header

Mensus / రుతుస్రావం లేక బహిష్టు…

Mensus / రుతుస్రావం లేక బహిష్టు…Dr. Prannethi Reddy, Rainmbow Hospital, Hyderabad.సౌజన్యంతో....
ఒక వయసు వచ్చిన దగ్గరి నుంచీ ఆడపిల్ల శరీరం.. గర్భధారణకు అనువుగా తయారవుతుంటుంది. దాన్లో భాగమే నెలనెలా వచ్చే ఈ బహిష్టులు!
ఒక వయసు వచ్చిన దగ్గరి నుంచీ ఆడపిల్ల శరీరంలో నెలనెలా అండం విడుదల అవుతుంటుంది. అదే సమయంలో.. ప్రతి నెలా గర్భాశయం లోపల ఒక మెత్తటి పొర కూడా తయారవుతుంటుంది. ఒకవేళ ఆ అండం గనక పురుషుడి శుక్రకణాలతో సంయోగం చెంది ‘పిండం’ ఏర్పడితే.. (దీన్నే మనం ‘గర్భం దాల్చటం’ అంటాం)..
ఆ పిండం గర్భాశయంలోనే స్థిరంగా కుదురుకునేందుకు ఈ మెత్తటి పొర చక్కటి పాన్పులాగా ఉపయోగపడుతుంది. తర్వాత అదే మరింత మందంగా తయారై, రక్తనాళాలను ఏర్పరచుకుని, పెద్ద సంచిలా తయారై, తొమ్మిది నెలల పాటు బిడ్డ ఎదిగేందుకు అవసరమైన ‘మాయ’లా మారిపోతుంది. అదే ఈ పొరకున్న ప్రయోజనం. అయితే గర్భధారణ జరగలేదనుకోండి.. అంటే ఆడపిల్ల శరీరంలో విడుదలైన అండం సంయోగం చెందకుండా అలాగే ఉండిపోయిందనుకోండి.. కొద్దిరోజుల్లోనే లోలోపలే ఆ అండం విచ్ఛిన్నం అయిపోతుంది. ఇక అప్పటికే సిద్ధమైన మెత్తటి పాన్పులాంటి పొర, కొద్దిగా రక్తం, ఇతరత్రా స్రావాలన్నింటిని కలిపి శరీరం బయటకు పంపించేస్తుంది! బహిష్టు అంటే ఇదే! అదంతా బయటకు రావటానికి 3-5 రోజులు పడుతుంది. ఒకసారి అదంతా బయటకు వచ్చేయగానే.. లోపల మళ్లీ అండం విడుదలకు రంగం సిద్ధమవుతుంది. మళ్లీ పాన్పు పొర తయారవుతుంటుంది. శరీరం మళ్లీ గర్భధారణకు సంసిద్ధమవుతుంటుంది.
గర్భం దాల్చకపోతే.. మళ్లీ అదీ బయటకు వచ్చేస్తుంది. ఆడపిల్ల శరీరంలో ఇదంతా నెలనెలా జరిగే ప్రక్రియ. అందుకే దీన్ని మనం నెలసరి అనీ, రుతుక్రమం అనీ, రుతుస్రావం అనీ.. రకరకాలుగా పిలుస్తుంటాం! అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది.. బహిష్టు రూపంలో బయటకు వచ్చేదంతా కూడా ఆమె.. అమ్మ కావటానికి, మాతృత్వానికి ఉపయోగపడే జీవపదార్థం అని! అదెలాంటి హానీ చెయ్యదని!!
రక్తం చాలా పోతుందా?
