపు బయట స్నేహితులతో గడపడం తగ్గించడం మంచిది. ఎందుకంటే వాళ్ళనుంచి ఇన్ఫెక్షన్‌ త్వరగా సోకుతుంది. ఈ కాలంలో తల్లి కాస్త జాగ్రత్త పడితే తనకీ, తన బిడ్డకీ వచ్చే కడుపుబ్బరం, కడుపునొప్పి, నిద్రరాకపోవడం, చికాకుగా ఉండడం, నిర్లిప్తత వంటివి రావు. ఈ సూతికా పరిచర్యవల్ల తల్లి తన భవిష్యత్తులో ఎదురయ్యే శారీరక పరంగా, మానసిక పరంగా ఒత్తిడిని తట్టుకొనే శక్తి, ఆత్మశక్తి దైవబలం సమకూర్చుకో గలుగుతుంది.
సున్నితంగా మసాజ్‌ : తొలి మూడు నుండి ఏడు రోజుల దాకా గోరువెచ్చని నువ్వుల నూనెతో పైనుంచి కిందకి పొట్టపైన, నడుంపైన లోతొడలలోను సున్నితమైన మసాజ్‌ చేసుకోవడం హితకరం. మొదటి మూడు రోజులు వేయించిన బియ్యంతో వండిన తేలికైన అన్నం తినడం మంచిది. ఏడవ రోజు నుండి వీలైతే జీర్ణద్రవ్యాలతో కలిపి వండిన మాంస రసం ఇవ్వడం మంచిది. అక్కడినుండి పల్చని వెడల్పయిన మొత్తటి గుడ్డతో పొట్ట, నడుంకి బిగించి కట్టుకోవటం మంచిది. దీన్ని నడికట్టు అంటారు.
సూతికా కాలంలో తల్లి వేడినీళ్ళతో స్నానం చేయాలి. కోపం, వ్యాయామం, అధికమైన శారీరక కష్టం, ముఖ్యంగా భర్తతో సంభోగం, మానేయాలి. ఈ కాలంలో పెద్దవాళ్ళు ముఖ్యంగా ప్రేమించే తల్లి మేనత్త, ఆమెని ఉత్సాహపరుస్తూ బిడ్డ పెంపకం పాలివ్వడం, బిడ్డ ఏడిస్తే కంగారుపడకండా చూడటం చేస్తే తల్లికి ఊరటనిస్తాయి.
అలాగే నడుముకి, పొట్టకీ నువ్వుల నూనె కొద్దిగా వేడిచేసి సాయంకాలం సున్నితంగా మర్దన చేసుకుంటే నడుము బలం పెరిగి, సడలిన పొట్ట బిగుతుగా వుండటానికి దోహదపడుతుంది.
తల్లి ఆహారం నువ్వుల నూనెతో కాని, నేతితో కాని తీసుకోవటం చాలా మంచిది. తల్లి సూతికా కాలంలో రోజూ కొద్ది సేపైనా బోర్లా పడుకోవటం చాలా మంచిది. పిప్పళ్లు, ధనియల పొడి, జీలకర్ర, అల్లం, మిరియాల పొడి, సైంధవ లవణంతో కూడిన బియ్యపు జావ తాగడం చాలా ఉపకరిస్తుంది. ఇది తింటే జీర్ణశక్తికి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ సూతికా కాలంలో దశమూలా ఆరిష్టం రోజూ ఒక ఔన్సు చొప్పున ఉదయం, సాయంత్రం తీసుకోవటం అవసరం. గర్భిణీ కాలంలో పెద్దదైన గర్భాశయం సహజంగానే మామూలు స్థితికి రావాలి. అది చక్కగా రావటానికి పిప్పలీ మూలం, రెండు గ్రాముల నెయ్యితో కలిపి ఏడు రోజులు ఇస్తే మంచిది. పచ్చి వంకాయ నూరి, రెండు చిటికల కర్పూరం కలిపి తేనెతో కలిపి ముద్దని యోని పైన రాసుకుంటే ప్రసవం తర్వాత వదులైన యోని గట్టిపడుతుంది. ఈ కాంలో స్నానమైన తర్వాత ఒంటికి, తలకి అగరు ధూపం వేసుకోవటం మంచి సౌందర్య సాధనం. శతావరీ కల్ప,అశ్వగంధ లేహ్యాం, శతావరీ ఘృతామృతం తీసుకుంటే మంచిది. ప్రసవం తర్వాత మీ దేహం తిరిగి పూర్వసౌష్టవం పొందాలని ప్రయత్నించండి.