header

Cervical Cancer…..గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌...

Cervical Cancer…..గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌... డా. పి. ఉషారాణి, గైనకాలజిస్ట్‌, ఎం.ఎస్‌.కె. క్యాన్సర్‌ హాస్పటల్‌, హైదరాబాద్‌
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌... దీన్ని తొలి దశలోనే గుర్తించగలిగితే 90-95% పూర్తిగా నయం చెయ్యచ్చు.
అసలు క్యాన్సర్‌ మార్పులు మొదలవ్వక ముందే... 'ప్రీ క్యాన్సర్‌' దశలోనే గుర్తించగలిగితే - నూటికి నూరు శాతం అది క్యాన్సర్‌గా మారకుండా అడ్డుకోవచ్చు.
అందుకే స్క్రీనింగ్‌ పరీక్షలు మనకు చాలా ముఖ్యం.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌... మనదేశంలో మధ్యవయసు స్త్రీలలో చాలా ఎక్కువగా కనబడుతున్న క్యాన్సర్‌ ఇది. పైకి ఎటువంటి లక్షణాలూ లేకుండానే.. నిశ్శబ్దంగా ప్రాణాలను హరించే క్యాన్సర్లలో ఇదే ప్రధానమైంది. మన దేశంలో ఏటా కొత్తగా 1,30,000 మంది ఈ క్యాన్సర్‌ బారినపడుతున్నారు. ఏటా సుమారు 75,000 మంది దీని కారణంగానే మరణిస్తున్నారంటే ఇదెంత పెద్ద సమస్యో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఇవన్నీ కొద్దిపాటి జాగ్రత్తలతో నివారించదగ్గ మరణాలే. ఓ 50 ఏళ్ల క్రితం పాశ్చాత్య దేశాల్లో కూడా ఎంతోమంది మహిళలు ఇలాగే ఈ క్యాన్సర్‌తో మరణిస్తుండేవారు. కానీ 'పాప్‌ స్మియర్‌' వంటి తేలికపాటి పరీక్షలు అందుబాటులోకి వచ్చాక ఆ దేశాలన్నీ దీన్ని అద్భుతంగా కట్టడి చేశాయి. క్యాన్సర్‌ ఆనవాళ్లను... చాలా ముందుగానే... అసలు క్యాన్సర్‌ మార్పులు మొదలవ్వకముందే పసిగట్టటం ద్వారా దీనిపై పెద్ద విజయమే సాధించాయి.
ఇప్పుడు ఆ స్క్రీనింగ్‌ పరీక్షలన్నీ మనకూ అందుబాటులో ఉన్నాయి. కానీ మన దేశంలో ఈ పరీక్షల పట్ల పెద్దగా అవగాహన లేకపోవటం మూలంగా చాలామంది క్యాన్సర్‌ బాగా ముదిరిపోయిన తర్వాతగానీ వైద్యులను సంప్రదించటం లేదు. ఆ దశలో గుర్తించినా చెయ్యగలిగిందేం లేదు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తుపట్టాలి.. ఆ వెంటనే మట్టుబెట్టాలి!.
ఎందుకొస్తుందీ క్యాన్సర్‌ ?
ఇతరత్రా క్యాన్సర్లతో పోలిస్తే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ ఎందుకొస్తోందన్న కారణాన్ని గుర్తించటంలో వైద్యరంగం గణనీయమైన పురోగతి సాధించింది. ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణం - 'హ్యూమన్‌ ప్యాపిలోమా' అనే వైరస్‌ అని స్పష్టంగా గుర్తించింది. దీన్నే 'హెచ్‌పీవీ' అంటారు. ఇది లైంగిక కలయిక ద్వారా సంక్రమించే వైరస్‌, పైగా సర్వ సాధారణమైన వైరస్‌. ఎంత సాధారణమైన వైరస్‌ అంటే. సమాజంలో చాలామంది స్త్రీపురుషులు జీవితంలో ఎప్పుడో ఒకసారి దీని బారినపడే వాళ్లే.