రుతుస్రావం రూపంలో చాలా రక్తం పోతుందనీ, దీనివల్ల స్త్రీలు చాలా బలహీనపడిపోతారనీ ఒకప్పుడు బలంగా నమ్మేవాళ్లు. వాస్తవానికి నెలనెలా రుతుస్రావం ఎంత అవుతుందన్నది మనిషికీ మనిషికీ మారుతుంటుందిగానీ.. మొత్తమ్మీద సగటున బయటకు పోయే రక్తం 3-4 టీస్పూన్లకు (80 మిల్లీ లీటర్లు) మించి ఉండదు. కాకపోతే చూడటానికి అదే చాలా ఎక్కువగా అనిపించొచ్చు. సాధారణంగా కొద్దిపాటి స్రావంతో మొదలై, ఒకటిరెండు రోజులు ఎక్కువై, ఆ తర్వాత మళ్లీ తక్కువ కావచ్చు. రుతుస్రావం ఇలా మొత్తం 3 నుంచి 7 రోజులు కావొచ్చు.
ఈ స్రావంలో కొన్నికొన్నిసార్లు చిన్నచిన్న గడ్డల్లా కనిపించొచ్చు. అయినా కంగారుపడాల్సిందేం లేదు. లోపల గర్భాశయం నుంచి వూడిన మెత్తటి పొర తాలూకూ ముక్కలవి. స్రావం రంగు కూడా కొన్నిసార్లు తుప్పులా ముదురు రంగులో ఉండొచ్చు. లేదూ బాగా ఎర్రగానూ ఉండొచ్చు. ఇదంతా సహజమే. కాకపోతే- ప్యాడ్స్ బాగా తడిసిపోతూ గంటకోసారి మార్చుకోవాల్సి రావటం, అలా చాలా గంటలు గడవటం.. లేదూ పెద్దపెద్ద గడ్డలు అవుతుండటం.. పరిస్థితి ఇలా ఉంటే మాత్రం స్రావం ఎక్కువ అవుతోందని అనుమానించి, వైద్యులను సంప్రదించటం మంచిది. గర్భనిరోధక మాత్రలు వాడే వారిలో కొన్నిసార్లు రుతుస్రావం చాలా తక్కువగా అవ్వచ్చు. లేదూ నెల మధ్యలోనే ఎరుపు (స్పాటింగ్) కనబడొచ్చు. ఇదేం సమస్య కాదు.
ఒత్తిడితో ముందువెనకలు అవుతుందా?
ఏదైనా కీలకమైన పని పెట్టుకున్నప్పుడు చాలామంది నెలసరి వచ్చేస్తుందేమోనని భయపడుతూ మానసికంగా విపరీతంగా మథనపడుతుంటారు. ఇలా మానసిక ఒత్తిడి పెంచుకోవటం వల్ల నెలసరి ఉన్నట్టుండి ముందువెనకలు అయ్యే మాట వాస్తవం. కొత్తగా స్కూలు, ఆఫీసుల వంటివి మారినప్పుడో, కొత్త బాధ్యతలు నెత్తినపడినప్పుడో, కుటుంబంలోనో స్నేహితులతోనో ఇబ్బందులు ఎదురైనప్పుడు, లేదూ కొత్త ప్రదేశాల్లో ప్రయాణాలు చెయ్యాల్సి వచ్చినప్పుడు.. లేదూ జీవితంలో అత్యంత కీలకమైన పెళ్లి వంటి ఘట్టాలకు సిద్ధమవుతున్నప్పుడు..
ఇలాంటి సందర్భాల్లో మనకు తెలియకుండానే మానసిక ఒత్తిడికి లోనవుతాం. దీంతో ఒత్తిడి హార్మోన్ కార్టిజోల్ పెరిగి.. మొత్తంగా హార్మోన్ పరమైన మార్పులు తలెత్తి, నెలసరి ముందువెనకలు కావచ్చు. కాకపోతే అది తాత్కాలికం. అలాకాకుండా పని పరమైన, వృత్తిపరమైన దీర్ఘకాలిక ఒత్తిళ్లూ ఉండొచ్చు. దానివల్ల నెలసరి ఎప్పుడొస్తుందో తెలీక ప్రతిసారీ అయోమయంగా తయారై.. ఇది ఇంకోరకం ఒత్తిడికి దారి తీస్తుంది. కాబట్టి మొత్తమ్మీద చక్కటి పోషకాహారం తీసుకుంటూ, ఒత్తిళ్లు లేని క్రమబద్ధమైన జీవనశైలి అలవరచుకుంటే ఈ అస్తవ్యస్తాల బెడద ఉండదు. నెలసరి అనేది ఒక క్రమం ప్రకారం ఒంట్లో చోటుచేసుకునే సహజ ప్రక్రియ. మన పనులకు అదేదో అడ్డం వస్తోందని తరచూ దాన్ని ఆపేందుకు మాత్రల వంటివి వేసుకోవటం ఆ క్రమాన్ని చెడగొట్టటమే అవుతుంది, ఇది సరికాదు.
