header

Monopas / మోనోపాజ్

Monopas / మోనోపాజ్
మానవ శరీరంలో కొన్ని ప్రత్యేక దశలుంటాయి. ఒక దశనుండి తరువాత దశకు చేరటంలో చిన్న చిన్న మార్పులు సహజం. ఈ మార్పులు పురుషులలో కన్నా స్త్రీలలో స్పష్టంగా కనబడతాయి.
యవ్వనంలోకి ప్రవేశించేటపుడు కనిపించే మార్పును చూసి ఒకదశలో భయాందోళనలకు గురవుతారు. శారీరకంగా వచ్చే మార్పులు ఎలా ఉన్నా హార్మోన్ ల ప్రభావంతో శరీరంలో జరిగే మార్పులతో శరీరం ప్రకృతి ధర్మానికి సిద్ధమవుతుంది. అదే తొలిసారి బహిష్టు అవటం.
ఆ నాటినుండి ఆడపిల్లల జీవితంలో ఋతుచక్రం మొదలవుతుంది. సంతానం పొందటానికి శరీరం అనువుగా తయారవుతుంది. ఈ మార్పులన్నీ హార్మోన్ల పరంగా వచ్చేవే. నాటినుండి అమ్మాయిల జీవితాన్ని నియంత్రించే రసాయనాలు కీలకమవుతాయి.
కోరికలు కలిగించేవి హార్మోన్లు, గర్భం వస్తే శిశువుకు అనుకూలంగా శరీరాన్ని తయారుచేసేది, స్తనాలలో పాలు తయారయ్యేది, శిశువు ఎదుగుదల, ప్రసవం అన్నీ హార్మోన్ల ప్రభావంతోనే జరుగుతాయి. ప్రతినెలా హార్మోన్లు ఒక క్రమపద్ధతితో తమ బాధ్యతను నిర్వహిస్తూ బహిష్టు సమయానికి వచ్చేలా చేస్తాయి.
ఒక వయసు తర్వాత సంతానం పొందాలన్న కోర్కె ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. అది ఒక బాధ్యత. ప్రకృతి నిర్ధేశించిన ఆ బాధ్యతను నిర్వహించిన శరీరం క్రమంగా తదుపరి దశకు సిద్ధమవుతుంది.ఈ దశనే మోనోపాజ్ అంటారు.
ఈ దశను మగువలు ఎవరూ ఇష్టపడరు. ఈ దశ దాదాపుగా 45 ఏళ్ల వయసుకు అటుఇటుగా గరిష్టంగా 55 ఏళ్లలొపు వస్తుంది,
ఆలస్యంగా వివాహం, గర్భం, సంతానలేమి, మారిన ఆహారపు వేళలు వగైరా అలవాట్లు కలిసి మోనోపాజ్ వయసును తగ్గిస్తున్నాయి.
గర్భసంచి తొలగించుకున్నవారికి త్వరగా మోనోపాజ్ వస్తున్నది. మోనోపాజ్ బహిష్టులు ఆగిపోయే దశ. నెలవారీ ఇబ్బందులు ఇక ఉండవు. సంతానం పొందగలిగిన శక్తి ఆగిపోతుంది.
మోనోపాజ్ దశలు
ఈ దశకు తీసుకు వచ్చేది హార్మోన్ లు. నాటి వరకు శరీరంలో ఋతుచక్రాన్ని నడిపించిన లైంగిక హార్మోన్ ల స్థాయి క్రమంగా పడిపోతుంది. స్ర్రీ శరీరంలో అండం ఉత్పత్తి ఆగిపోతుంది. ప్రతి స్త్రీ శరీరంలో నిర్ధిష్ట సంఖ్యలో అండాలు నిక్షిప్తమై ఉంటాయి. నెలకు ఒకటి చొప్పున విడుదలవుతాయి. విడుదలైన ఆ అండం ఫలదీకరణం చెంది పిండంగా మారితే బహిష్టు ఆగిపోయి గర్భం పెరుగుతుంది. ప్రపసవమవగానే తిరిగి శారీరక సర్దుబాట్లతో నెలవారీ అండాల విడుదల మొదలవుతుంది.
అండం ఫలదీకరణం చెందకపోతే నెల చివరన బయటకు వదిలి వేయబడుతుంది. అదే బహిష్టు, దానితో బాటుగా రక్తం వస్తుంది. ఇలా ప్రతి నెలా జరిగే కార్యక్రమానికి అంతం పలకటమే మోనోపాజ్. చాలా అరుదుగా, మొత్తం స్త్రీలలో 1 శాతం 40 ఏళ్లకు ముందే మోనోపాజ్ వస్తుంది. ఆ వయసులోనే మోనోపాజ్ రావటానికి పలుకారణాలు ఉంటాయి. డయాబెటిస్, కీమోథెరపీ, ఇతర అనారోగ్యాలు, జన్యులోపం వంటివి ఈ పరిస్థతికి కారణాలు అవుతాయి. త్వరిగతిన వచ్చే మోనోపాజ్ పలు శరీరక, మానసిక ఇబ్బందులను తెస్తాయి.
