header

Cesarean surgery( C Section)/ సిజేరియన్ సర్జరీ గురించి..

Cesarean surgery( C Section)/ సిజేరియన్ సర్జరీ గురించి..
రెండోబిడ్డ ఎప్పుడంటే...?
నార్మల్ లేదా సిజేరియన్ ఎలాంటి ప్రసవమైనా మొదటి బిడ్డకు, రెండో బిడ్డకు కనీసం రెండు నుంచి మూడేళ్ల ఎడం పాటించాలి. సర్జరీ నుండి శరీరం పూర్తిగా కోలుకొని తిరిగి రెండో గర్భానికి సిద్ధ పడటానికి సమయమివ్వాలి. అలోగా పిల్లలు కూడా పెద్దవుతారు. గర్భం దాల్చినా శ్రమ అనిపించదు. ఇక సర్జరీ తర్వాత ఆరు వారాల వరకూ రక్తస్రావమవుతూ ఉంటుంది. కాబట్టి ఇన్ ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఆరు వారాలు లేదా రక్తస్రావం ఆగే వరకు భార్యాభర్తలు ఎడం పాటించాలి.
సిజేరియన్ తరువాత..
సిజేరియన్ తరువాత నిండు ఆరోగ్యం సమకూరాలంటే మంచి ఆహారం...శారీరక వ్యాయామం...శుభ్రత... ఈ మూడు అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
ఆహారంలో ఎలాంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. బయట వండినవి తప్ప అన్నీ తినవచ్చు.
ప్రొటీన్లు, పీచు, ఐరన్ ఉండే బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి.
రోజుకు అరలీటరు పాలు తప్పనిసరిగా తాగాలి.
తాజాపళ్లు, కూరగాయలు తీసుకోవాలి.
నూనె, మసాలలు తక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి.
బాలింతకు పాలు పడటం కోసం ఆకుకూరలు, మిల్క్ బ్రెడ్, గుడ్లు, మాంసం తినవచ్చు.
మెంతికూర, ఓట్స్, వెల్లుల్లి, బాదం తీసుకుంటే పాలు పెరుగుతాయి.
మాంసకృత్తులు అత్యధికంగా లభించే మాంసం, పప్పులు తినటం వల్ల సర్జరీ గాయం త్వరగా మానుతుంది.
కొన్నినియమాలు..
సర్జరీ కుట్లు ఇన్ ఫెక్షన్ కు గురికాకుండా ఉండాలంటే శుభ్రత పాటించాలి. కానీ కొందరు కదిలితే కుట్లు ఊడిపోతాయని నీళ్లకు నాని చీము పడతాయని భయంతో వారం, పదిరోజులు స్నానం చేయకుండా ఉంటారు. ఇంకొందరు ఆకు పసర్లు, పెసరపిండితో రుద్దటం లాంటివి చేస్తారు. ఈ అలవాట్లు ప్రమాదకరం.
ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయినప్పటి నుండి ప్రతిరోజూ స్నానం చేయాలి. కుట్లు ఉన్న చోట రుద్ది శుభ్రం చేయాలి. గాయం పొడిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. వైద్యులు సూచించిన పౌడర్ వాడాలి.
దురద ఉంటే గొళ్లతో బలంగా గీకకూడదు.
సర్జరీ తరువాత ఏమేం చేయాలి ?
సర్జరీ జరిగిన మరుసటి రోజునుండి లేచి నడవవచ్చు. కానీ ఎక్కువమంది పెద్ద ఆపరేషన్ అయింది కాబట్టి విశ్రాంతి తీసుకోవాలనే అపోహతో మంచానికి పరిమితమైపోతారు. కానీ సర్జరీ తరువాత నడకలాంటి శారీరక వ్యాయామం వలన త్వరగా కోలుకుంటారు.
డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్న రోజు నుండి రోజు మొత్తంలో వీలున్నప్పుడల్లా నడుస్తుండాలి.
15 రోజుల నుండి 10 నిమిషములనుండి 15 ని. వరకు నడక మంచిది.
ట్రెడ్ మిల్ మీద నడవాలంటే ఒకటిన్నర నెలలు ఆగాలి.
ఆరు వారాల నుండి ఔట్ డోర్ గేమ్స్, జిమ్ లో వ్యాయామాలు చేయవచ్చు.
శరీరం సహకరిస్తే వీలున్నంతవరకు చిన్న చిన్న పనులు సొంతంగా చేసుకోవాలి.
నెల తరువాత పొట్టమీద ఒత్తిడి పడే పనులు, బరువులు ఎత్తటం తప్ప ఇంటి పనులన్నీ చేసుకోవచ్చు.
ఏరోబిక్స్, వెయిట్స్, పరుగులాంటి వ్యాయామాలు 3 నెలల తరువాతే మొదలు పెట్టాలి.