వ్యాయామం, శ్రమ చెయ్యకూడదా?
నెలసరి వచ్చినప్పుడు స్త్రీలు పూర్తి విశ్రాంతి తీసుకోవాలన్న నమ్మకం కూడా చాలా సమాజాల్లో కనబడుతుంది. నెలంతా ఇంటిల్లి పాదికీ బండెడు చాకిరీ చేసే స్త్రీలకు ఈ రూపేణా కొంత విశ్రాంతి చిక్కుతుంటే మంచిదేగానీ.. ఇప్పుడీ విషయంలో మన అవగాహన చాలా మారింది. అధిక రుతుస్రావం, విపరీతమైన పొత్తికడుపు నొప్పి వంటి ఇతరత్రా ఇబ్బందులు ఎదుర్కొనే వారికి తప్పించి.. మిగతా వారందరికీ ఈ సమయంలో ప్రత్యేకించి విశ్రాంతి అవసరమేం లేదు. పైగా తేలికపాటి వ్యాయామం చాలా మంచిది. పొత్తికడుపు నొప్పి (మెన్స్ట్రువల్ క్రాంప్స్) వంటి వాటితో సతమతమయ్యే వారికి కూడా వ్యాయామం వల్ల ప్రయోజనం ఉంటోందని అధ్యయనాల్లో తేలింది. నడక, ఈత అందరికీ మంచివి. కొన్ని రకాల యోగాసనాలూ వెయ్యొచ్చు. ఇక నిత్యం కఠిన వ్యాయామాలు, క్రీడా శిక్షణ వంటివాటికి వెళ్లే వారికి కూడా నెలసరి అడ్డంకేం కాదు. కొంతమంది నెలసరి సమయంలో ఈతకు వెళ్లకూడదని భావిస్తుంటారు. నీళ్లు పీలుస్తాయి కాబట్టి ప్యాడ్స్తో ఈత కష్టం. అందుకని ఈతకు వెళ్లేప్పుడు ప్యాడ్స్ బదులు ‘ట్యాంపూన్స్’ వాడితే ఏ ఇబ్బందీ ఉండదు. అవి యోనిలోనే ఉండిపోయి, బయటకు ఎలాంటి స్రావాలనూ రానివ్వవు, ఈతకూ ఇబ్బంది ఉండదు. కాకపోతే ఈత నుంచి రాగానే వాటిని మార్చేసుకోవాలి.
సిగ్గు పడటం కాదు.. సిద్ధపడాలి!
చాలామంది నెలసరి గురించి అనవసరపు బిడియాలు పెట్టుకుని లేనిపోని ఇబ్బందులు పడుతుంటారు. కానీ ఇది సహజ శరీర ధర్మం. దీని గురించి అనవసర బెరుకు, భయాలు పెట్టుకునే బదులు.. ముందే సిద్ధంగా ఉండటం ముఖ్యం. దీనివల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా హాయిగా ఉంటారు. నెలసరి అనేది కచ్చితంగా ఎప్పుడొస్తుందో తెలీదు కాబట్టి కొన్ని వారాల ముందు నుంచే దగ్గర ప్యాడ్స్ ఉంచుకోవాలి. నెలసరి వచ్చే ముందు కొందరికి పొత్తికడుపులో నొప్పిగా అనిపిస్తుంది. లోపల గర్భాశయంలో పెరిగిన పొర విడివడేందుకు, దాన్ని బయటకు నెట్టేందుకు ఈ సమయంలో గర్భాశయ కండరం బిగుతుగా తయారవుతుంటుంది, అందుకే నెలసరి రావటానికి కొద్ది ముందు కొందరికి పొత్తికడుపులో బిగలాగుతున్నట్టుగా, కాస్త నొప్పిగా అనిపిస్తుంది. ఇది సహజమే. అయితే కొద్దిమందిలో ఈ నొప్పి నడుములోకి, తొడల్లోకి కూడా పాకి మరీ బాధాకరంగా అనిపించొచ్చు.