ఎక్కువ మందిలో బహిష్టులు ఆగిపోవటం అనేది క్రమపద్ధతిలో వయసుకు తగ్గట్టే జరుగుతుంది. మోనోపాజ్ రాబోతుంది అనేదానికి తొలిగా కనిపించే లక్షణం నెలవారీ బహిష్టులు గతి తప్పటం. గతంలోనూ సరిగ్గా నెలకు అటూ ఇటూ అవుతుంటాయి. రక్తస్రావం అధికంగా ఉంటుంది.
ఇతర మార్పులను తెస్తుంది. మానసికంగా మార్పులు వస్తాయి. కోపం, చిరాకు పెరుగుతుంది. ఆ కోపంలో అరుస్తారు. భావోద్వేగాలను నియంత్రించుకోవటంలో ఇబ్బందులు వుంటాయి. ఆఫీసుల్లో పనిచేసే ఆడవారిలో ఈ దశ మరిన్ని ఇబ్బందులను తెస్తుంది. ఆ సమయంలో అందరూ తననే గమనిస్తున్నారనే భావన, అధిక రక్తస్రావం బయటపడుతుందేమోనన్న భయం, ఆకర్షణ తగ్గపోతుందన్న ఆందోళన, వగైరాలన్నీ కలిపి వారి ప్రవర్తనను మార్చివేస్తాయి.
హార్మోన్స్ పరంగా వస్తున్న మార్పులు కొందరిలో నిద్రలేమిని తెస్తాయి. ఆదుర్ధా పెంచుతాయి. దృష్టి నిలపటం మరింత కష్టమవుతుంది. ఆ వయసులో బాధ్యతాయయుతమైన స్థానంలో వున్న మహిళలను భరించటం కష్టమని కొలీగ్స్ చెవులు కొరుక్కోవటం ఇబ్బందులను పెంచుతుంది.
మోనోపాజ్ రెండో దశను పెరిమోనోపాజ్ దశ అంటారు. క్రమపద్ధతి తప్పిన బహిష్టుల నుండి బహిష్టులు పూర్తిగా ఆగిపోయేవరకు వుండే దశ ఇది. దాదాపుగా నాలుగు నుండి ఎనిమిది వారాల వరకు వుంటుంది ఈ దశ. మోనోపాజ్ అనే తుదిదశకు నపడిపించే దశ ఇది. ఈస్ట్రోజోన్ హార్మోన్ తీవ్ర హెచ్చుతగ్గులు ఈ దశలో ఉంటాయి. అతి తక్కువ స్థాయిలోనే వుండే టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ మరీ తగ్గిపోయినట్టుగా వుంటుంది. చర్మం మీద ముడుతలు కనిపిస్తాయి. జుట్టురాలిపోతుంది. గాయాలు త్వరగా మానవు. జ్ఞాపకశక్తి మందగిస్తుంది. మూడ్ త్వరత్వరగా మారిపోతుంది. నీరసంగా వుంటుంది.
ఎముకల, కీళ్లు ఇబ్బందులు ఈ దశలో సహజం. ఎముకల బలహీనత వేగం పుంజుకొంటుంది. ఆస్టియోపోరోసిస్ వచ్చి సులభంగా ఎముకలు విరుగుతాయి. ఈ దశలో శరీరం బరువు పెరుగుతుంది. మోనోపాజ్ తరువాత శరీరం 5 కిలోల దాకా బరువు పెరగటం సహజంగా జరుగుతుంది.
ఈ బరువు పెరుగుదలకు కారణాలు చురుకుదనం తగ్గి పనులు చెయ్యకపోవటం, మందగించిన జీవనక్రియలు వంటివి.
ఆనందంలో తేడా ఉండదు
మోనోపాజ్ కి రావటంతో ఇక ఆనందం అయిపోయింది అనే భావన తప్పు మోనోపాజ్ అంటే పిల్లలను కనే దశ అయిపోయిందనే కాని లైంగికానుభవ దశ పోయిందని కాదు.
హార్మోన్ లు పడిపోయినందున సెక్సీ కోరికలు, స్పందనలు మందగిస్తాయే కానీ ఆగిపోయి. మోనోపాజ్ ముందు దశ వరకు సెక్స్ ను ఆనందంగా అనుభవించిన వారికి ఆ ఆనందం అందుకోవటంలో తేడా వుండదు. ఇదివరకులాగా స్పర్శ స్పందనలు వుండకపోవచ్చు. క్రమంగా సెక్స్ పట్ల విముఖత వస్తుంది.
