header

ఫైబ్రాయిడ్స్‌ Fibroids

ఫైబ్రాయిడ్స్‌ Fibroids / డా.ప్రణీతి రెడ్డి, యూరో గైనకాలజిస్ట్
గర్భాశయంలో ఉండే కణితులూ, గడ్డలు... వీటినే వైద్యపరిభాషలో ఫైబ్రాయిడ్స్‌ అంటాం. ఈ కణితులతో వచ్చే చిక్కులని తక్కువ అంచనా వేయడానికి లేదు! సాధారణ కడుపునొప్పితో మొదలుపెట్టి గర్భస్రావందాకా ఎన్నో సమస్యలకి ఇవి కారణమవుతాయి. అందుకే మనం వీటి గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
నెలసరులు సరిగారానప్పుడూ, కడుపులో తీవ్రమైన నొప్పి వేధిస్తున్నప్పుడు... ఆ సమస్యల్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు. ఒక వేళ ఈ సమస్యలకి గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్‌ కారణం కావొచ్చు. అవే అయితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి తర్వాతి కాలంలో సంతానలేమికి కూడా కారణమవుతాయి! తాజా అధ్యయనాల ప్రకారం సంతానోత్పత్తి సామర్థ్యం ఉన్న మహిళలపై ఇవి 35 నుంచి 77 శాతం వరకూ ప్రభావం చూపుతాయట. గర్భవతుల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు మామూలు సమయాలతో పోలిస్తే గర్భధారణ సమయంలో కణితుల పరిమాణం పెరిగే వేగం కూడా ఎక్కువగా ఉంటుంది. గర్భానికి వెళ్లే రక్తప్రవాహం ఫైబ్రాయిడ్ల వైపు మళ్లడమే ఇందుకు ప్రధాన కారణం. కానీ ఈ కణితులు ప్రతి గర్భవతికీ నష్టం చేస్తాయని చెప్పలేం. 40 శాతం మందిలో మాత్రమే వీటివల్ల నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. పరిమాణం, ప్రదేశం..
కణితి పరిమాణం, వాటి సంఖ్యా, అది ఉన్న ప్రదేశాన్ని బట్టే దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఫైబ్రాయిడ్ల పరిమాణం ఐదు సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే దుష్ఫలితాలు కనిపిస్తాయి. ఒక్కోసారి సిజేరియన్‌ వరకూ వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదే కణితి సాధారణ పరిమాణంలో ఉంటే వారికి సహజ ప్రసవమే అవుతుంది. ఫైబ్రాయిడ్లు లేనివారితో పోలిస్తే... ఉన్నవారిలో గర్భస్రావమయ్యే ప్రమాదం ఎక్కువ. అలాగే ఒకే కణితి ఉన్నవారితో పోలిస్తే ఎక్కువున్నవారిలోనూ గర్భస్రావాలయ్యే ఆస్కారం అధికం. కణితులు ఏ ప్రాంతంలో ఉన్నాయి అనేది కూడా చాలా కీలకమైన విషయం. ఇవి గర్భాశయం దిగువభాగంలో ఉంటే వాటి ప్రభావం తక్కువగా ఉంటుంది. అదే ఎగువవైపుంటే గర్భం నిలవడమే కష్టం! కొన్నిసార్లు గర్భధారణ సమయంలో రక్తస్రావం అవుతుంటుంది. దానిక్కారణం మాయని ఫైబ్రాయిడ్లు అంటిపెట్టుకుని ఉండి, దానిపై ఒత్తిడి తీసుకురావడమే. ఇలాంటప్పుడు కూడా గర్భస్థ పిండానికి చేటు జరుగుతుంది.
నొప్పి ఏ పరిస్థితుల్లో?