80-90 మందిలో ఈ హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్‌ దానంతట అదే తొలగిపోతుంది. మిగిలిన 10 శాతం మందిలో కూడా చాలా తక్కువ మందికే.. అది దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్‌గా మారుతుంది. లేదా తరచూ వస్తుంటుంది. వీరిలోనూ కేవలం 2-3% మందిలోనే అది 'ప్రీక్యాన్సర్‌' దశకు వెళ్లొచ్చు. ఇందుకు 10-20 సంవత్సరాలు పట్టవచ్చు. ఈ దశలో మనం గుర్తించకపోతే క్రమేపీ అది క్యాన్సర్‌గా మారుతుంది. కొందరిలో క్యాన్సర్‌గా మారకుండా అలాగే ఉండిపోనూవచ్చు. అది క్యాన్సర్‌గా మారుతుందా? మారితే ఎంత కాలానికి అవ్వచ్చు? అన్నది చెప్పటం కష్టం. అది వ్యక్తికీ వ్యక్తికీ మారిపోతుంటుంది.
వీటితో రిస్కు పెరుగుతుంది
హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్‌కు... జననాంగ అపరిశుభ్రత, ఎక్కువ గర్భాలు, ఎక్కువ కాన్పులు, చిన్న వయసులోనే లైంగిక జీవితాన్ని ఆరంభించటం, తరచుగా సుఖవ్యాధులకు గురవటం, ఎక్కువ మంది లైంగిక భాగస్వాములు ఉండటం, పోషకాహార లోపం, పొగతాగటం, హెచ్‌ఐవీ రావటం.. వింవి తోడైతే క్యాన్సర్‌గా మారే అవకాశాలు మరింతగా పెరుగుతాయి.
స్క్రీనింగ్‌ పరీక్షలు
1. 'పాప్‌ స్మియర్‌'
చాలా ఏళ్లుగా ఉన్న పరీక్ష ఇది. చిన్నదూది పుల్లతో గర్భాశయ ముఖద్వారం వద్ద నుంచి స్రవాలను తీసి చేసే పరీక్ష ఇది. దీనిలో అసాధారణ కణాలు, మార్పులుంటే వెంటనే తెలుస్తుంది. దీనితో 'ప్రీక్యాన్సర్‌' దశలోనే జబ్బును కనిపెట్టవచ్చ. ఇలా అసాధారణ మార్పులు ఉంటే... అవి క్యాన్సర్‌ తరహా మార్పులా? కాదా? అన్నది తెలుసుకునేందుకు మరికొన్ని నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలో పాజిటివ్‌ ఉన్నంత మాత్రాన అందరికీ క్యాన్సర్‌ ఉందని చెప్పలేం.
కానీ వీరిలో 80-90 ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వారికి తర్వాత తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు చెయ్యాలి. ఈ పరీక్ష 30 ఏళ్లు దాటిన మహిళలకు విదేశాల్లో ప్రతి ఏడాదీ చేస్తున్నారు. మనం కనీసం మూడేళ్లకోసారి అయినా చేయించుకోవాలి. దీంతో క్యాన్సర్‌ సోకుతుంటే చాలా చాలా తొలి దశలోనే దాన్ని గుర్తించి వెంటనే నయం చేసే వీలుంటుంది. క్యాన్సర్‌ నుంచి రక్షణగా నిలిచేది ఈ పరీక్ష అన్నది మర్చిపోకూడదు.