యోనిలో తేమ లోపం సెక్స్ కు దూరంగా వుండేలా చేస్తుంది. ఇటువంటి శారీరక ఇబ్బందులు అందరిలో కనిపించవు. మోనోపాజ్ అనేది ఒక్కొక్కరికి ఒకలాంటి భావన కలిగిస్తుంది. బహిష్టుల గోల ఆగిపోయిందని చెప్పినవారూ ఉన్నారు.మోనోపాజ్ తరువాతే సెక్స్ లో బ్రహ్మాండంగా పాల్గొంటున్నామని, ఆనందం, తృప్తి అధికమయ్యాయని చెపుతూ వున్నవారూ ఉన్నారు.
ఎటువంటి కుటుంబ బాద్యతలు లేని ఆడవారు మోనోపాజ్ సమయంలో దొరకిన ఏకాంతాన్ని మరింత ఆనందంగా గడుపుతున్నారు.
మోనోపాజ్ సమయంలో వాడదగిన లూబ్రికెంట్స్ తో సెక్స్ లో బాధను తగ్గించుకుంటున్నారు. యోనిలోకి సూక్ష్మజీవులు చేరకుండా రక్షించుకుంటున్నారు.
యోని పరిశుభ్రత ఏ వయసులో అయినా అవసరమే. మోనోపాజ్ తరువాత సెక్స్ ను కొనసాగించే వారిలో గుండె సమస్యలు తగ్గుతాయి. రోగనిరోధక వ్యవస్థ మెరుగై ఆరోగ్యంగా ఉంటారు. కీళ్లనొప్పుల సమస్య రావు. మొత్తంమీద సెక్స్ ను అనుభవించేందుకు ఎటువంటి అడ్డంగిగా మోనోపాజ్ ఉండదు.
ఈ సమయంలో ఆమెకు భర్త సహాయం అవసరం. అర్ధం చేసుకుని ఆమెను సెక్స్ లోకి నడిపించే నేర్పు అతనిలో ఉండాలి.
గతంలో మాదిరిగా స్పందనలు వుండవన్న వాస్తవం అర్ధం చేసుకుని, ఫోర్ ప్లేలో ఎక్కువ సమయం గడపగలిగితే దంపతులు ఇద్దరూ సెక్స్ ను మరింత ఆనందంగా అనుభవించగలరు. మోనోపాజ్ తరువాత శారీరకంగా ఆమెలో వచ్చే మార్పులను భర్త అంగీకరించాలి. శరీరం బిగుతుగా ఉండదు. స్తనాలు జారటం, యోని తేమ తగ్గటం వంటి మార్పులను అర్ధం చేసుకోవాలి. ఆమెలో తగ్గిన ఆకర్షణ మీద అతిగా వ్వాఖ్యానం చేయకూడదు. అలా చేస్తే ఆమెతో సెక్స్ ఆనందానికి పూర్తిగా దూరమవుతారు.
హార్మోన్ థెరపీ అనే పరిష్కారం వుంది. నిపుణులైన వైద్యుల చేత హార్మోన్ చికిత్స చేయించుకుని సెక్స్ జీవితం మెరుగుపరచుకోవటమే కాక ఇతర ఆరోగ్య లాభాలను పొందగలరు. అయితే ఈ చికిత్సలో సైడ్ ఎఫెక్ట్స్ వుండే అవకాశం ఉంది. నలభై ఏళ్లకన్నా ముందే మోనోపాజ్ కి చేరిన వారికి ఈ చికిత్స పనికొ వస్తుంది.
అవగాహన అవసరం
మోనోపాజ్ దశలో కొందరు డిప్రెషన్ కు గురవుతారు. హార్మోన్ల ఉత్పత్తి హఠాత్తుగా ఆగిపోయినందున దాని ప్రభావం మొదడులో సమాచార పంపిణీ వ్యవస్థ మీద పడినందున మానసిక సమస్యలు తతెత్తుతాయన్నది వాస్తవం.
ఇది సహజమైన మార్పు అని అంగీకరించగలిగితే సమస్య చాలావరకు తగ్గిపోతుంది. మోనోపాజ్ అనేది జబ్బుకాదు కాబట్టి దీనికి ప్రత్యేకంగా మందులు, చికిత్స అనేది లేదు. అయితే మోనోపాజ్ దశను జాగ్రత్తగా నిర్వహించుకోవటం అవసరం.
ఈ దశకు చేరుతున్న వయసుకు ముందునుండే శారీరకంగా శ్రద్ధ తీసుకోవాలి. ఆ తరువాత వచ్చే మార్పులకు అనుగుణంగా మనసను శరీరాన్ని సిద్ధం చేసుకున్నవారు మోనోపాజ్ సమస్యను అధిగమించగలుగుతారు.
ఎమ్ అనుపమ గారి సౌజన్యంతో... (మూలం : స్వాతి వారపత్రికలో ప్రచురితం)