header

Breast Cancer ….బ్రెస్ట్‌ క్యాన్సర్‌...

డా.సి.హెచ్‌.మోహన వంశీ, ఓమేగా హాస్పటల్స్‌, హైదరాబాద్‌. ఫోన్‌ : 98480 11421
కణాల ఎదుగుదలను నియంత్రించే మరియు ఆరోగ్యంగా ఉండేట్లుగా చేసే జన్యువులలో అసాధారణ మార్పులు జరగటం వలన క్యాన్సర్‌ వస్తుంది. దేహంలో పెరిగే అన్ని రకాల కణుతులు / ట్యూమర్లు ప్రమాదకరం కాదు. క్యాన్సర్‌ కారకమైన ట్యూమర్లు స్థనాలలో వేగంగా విస్తరిస్తూ ఇతర కణాలను కూడా వ్యాధికి గురిచేస్తాయి.
స్థనాలలో పెరిగే ఈ ప్రమాదకర ట్యూమర్‌లను ''బ్రెస్ట్‌ క్యాన్సర్‌'' అంటారు. సాధారణంగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అనేది పాలను ఉత్పత్తి చేసే గ్రంధులలోని కణజాలంలోను లేదా గ్రంథుల నుండి చనుమొనలకు పాలను సరఫరా చేసే నాళాలలోను వస్తుంది. అతి కొద్దిమందిలో స్థానాల కండరాలకు కూడా వచ్చే అవకాశం ఉంది.
90% వరకు క్యాన్సర్‌ అనేది వయసు ప్రభావం వలన జన్యువులలో కలిగే అసాధారణ మార్పులవల్ల వస్తుంది. కేవలం 10% మందిలో వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది.
చాలా వరకు క్యాన్సర్‌ కారకాలు మన నియంత్రణలో ఉండవు ఉదాహరణకు వయస్సు, కుటుంబ నేపధ్యం, ఆరోగ్య నేపధ్యం, మొదలైనవి. కాని అధిక బరువు వ్యాయామం, మధ్యపానం వంటి కారకాలను మనం నియంత్రించవచ్చు.
నియంత్రించగలిగే కారకాలు :
బరువు: అధిక బరువు కలిగిన మహిళలకు మరీ ముఖ్యంగా మెనోపాజ్‌ దాటిన వారికి క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఆహారం : వైజ్ఞానికంగా నిరూపించాల్సి ఉన్నప్పటికీ, ఆహారపు అలవాట్ల వల్ల కూడా క్యాన్సర్‌ వస్తుందనేది నిపుణుల భావన. మాంసాహారం, జంతు సంబంధిత కొవ్వు పదార్థాల వినియోగం తగ్గించడం మంచిది. ఎందుకంటే వీటిలో వివిధ రకాల హార్మోనులు, యాంటిబయెటిక్స్‌, పురుగు మందుల అవశేషాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. తక్కువ కొవ్వుశాతం గల తాజా కూరగాయలు, పండ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి.
వ్యాయామం: వ్యాయామం వల్ల క్యాన్సర్‌ అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. ప్రతిరోజూ కనీసం 45నుండి 60 నిమిషాలు వ్యాయామం చేయటం ఉత్తమం.
మధ్యపానం: మద్యపానం వలన రక్తంలో ఈస్ట్రోజోన్‌ హార్మోన్‌ స్థాయి పడిపోతుంది. దాని వలన క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి మద్యపానానికి దూరంగా ఉండటం మంచిది.
ధూమపానం : ధూమపానం వలన కూడా క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది.