కొన్నిసార్లు గర్భిణికి రక్తస్రావంతోపాటూ తీవ్రమైన నొప్పీ, జ్వరం వేధిస్తాయి. ఈ పరిస్థితిని నెక్రోబయోసిస్‌ లేదా రెడ్‌ డీజనరేషన్‌ అంటారు. కణితుల్లో అసాధారణమైన పెరుగుదలే ఇందుక్కారణం. ముఖ్యంగా ఐదు సెంటీమీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో కణితులున్నప్పుడు కడుపులో నొప్పీ, జ్వరం మొదలవుతాయి. అంతేకాదు ఫైబ్రాయిడ్లు కూడా కదిలి కొన్నిరకాల ప్రోస్టోగ్లాండిన్స్‌ అనే స్రావాలని విడుదల చేస్తాయి. దాంతో నొప్పి మరింతగా పెరుగుతుంది. అలాంటప్పుడు స్కాన్‌ ద్వారా ఫైబ్రాయిడ్లను గుర్తిస్తారు. అందుకు తగ్గట్టు తగిన చికిత్సలు అందించడం మొదలుపెడతారు.
నియంత్రించకుంటే..
సాధారణ పరిస్థితుల్లో బిడ్డ పుట్టిన తర్వాత మాయ వేరవుతుంది. కానీ ఫైబ్రాయిడ్లు నియంత్రణలో లేనివారిలో ఈ పరిస్థితి తారుమారు అవుతుంది. శిశువుకి పోషకాలూ, ప్రాణవాయువూ అందించే మాయ ప్రసవానికి ముందే వేరవుతుంది. దాంతో బిడ్డకు అందాల్సిన పోషకాలూ, ఆక్సిజన్‌ సరిగా అందవు. దాంతో తీవ్రమైన రక్తస్రావం జరిగి తల్లీబిడ్డలిద్దరికీ ప్రాణాపాయ పరిస్థితి తలెత్తుతుంది. దీన్నే ‘ప్లాసెంటా అబ్రప్షన్‌’ అంటారు. అన్నిరకాల కణితులవల్లా ఈ పరిస్థితి రాదు. సబ్‌మ్యూకోజల్‌, రెట్రోప్లాసెంటల్‌ వంటి కొన్ని రకాల ఫైబ్రాయిడ్ల వల్లే ఇలాంటి ప్రాణాంతక పరిస్థితి వస్తుంది. పరిస్థితి ఇలా విషమించినప్పుడు ఫైబ్రాయిడ్లకు వెళ్లే రక్తాన్ని నిలుపుదల చేసి ఉపశమనం కలిగిస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ కణితులు మాయ కిందకు దిగిపోవడానికీ కారణమవుతాయి. ఈ పరిస్థితిని ప్లాసెంటా ప్రీవియా అంటారు దీనివల్ల ప్రసవం కంటే ముందుగా రక్తస్రావం అవుతుంది. చాలా అరుదుగా కొందరిలో ప్రసవ సమయానికి బిడ్డ తలకిందకు ఉండదు. దీనినే ఫీటల్‌ మాల్‌ప్రెజెంటేషన్‌ అంటారు. దీనివల్ల చాలాసార్లు సిజేరియన్‌ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని సందర్భాల్లో నెలలు నిండకముందే ప్రసవమవుతుంది.
శస్త్రచికిత్స తక్కువ సందర్భాల్లోనే..
గర్భధారణ సమయంలో ఈ ఫైబ్రాయిడ్ల కారణంగా తలెత్తే నొప్పిని నివారించడానికి కొన్నిమార్గాలున్నాయి. మూడో త్రైమాసికంలో అయితే బిడ్డ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నాన్‌స్టిరాయిడల్‌ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌ మందులిస్తారు. మరీ నొప్పి ఎక్కువగా ఉంటే ఆసుపత్రిలో చేర్చుకుని వైద్యసేవలు అందిస్తారు. చాలా తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే శస్త్రచికిత్స చేస్తారు. ఓపెన్‌ మయోమెక్టమీ శస్త్రచికిత్స చేసి కణితులని తొలగిస్తారు. కానీ వీలైనంతవరకూ చేయకుండా ఉండటానికే ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో కణితులూ, గర్భాశయం అన్నీ సున్నితంగా ఉంటాయి. ఇలాంటి సమయంలో శస్త్రచికిత్స చేస్తే రక్తస్రావం చాలా ఎక్కువగా అవుతుంది. దానిని నియంత్రించడం కష్టమవుతుంది. అలాంటప్పుడు హిస్టరెక్టమీ ద్వారా గర్భాశయాన్నీ తొలగించాల్సి రావొచ్చు! అందుకే వీలైనంత వరకూ మయోమెక్టమీ చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు.