header

Pelvic Organ Prolapse…కటివలయం జారకుండా..

Pelvic Organ Prolapse…కటివలయం జారకుండా..
డా.ప్రణీతి రెడ్డి, యూరో గైనకాలజిస్ట్ సౌజన్యంతో.....
స్థానభ్రంశం అంటారు కదా... అలా రకరకాల దశల్లో మన కటివలయ భాగాలు స్థానభ్రంశం చెందుతాయి. అదెప్పుడూ, ఎందుకూ, దానికి ఉండే చికిత్సా విధానాలేంటో చూద్దాం.స్త్రీ పునరుత్పత్తి భాగాలు అంటే గర్భాశయం, మూత్రాశయం, రెక్టమ్‌ (పురీషనాళం) నిర్మాణాన్ని కటివలయం అంటారు. కొన్ని దశల్లో వాటిపై అధిక ఒత్తిడి పడినప్పుడు కటివలయంలోని ఆ భాగాలు సహజ స్థానం నుంచి యోనిలోకి చేరతాయి. ఆ పరిస్థితినే పెల్విక్‌ ప్రొలాప్స్‌ అంటారు. కొన్నిసార్లు అవి యోనిని దాటి కూడా కిందకు జారతాయి. ఈ సమస్యకు అన్నిసార్లూ చికిత్స అవసరంలేదు కానీ ఇది అసౌకర్యంగా ఉంటుంది. మలమూత్రవిసర్జనకూ, లైంగికచర్యకు ఇబ్బందిగా అనిపించొచ్చు.
కారణాలున్నాయి...
--కటివలయ భాగం బలహీనం కావడానికి ప్రధాన కారణం గర్భధారణ, ప్రసవం. ఆ సమయంలో హార్మోన్ల అసమతుల్యతా, కణజాలం, నరాలు దెబ్బతినడం వల్ల ఇలా జరుగుతుంది. అంటే ఎక్కువ సమయం నొప్పులు పడటం, పరికరాలు వాడి ప్రసవం చేయడం (ఫోర్సెప్స్‌ లేదా వాక్యూమ్‌తో బిడ్డను బయటకు తీయడం), అధిక బరువున్న బిడ్డకు జన్మనివ్వడం, ఒకేసారి ఎక్కువ మంది పిల్లలు కలగడం దీనికి కారణం కావచ్చు. ఎక్కువ కాన్పులు అయినా కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. కొన్నిసార్లు ప్రసవం కాకపోయినా ఈ సమస్య ఎదురుకావచ్చు. అందుకే ప్రసవానంతరం కటివలయ కండరాలను దృఢంగా మార్చే పెల్విక్‌ఫ్లోర్‌ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అలాగని ఈ సమస్యను రాకుండా అడ్డుకోలేం.
-- మెనోపాజ్‌, వయసు పెరగడం దీనికి మరో కారణం. కటివలయ భాగం దృఢంగా ఉంచడంలో ఈస్ట్రోజెన్‌ పాత్ర కీలకమే. మెనోపాజ్‌ దశలో ఈస్ట్రోజెన్‌ స్థాయులు తగ్గుతాయి. అప్పుడు కటివలయ భాగం బలహీనమవుతుంది. ఇలాంటి సమయంలో మరే ఇతర కారణాలున్నా సమస్య మరింత తీవ్రమవుతుంది. అయితే వయసు పెరిగే కొద్దీ కటివలయం నిర్మాణం విశ్రాంత స్థితికి చేరుకుంటుంది.
-- దీర్ఘకాలం దగ్గూ, బరువైన వస్తువులు ఎత్తడం, స్థూలకాయం, కటివలయభాగం, పొత్తికడుపుపై ఒత్తిడి పడటం దీనికి మరో కారణం.
-- లిగమెంట్లూ, కండరాలు యోనిభాగానికి ఆయువుపట్టు. హిస్టెరెక్టమీ చేయించుకుంటే ఆ కారణంగా అవి బలహీనపడతాయి. ఈ సమయంలోనూ ప్రొలాప్స్‌ సమస్య ఎదురుకావచ్చు. కొన్నిసార్లు వంశపారంపర్యంగానూ ఈ సమస్య రావచ్చు. ఎన్ని రకాలుంటాయి...