ఈస్ట్రోజోన్‌ : ఈస్ట్రోజోన్‌ హార్మోన్‌ స్థనాల పెరుగుదలకు తోడ్పడుతుంది. దీర్ఘకాలం పాటు బయటనుండి ఈస్ట్రోజోన్‌ హార్మోన్‌ తీసుకోవటం వలన బ్రెస్ట్‌ క్యాన్సర్‌ పెరిగే అవకాశాలు ఎక్కువ. ఎక్కువకాలం కంబైన్డ్‌ హార్మోన్‌ రీప్లేస్‌మెంట్ థెరపిని తీసుకోవటం వలన లేదా కేవలం ఈస్ట్రోజోన్‌ హార్మోన్‌ రీప్లేస్‌మెట్ ను 10 సంవత్సరాల కంటే ఎక్కువకాలం ఎటువంటి విరామం లేకుండా తీసుకోవడం వలన క్యాన్యర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. స్ట్రెస్‌ మరియి యాంగ్జౖటీ: స్ట్రెస్‌ మరియు యాంగ్టౖటీ అనేవి క్యాన్సర్‌ కారకాలుగా వైజ్ఞానికంగా నిరూపించబడనప్పటికీ మానసిక వత్తిడి, ఆందోళలను తగ్గించుకోవటం వలన సుఖమయ జీవితాన్ని గడపవచ్చు.
క్యాన్సర్‌ను నియంత్రించలేని కారణాలు:
వయస్సు : వయస్సు అనేది మరొక పెద్ద క్యాన్సర్‌ కారకం. మీవయస్సు ఎంత ఎక్కువగా ఉంటే క్యాన్సర్‌ వచ్చే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. నిపుణుల అధ్యయనంలో తేలినది 30 నుండి 39 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో ప్రతి 233 మందిలో ఒకరికి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంది. అయితే వయస్సు 60 పై బడిన స్త్రీలలో ప్రతి 27 మందిలో ఒకరికి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వస్తుంది.
కుటుంబనేపధ్యం : మీ దగ్గరి బంధువులకు (అమ్మ, సోదరి, కూతురు) క్యాన్సర్‌ ఉన్న ట్లైతే మీకు కూడా క్యాన్సర్‌ వచ్చే అవకాశం మరింత పెరుగుతుంది.
వ్యక్తిగత నేపథ్యం : మీకు ఇదివరకే బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఉన్నట్లేౖతే అదే బ్రెస్ట్‌లో కానీ, ప్రక్క బ్రెస్ట్‌లో కానీ మరల క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
జాతి : నల్లజాతి స్త్రీలతో పోలిస్తే తెల్లజాతి స్త్రీలలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం మరింత ఎక్కువ.
ఈస్ట్రోజన్‌: ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ స్థనాల్లోని కణాలను ఉత్తేజ పరుస్తుంది. దీర్ఘకాలంపాటు ఈస్ట్రోజన్‌ హార్మోన్‌కు గురికావటం వలన బ్రెస్ట్‌ క్యాన్సర్‌ పెరిగే అవకాశం ఎక్కువ.
అయితే ఈస్ట్రోజన్‌ నియంత్రించడం అనేది కొన్నిసార్లు మన చేతుల్లో ఉండదు. ఉదాహరణకు చిన్న వయసులోనే అంటే 12 సంవత్సరాలకన్నా తక్కువ వయస్సులోనే నెలసరి ప్రారంభం కావటం అదే విధంగా 55 సంవత్సరాల తరువాత బహిష్టు ఉడిగిపోవడం (మోనోపాజ్‌) అంటే దీర్ఘకాలం పాటు నెలసరి కొనసాగితే క్యాన్సర్‌ వచ్చే అవకాశం కూడా అంత ఎక్కువే. అదే విధంగా బయటి వాతావరణం నుండి శరీరంలోని ప్రవేశించే ఈస్ట్రోజన్‌ ఉదా : మాంసాహారంలో ఉండే హార్మోన్‌లు, ఇతర ఆహారాలలో ఉండే పురుగు మందుల అవశేషాలు మన శరీరంలో ఈస్ట్రోజన్‌ను పోలిన అవశేషాలను విడుదల చేస్తాయి.
గర్భం మరియు స్థనపానం : గర్భం మరియు స్థనపానం అనేవి నెలసరుల సంఖ్యను తగ్గిస్తాయి. తద్వారా క్యాన్సర్‌ ముప్పును కూడా తగ్గిస్తాయి. 30 సంవత్సరాలు పైబడే వరకు గర్భం ధరించని స్త్రీలకు లేదా అసలు గర్భం ధరించని స్త్రీలకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువ.