ఇలాంటి వాళ్లు ప్యాడ్స్తో పాటు నొప్పి నివారిణి మాత్రలు కూడా దగ్గరుంచుకోవాలి. ఇలాంటి ఏర్పాట్ల వల్ల రోజువారీ పనులకు ఏ ఇబ్బందీ ఉండదు. ఒకవేళ ప్యాడ్స్ దగ్గర లేనప్పుడు నెలసరి వస్తే- ఏం కంగారుపడొద్దు. తాత్కాలికంగా టిష్యూలను కూడా వాడుకోవచ్చు. శుభ్రంగా ఉన్న పేపర్ న్యాప్కిన్లను మూడు అంగుళాల వెడల్పు, పావుఅంగుళం మందంగా ఉండేలా మడతపెడితే చాలు.. తాత్కాలిక ప్యాడ్ సిద్ధమైనట్లే. తర్వాత దగ్గర్లోని దుకాణంలో ప్యాడ్స్ కొనుక్కోవచ్చు.
నొప్పి బాధిస్తుంటే.. ఇవి ప్రయత్నించండి!
వేడి పాలు తాగటం
నడక వంటి వ్యాయామం మానకుండా ఉండటం
తేలికపాటి ఆహారం, ఎక్కువసార్లు తీసుకోవటం
నొప్పిగా ఉంటే మునివేళ్లతో పొత్తికడుపు మీద గుండ్రంగా, సున్నితంగా మసాజ్ చేసుకోవటం
పక్కకు తిరిగి కాళ్లు ముడుచుకు పడుకోవటం లేదా కాళ్ల కింద కాస్త ఎత్తుపెట్టుకోవటం.
స్నానాలు చెయ్య కూడదా?
నెలసరి సమయంలో స్నానం చెయ్యకూడదన్న నమ్మకం చాలా సమాజాల్లో కనబడుతుంది. బహుశా, ప్రజలు నదుల్లోనూ, కాలువల్లోనూ స్నానాలు చేసే రోజుల్లో పుట్టిన నమ్మకం కావొచ్చు ఇది! కానీ ఇవాల్టి రోజున దీనికి ఏమాత్రం ప్రాధాన్యం లేదు. పైగా నెలసరి సమయంలో శుభ్రత చాలా చాలా అవసరం. దాన్ని విస్మరించి ఏమాత్రం ఉదాసీనంగా ఉన్నా ఇన్ఫెక్షన్ల ముప్పు పొంచి ఉంటుంది. ఎందుకంటే రుతుస్రావం అవుతున్న సమయంలో యోనిలో ఆమ్ల-క్షార స్వభావం (పీహెచ్ బ్యాలెన్స్) కాస్త మారుతుంది.
దీనివల్ల బ్యాక్టీరియా పెరిగి తేలికగా ఇన్ఫెక్షన్లు బయల్దేరతాయి. కాబట్టి రోజూ తప్పనిసరిగా శుభ్రంగా స్నానం చెయ్యాలి. వెంటనే చక్కగా ఉతికి, పొడిగా ఉన్న లోదుస్తులు ధరించాలి. బిగుతుగా, గాలి ఆడకుండా ఉండే సింథటిక్ లోదుస్తులు వేసుకుంటే లోపల చెమ్మ, వెచ్చదనం పెరిగి బ్యాక్టీరియా వృద్ధి అవుతుంది. కాబట్టి కాస్త వదులుగా, గాలి ఆడేలా ఉండే కాటన్ వాటినే ధరించాలి. ప్రతి 3-4 గంటలకు ఒకసారి ప్యాడ్స్ మార్చుకుంటూ ఉండాలి. ఇంట్లోంచి బయటకు వచ్చే ముందు, అలాగే నిద్రకు ఉపక్రమించబోయే ముందు కూడా ప్యాడ్స్ మార్చుకోవటం మంచిది. మల, మూత్ర విసర్జనకు వెళ్లిన ప్రతిసారీ యోని ప్రాంతాన్ని పైపైన నీటితో (సబ్బు వద్దు) శుభ్రంగా కడుక్కోవాలి. అదీ, ముందు నుంచి వెనక్కే కడుక్కోవాలి. ప్యాడ్స్ మార్చుకునే ముందు కూడా నీటితో కడుక్కోవాలి. కడుక్కున్న ప్రతిసారీ పొడిగా తుడుచుకున్న తర్వాతే మళ్లీ ప్యాడ్ అమర్చుకోవాలి. ఈ ప్రాంతంలో డియోడరెంట్ల వంటివేమీ వాడొద్దు.