గర్భాశయం, మూత్రాశయం, రెక్టమ్‌లలో ఏదో ఒకటి లేదా రెండు భాగాలు కూడా స్థానభ్రంశం చెందొచ్చు.
1. యాంటీరియర్‌ వాల్‌ ప్రొలాప్స్‌ - మూత్రాశయం ఉబ్బి యోని గోడల లోపలికి వచ్చేస్తుంది.
2. పోస్టీరియర్‌ వాల్‌ ప్రొలాప్స్‌(రెక్టాకోలె)- పురీషనాళం ఉబ్బి యోని గోడల వెలుపలికి రావడం.
3. యుటెరెయిన్‌ ప్రొలాప్స్‌ - గర్భాశయం యోనిలోపలికి జారుతుంది. కొన్నిసార్లు అది యోని దాటి ఇంకా ఇవతలకు కూడా వచ్చేస్తుంది.
4. వాల్ట్‌ ప్రొలాప్స్‌- హిస్టెరెక్టమీ తరువాత జననేంద్రియపై భాగం కిందకు జారొచ్చు. ఇది హిస్టెరెక్టమీ చేసిన పదిమందిలో ఒకరికి ఎదురు కావచ్చు.
లక్షణాలేంటి...
ప్రొలాప్స్‌ లక్షణాలు సమస్య తీవ్రతను బట్టి మారుతుంటాయి. సమస్య ప్రాథమిక స్థాయిలో ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపించవు. అలాంటప్పుడు వైద్యులు యోని భాగాన్ని పరీక్షించాకే సమస్యని నిర్ధరిస్తారు. అంటే పాప్‌ స్మియర్‌ పరీక్ష చేస్తారు. కొన్నిసార్లు అయితే...
--గడ్డలాంటిది జారుతున్నట్లు అనిపిస్తుంది.
--కటివలయం, నడుము కింది భాగంలో నొప్పీ, అసౌకర్యంగా అనిపిస్తుంది. ఎక్కువ సమయం కూర్చున్నా, నిల్చున్నా ఈ లక్షణాలు పెరుగుతాయి.
--యోని భాగంలో గడ్డలాంటిది తగులుతుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. లేదంటే మరిన్ని సమస్యలకి కారణం కావచ్చు.
--మూత్ర సంబంధ సమస్యలు రావచ్చు. మూత్రాశయం యోని Ëలోపలికి జారినప్పుడు దానిపై ఒత్తిడి పడి దగ్గినా, తుమ్మినా, నవ్వినా మూత్రం వచ్చేస్తుంటుంది. మూత్రాశయం నిండినట్లు అనిపిస్తుంది. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు కూడా తరచూ బాధిస్తాయి.
-- లైంగిక సమస్యలూ ఎదురవుతాయి. స్థానభ్రంశం చెందిన కటివలయ భాగాల వల్ల కలయిక అసౌకర్యంగా మారుతుంది.
చికిత్సలు ఏంటంటే... ప్రొలాప్స్‌ లక్షణాలూ, తీవ్రతా, వయసూ, ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుంది. అలానే చికిత్స సూచించే ముందు ఆ మహిళ పిల్లల్ని ఇంకా కావాలనుకుంటుందా లేదా అనేదాన్ని బట్టి వైద్యులు నిర్ధరిస్తారు. ఈ చికిత్సా విధానం రెండు విడతల్లో ఉంటుంది. ఎలాగంటే...
శస్త్రచికిత్స లేకుండా...
కటివలయంపై పడే ఒత్తిడిని తగ్గించడం. అంటే అధికబరువుంటే తగ్గమని చెప్తారు. బరువులు మోయకుండా చూడటం, దీర్ఘకాలింగా బాధించే దగ్గూ, మలబద్ధకాన్ని అదుపులో ఉంచడం వల్ల పరిష్కారం ఉంటుంది.
కటి భాగంలో కండరాలను బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా కొన్ని వ్యాయామాలుంటాయి. ప్రొలాప్స్‌ ఉన్నట్టు గుర్తిస్తే వీటిని సూచిస్తారు.