2. వెనిగర్‌ పరీక్ష (విజువల్‌ స్క్రీనింగ్‌)
పాప్‌స్మియర్‌ పరీక్ష మన దేశంలో పట్టణాలన్నింటిలోనూ చేస్తున్నారు. పల్లెల్లో, మారుమూల ప్రాంతాల్లో మాత్రం ఇదింకా అందుబాటులో లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని... ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో తేలిక పరీక్షను ముందుకు తెచ్చింది. దీనిలో - గర్భాశయ ముఖద్వారానికి వెనిగర్‌ ద్రావణం లేదా అయోడిన్‌ ద్రావణం పూస్తారు. అక్కడ క్యాన్సర్‌ తరహా మార్పులేమైనా ఉంటే.. కొద్దిసేపట్లోనే కనబడతాయి. నర్సులు కూడా చేయానికి వీలైన తేలిక పరీక్ష ఇది. అయితే ఇది నూటికి నూరుశాతం ఖచ్చితమైన పరీక్ష కాదు. కాబట్టి పాప్‌స్మియర్‌ చేసే వెసులుబాటు, అవకాశం లేని సందర్భాల్లో.. కొంతలో కొంత మేలు చేస్తుందని మాత్రమే దీన్ని ఆశ్రయించాలన్నది ప్రస్తుత అవగాహన.
3. హెచ్‌పీవీ డీఎన్‌ఏ పరీక్ష
అసలు ఇది ప్రీక్యాన్సర్‌ దశ కంటే కూడా ముందే... ఒంట్లో అసలు హెచ్‌పీవీ ఇన్పెక్షన్‌ ఉందా ? లేదా? అన్నది చెబుతుంది. ఇది బాగా ఖరీదైన పరీక్ష. ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తోంది. దీనికీ దూది పుల్లతోనే స్రావాలను తీసుకుంటారు. ఒకసారి ఈ పరీక్షలో 'నెగిటివ్‌' అని వస్తే ఇక క్యాన్సర్‌ భయం పెద్దగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఐదు పదేళ్ల వరకూ మళ్లీ పరీక్షలు కూడా అవసరం ఉండదు. అయితే దీనిలో పాజిటివ్‌ వస్తే - వారిలో హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్‌ దీర్ఘకాలికంగా మారిందని అర్థం. అది భవిష్యత్తులో క్యాన్సర్‌ కారక మార్పులను తెచ్చిపెట్టవచ్చు. పెట్టకపోవచ్చు. అవకాశమైతే మాత్రం ఉందని గుర్తించి.. అక్కడి నుంచీ తరచుగా పరీక్షలు చేస్తూ, మార్పులేమైనా కనబడితే వెంటనే చికిత్స చేయటం ద్వారా క్యాన్సర్‌ దరి జేరకుండానే చూసుకోవచ్చు. కాబట్ట 30 ఏళ్లు దాటిన వారు ఈ పరీక్ష చేయించు కోవటం ఉత్తమం.
ఈ స్క్రీనింగ్‌ పరీక్షలన్నీ ఉపయోగకరమైనవే. దేనిలో 'పాజిటివ్‌' వచ్చినా.. అది క్యాన్సర్‌ తరహా మార్పా? కాదా? అన్నది కచ్చితంగా నిర్ధారించుకునేందుకు మరిన్ని పరీక్షలు చెయ్యాల్సి ఉంటుంది. వీటిలో ముఖ్యమైనది : కాల్పోస్కోప్‌. ఇది కెమేరా గొట్టం వంటిది. దీనితో సర్విక్స్‌ను, యోని మార్గాన్ని, అక్కడి కణజాలాన్ని పెద్దగా చేసుకుని చూస్తూ... ఎక్కడైనా అనుమానంగా అనిపిస్తే అక్కడి నుంచి చిన్న ముక్క తీసి... పరీక్షకు పంపిస్తారు. దీనిలో అది క్యాన్సరా? కాదా? క్యాన్సరే అయితే ఏ దశలో ఉందన్నది కచ్చితంగా నిర్ధారణ అవుతుంది. ఇలా గుర్తించటం వల్ల క్యాన్సర్‌ మార్పులను ముందే కనిపెట్టవచ్చు.
30ల నుంచే మేలు!