మూఢం అని కొట్టేయటం సరికాదు.. సరిపోదు!
బహిష్టు వచ్చినప్పుడు అమ్మాయి పూజలకు, గుళ్లకు, పెళ్లిళ్లకు, పేరంటాళ్లకు వెళ్లరాదనీ.. ఆ సమయంలో ఆమెను ముట్టుకోకూడదనీ, ఆమె తలస్నానం, వంట చెయ్యకూడదనీ, ఆ సమయంలో శృంగారానికి కూడా దూరంగా ఉండాలని.. మన సమాజంలో ఇలాంటి నమ్మకాలకు అంతులేదు. మన సమాజంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంస్కృతిలో, చాలా దేశాల్లో ఇలాంటి నమ్మకాలు కనబడుతుంటాయి. మరోవైపు అసలివన్నీ మూఢనమ్మకాలనీ, వీటిలో శాస్త్రీయత లేదని రుజువు చేసే ప్రయత్నాలూ చాలానే జరుగుతుంటాయి.
అయినా కూడా నేటికీ చాలామంది స్త్రీలు అవేం పట్టించుకోకుండా తమ ఆచారాలను తాము పాటిస్తుండటం చూస్తూనే ఉన్నాం. నిజంగా అవన్నీ నమ్మి పాటిస్తున్నారా? అంటే కాకపోవచ్చు. చాలామంది విషయంలో ఇది తరతరాలుగా వస్తున్న నమ్మకాలు, ఆచారాల పట్ల గౌరవం తప్పించి మరోటి కాదు. కాబట్టి మనం బహిష్టు విషయంలో ప్రతి సమాజానికీ తనకంటూ ఒక ‘చరిత్ర’ ఉందని గుర్తించటం అవసరం. దాన్ని ఆధునిక సైన్స్తోనో, ఇతర సమాజాలతోనో పోలుస్తూ.. పనిగట్టుకుని అదంతా తప్పని నిరూపించే ప్రయత్నం వృథా. ఈ ఆచారాలన్నీ కూడా పూర్వం వ్యవసాయ ఆర్థిక సమాజం, ఉమ్మడి కుటుంబాలు బలంగా ఉన్నప్పుడు.. అప్పటి అవసరాలకు, అవగాహనలకు తగ్గట్టు రూపుదిద్దుకున్నవి. కానీ ఈ ఆధునిక పారిశ్రామిక, టెక్నాలజీ ఆధారిత ఆర్థిక వ్యవస్థల్లో, చిన్న కుటుంబాలు పెరిగిపోయిన నేపథ్యంలో ఇవాల్టి రోజున ఆయా నమ్మకాలకు పెద్దగా ప్రాధాన్యం లేదని చెప్పుకోక తప్పదు. కాబట్టి అన్నింటినీ గుత్తగా మూఢంగా కొట్టిపారేయటం కాకుండా.. రకరకాల ఆచారాల గురించి, వాటివెనకున్న భావనల గురించి లోతుగా చర్చించి, ఈ కాలానికి అవెంత వరకూ పనికొస్తాయో తరచిచూడటం ఉత్తమం. దానివల్ల అవగాహన పెరిగి అపోహలు తొలగిపోతాయి.