దీర్ఘకాలం అంటే ఒకటి నుండి ఒకటిన్నర లేదా రెండు సంవత్సరాల వరకు పాలు ఇచ్చే తల్లులకు కూడా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం తక్కువ. అయితే అంత సుదీర్ఘ కాలం పాటు పాలు ఇవ్వడం ఈ రోజులలో సాధ్యం కావడం లేదు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికిని (మంచి ఆహారపుటలవాట్లు, వ్యాయామం) మన చేతిలో లేని పైన పేర్కొన్న అనేక రకాల కారణాలవలన బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వస్తుంది. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చినపుడు అదేదో మనం చేసిన తప్పిదం వలన వచ్చినట్లుగా కృంగిపోవటం తగదు.
సాధారణంగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అనేది కణుతుల రూపంలో బయటపడుతుంది. ఈ కణుతులు నొప్పిలేకుండాను, గట్టిగాను, సమానమైన అంచులు లేకుండా ఉంటాయి. మరికొన్ని సార్లు మొత్తగాను, సమానంగాను ఉంటాయి, కాబట్టి స్థనాలలో ఏమాత్రం మార్పు కనిపించినా వెంటనే డాక్టరుకు చూపించుకోవటం మంచిది, సాధారణంగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ సోకినపుడు ఈ క్రింద పేర్కొన్న విధంగా మార్పులు సంభవిస్తాయి.
1. స్థనాలలో వాపు, ఇరిటేషన్‌, స్థనాలలో నొప్పి, చనుమొనలలో నొప్పి చనుమొనలు లోపలికి కృంగిపోవటం, ఎరుపెక్కటం, స్థనాలు, చనుమొనలు మొద్దుబారిపోవటం, చనుమొనల నుండి పాలు కాకుండా ఇతర ద్రవాలు స్రవించడం, చంకలు క్రింది భాగంలో గడ్డలు ఉండటం మొదలైనవి.
అయితే అన్ని రకాల గడ్డలు క్యాన్సర్‌ కాకపోవచ్చు. డాక్టర్‌చే క్షుణ్ణంగా పరీక్ష చేయించుకుని నిర్థారించుకోవటం మంచిది.
క్యాన్సర్‌ను ఎంత ముందుగా గుర్తిస్తే అంత సులువుగా చికిత్స చేయవచ్చు. క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడానికి ఎప్పటికప్పుడు పరీక్షించుకోవటం ఉత్తమమైన మార్గం. 20 సంవత్సరాలు దాటిన స్త్రీలు ప్రతి నెలా స్థనాలను స్వయంగా పరీక్షించుకోవాలి.20-40 సవంత్సరాల వయస్సు గల స్త్రీలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి డాక్టర్‌చే స్థనాలను పరీక్ష చేయుంచుకోవాలి. 40 సం.లు దాటిన స్త్రీలు ప్రతి సంవత్సరం పరీక్ష చేయించుకోవాలి. 40-49 సంవత్సరాలు వయస్సు గల స్త్రీలు ప్రతి రెండు సంవత్సరాలకు డిజిటల్‌ మమ్మోగ్రఫీ ద్వారా పరీక్ష చేయించుకోవాలి. 50 ఏళ్ళ పైబడిన స్త్రీలు ప్రతి సంవత్సరం మమ్మోగ్రఫీ పరీక్ష చేయించుకోవాలి.
డిజిటల్‌ మమ్మోగ్రఫి అనేది డిజిటల్‌ రెసెస్టర్‌ మరియు కంప్యూటర్‌కి అనుసంధానిచ్చిన ఆధునిక ఎక్స్‌రే మెషీన్‌. దీని ద్వారా అత్యంత సులువుగా, వేగంగా బయాప్సీ చేయవచ్చు. మరీ ముఖ్యంగా ఇపుడు వస్తున్న ఆధునాతన డిజిటల్‌ మమ్మోగ్రఫీ మెషిన్స్‌లో వచ్చే బెడ్‌ వల్ల కూర్చుని లేదా పడుకుని కూడా అత్యంత వేగంగా బయాప్సీనీ సేకరించవచ్చు. మోమ్మోమ్‌ వంటి వాక్యూమ్‌ పవర్డ్‌ పరికరాల వలన అత్యంత ఖచ్చితంగా మల్టిపుల్‌ బయాప్సీ చేయవచ్చు.