చాలా క్యాన్సర్లు పెద్ద వయసులో ఎక్కువగా కనబడుతుంటాయి. కానీ ఈ సర్వైకల్‌ క్యాన్సర్‌ మాత్రం.. కాస్త ముందుగానే... సగటున 40-45 ఏళ్ల వయసులోనే కనబడుతుంటుంది. అంటే వీరిలో అప్పటికి 10 ఏళ్ల క్రితమే 'ప్రీక్యాన్సర్‌' మార్పులు మొదలయ్యాయని అర్థం. అందుకే 30 ఏళ్లు దాటిన దగ్గరి నుంచీ క్రమం తప్పకుండా స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోమని సూచిస్తున్నారు.
చికిత్స
అసలు హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్‌ దశ లోనే గుర్తించ గలిగితే.. ఏ చికిత్సా అక్కర్లేదు... చక్కటి ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరిస్తుంటే సరిపోతుంది. కాకపోతే క్యాన్సర్‌ మార్పులేమైనా ? అన్నది తెలుసుకునేందుకు ఏడాదికి ఒకసారైనా పరీక్షలు మాత్రం చేయించుకుంటూ ఉండాలి.
ప్రీక్యాన్సర్‌ దశలో : ఈ దశలో చాలా తేలికపాటి చికిత్స చేస్తే సరిపోతుంది. వీటికి పెద్దగా ఖర్చవ్వదు. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరమూ ఉండదు. కేవలం క్రయోథెరపీ (ఐస్‌ పెట్టటం), లేదంటే లీప్‌ (లూప్‌ ఎలక్ట్రో సర్జికల్‌ వైడ్‌ ఎక్సిషన్‌) వంటి చిన్న చిన్న విధానాల ద్వారా... 90% సంపూర్ణంగా నయమైపోతుంది. ఆ తర్వాత ఏడాదికి ఒకసారి స్క్రీనింగ్‌ పరీక్ష చేయించుకుంటే చాలు. ఒకవేళ సర్విక్స్‌ మీద చాలా పెద్ద భాగంలో మార్పులు వచ్చి... ఇతరత్రా కూడా సమస్యలున్నా.. ఈ సాధారణ చికిత్సలు చేసే అవకాశం లేకపోయినా.. అలాంటి పరిస్థితుల్లోనే సర్విక్స్‌తో సహా గర్భాశయాన్ని తొలగించే (హిస్ట్రెక్టమీ) ఆపరేషన్‌ గురించి ఆలోచిస్తారు. కేవలం పుండు ఉందని గర్భాశయం తీసెయ్యాలన్నది మాత్రం అపోహ, తప్పుడు అభిప్రాయం. ఈ దశలో ఐస్‌ పెట్టటం వంటి తేలిక చికిత్సలే సరిపోతాయి.
క్యాన్సర్‌ దశలో : ఒకసారి క్యాన్సర్‌ దశలోకి వెళితే తీవ్రమైన చికిత్సలు తప్పవు. క్యాన్సర్‌ కణాలు రక్తం ద్వారా ఒళ్లంతా వ్యాపిస్తాయి. కాబట్ట వాటిని నిర్వీర్యం చేసేందుకు రేడియేషన్‌, కీమోథెరపీ, వీటితో పాటు సర్విక్స్‌, గర్భాశయాలే కాదు.. చుట్టుపక్కల ఉండే కణజాలం, లింఫ్‌ గ్రంథుల వంటివన్నీటిని కూడా తొలగించే ర్యాడికల్‌ సర్జరీ వంటివి అవసరమవుతాయి. దశలు ముదిరిన కొద్దీ... సర్జరీ కష్టం. రేడియేషన్‌ వంటివే ఉపయోగపడతాయి. వీటి వల్ల దుష్ప్రభావాలు చాలా ఎక్కువ. పైగా స్పందన ఎలా ఉంటుందో చెప్పలేం, తగ్గినా తిరిగి వచ్చే అవకాశాలుంటాయి. ఇక స్టేజ్‌-4లో అయితే.. తాత్కాలిక ఉపశమనానికి, నొప్పులు తగ్గేందుకు సాధారణ చికిత్సల వంటివి తప్పించి ప్రత్యేకంగా క్యాన్సర్‌ తగ్గించేందుకు ఆ దశలో చెయ్యగలిగింది చాలా తక్కువ.
ముందస్తు హెచ్చరిక...ప్రీక్యాన్సర్‌!
చాలా రకాల క్యాన్సర్ల విషయంలో.. అది వచ్చిన తర్వాత సాధ్యమైనంత తొలి దశలో గుర్తించటమేగానీ అది రాక ముందే పట్టుకునే అవకాశం ఇప్పటి వరకూ లేదు. కానీ అదృష్టవశాత్తూ ఈ సర్వైకల్‌ క్యాన్సర్‌ విషయంలో మాత్రం దీన్ని 'ప్రీక్యాన్సర్‌' దశలోనే గుర్తించే వీలుంది. ఇలా గుర్తిస్తే వెంటనే సంపూర్ణంగా నయం చెయ్యచ్చు కూడా. పరీక్షల ద్వారా మాత్రమే దీన్ని కనిపెట్ట వచ్చు. అయితే బాధలేమీ ఉండకపోవటం, ఆరోగ్యంగానే తిరుగుతుండటం వల్ల స్త్రీలంతా దీని విషయంలో అశ్రద్ధ, నిర్లక్ష్యం చూపిస్తుంటారు. ఈ చిన్న నిర్లక్ష్యం పెను ముప్పు తెచ్చి పెడుతుంది.
లక్షణాలు లేకపోవటం పెద్ద సమస్య
ప్రీక్యాన్సర్‌ దశలో : ఏమీ లక్షణాలుండవు. వైద్యులు చూసినా కూడా ఏమీ తెలియదు. కేవలం 'పాప్‌ స్మియర్‌' వంటి పరీక్షల్లో మాత్రమే ఈ దశలో గుర్తించే వీలుంది.
క్యాన్సర్‌ తొలి దశలో : చాలాసార్లు ఏ లక్షణాలూ ఉండవు. మనుషులు ఆరోగ్యం గానే తిరుగుతుంటారు. కేవలం పాప్‌స్మియర్‌, కాల్పోస్కోప్‌ పరీక్షల్లో మాత్రమే దాన్ని చూడటం సాధ్యపడుతుంది.
ముదిరిన దశలో : కొద్దికొద్దిగా రక్తస్రావం కావటం, దుర్వాసనతో తెలుపు వంటి సాధారణ లక్షణాలే ఉంటాయి. సర్విక్స్‌ మీద పుండ్లు, గడ్డల వంటివి ఉండొచ్చుగానీ మొత్తానికి ఈ లక్షణాలు కనిపించే సరికే సమస్య ముదిరిందని అర్థం. అసలీ దశ వరకూ రాకుండా చూసుకోవటమే అత్యుత్తమ విధానం.
టీకాలు
గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌ రాకుండా అదృష్టవశాత్తూ టీకాలు (గర్డాసిల్‌/సర్వారిక్స్‌) అందుబాటులోకి వచ్చాయి. వీటితో హెచ్‌పీవీ 16, 18 ఉప రకాల నుంచి రక్షణ ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా టీకాలను అత్యుత్తమ నివారణ విధానంగా అనుసరిస్తున్నారు. ఆడపిల్లలంతా తప్పనిసరిగా తీసుకోవాల్సిన టీకాల్లో దీన్నీ చేర్చారు. కానీ మన దేశంలో మాత్రం రకరకాల అపోహలు, చర్చోపచర్చల కారణంగా... ప్రస్తుతం దీని వినియోగం కాస్త వెనకబాట పట్టింది. శాస్త్రీయంగా చూసినప్పుడు క్యాన్సర్‌ నివారణలో ఈ టీకాకు అత్యంత ప్రాముఖ్యం ఉంది. దీనిపై సంశయాలు పెట్టుకోవాల్సిన పని లేదు. దీన్ని లైంగిక జీవితం ఆరంభించక ముందే, 18 ఏళ్ల లోపే తీసుకోవటం ఉత్తమం.