-- పెస్సరీస్‌ అనేది సిలికాన్‌ పరికరం. దీన్ని యోని పై భాగంలో అమరిస్తే కటి వలయ నిర్మాణానికి దన్నుగా ఉంటుంది. ఇవి రకరకాల ఆకృతుల్లో అందుబాటులో ఉంటాయి. గర్భిణులకూ, అప్పుడే ప్రసవం అయిన వారికీ, శస్త్రచికిత్స చేయించుకోవాలనే వారికి ఇది అనువుగా ఉంటుంది. శస్త్రచికిత్స చేయించుకోవడం ఇష్టపడనివారు దీన్ని శాశ్వతంగా అలానే ఉంచేసుకోవచ్చు. దీన్ని సరిగ్గా అమరిస్తే యోని వద్ద ఒక పరికరం ఉంది అనే భావనా కలగదు. ఇది చిన్నగా ఉంటే ఇవతలకు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగని బిగుతుగా అమరిస్తే యోని భాగంలో ఏదో ఉందనే భావనా, పుండూ, నొప్పీ, రక్తస్రావం వంటివి ఇబ్బందిపెట్టొచ్చు. అలా అనిపిస్తే మాత్రం వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.
-- హార్మోన్ల చికిత్స కూడా సూచిస్తారు. దీనివల్ల అంత ఫలితం ఉండకపోవచ్చు. కణజాలం మందంగా, పొడిబారినప్పుడు గాఢత తక్కువ ఉన్న ఈస్ట్రోజెన్‌ క్రీములు వాడటం వల్ల ప్రయోజనం ఉండొచ్చు. శస్త్రచికిత్సలు..
పైన చెప్పిన ఏ చికిత్స వల్లా ప్రయోజనం లేని పక్షంలో శస్త్రచికిత్స తప్పనిసరి. కటివలయానికి దన్నుగా ఉండే నిర్మాణాన్ని పునర్నిర్మించడం లేదంటే బాగు చేయడం శస్త్రచికిత్సలో భాగం. ఇందుకు రకరకాల చికిత్సా ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. అవయవాలేమన్నా విచ్ఛిన్నమవుతాయా, మహిళ వయసూ, ఆమె గర్భాశయాన్ని కావాలనుకుంటున్నదా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వైద్యులు శస్త్రచికిత్సను నిర్ణయిస్తారు.
-- కటివలయ భాగాన్ని బలోపేతం చేసేందుకూ, ఆసరా ఇచ్చేందుకూ యోనిగోడల్ని బిగుతుగా మారుస్తారు. దీనికి కోత ఉండదు. యోనిలోపల నుంచే శస్త్రచికిత్స చేస్తారు. మెష్‌ అనే ఓ పరికరాన్ని యోనిలో అమర్చడం మరో చికిత్సా విధానం.
-- గర్భాశయం లేదా యోని భాగాన్ని వెన్నెముక అడుగున ఉన్న ఎముకకు జతచేస్తారు. ఇది చాలా కీలకమైన శస్త్రచికిత్స. గర్భాశయం పూర్తిగా కిందకు జారినప్పుడు వయసును బట్టి దాన్ని తొలగిస్తారు. కటివలయం చికిత్సలో భాగంగా దీన్ని ఎంచుకుంటారు.
-- ఆరోగ్య పరిస్థితి మరీ చేయిదాటిపోతుంది అనుకున్నప్పుడు, గతంలో శస్త్రచికిత్సలకు చేసి విఫలమైన సందర్భాల్లో యోనిని పూర్తిగా మూసేయాల్సి వస్తుంది. ఇలా చేస్తే దీర్ఘకాలంగా లైంగిక కలయిక అసాధ్యమవుతుంది. ఇబ్బందులుండొచ్చు...
--శస్త్రచికిత్స చేసినప్పుడు నొప్పీ, అసౌకర్యం కొన్ని వారాలపాటు తప్పదు. కలయిక సమయంలో కొన్నిరోజులు నొప్పి ఉండొచ్చు. కొన్నిసార్లు ఇది శాశ్వతంగానూ ఉండే అవకాశం ఉంది.
-- ఆపరేషన్‌ తరవాత దగ్గినా, తుమ్మినా, నవ్వినా మూత్రం బయటకు వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు మళ్లీ శస్త్రచికత్స చేయాల్సి రావచ్చు. మూత్రాశయం నిండినట్టు అనిపిస్తుంది. దాదాపు వందమందిలో కేవలం ఐదు నుంచి పది మందికి మాత్రమే ఇలాంటి భావన ఉండదు. అందుకే సంచిని లోపల అమర్చాల్సి ఉంటుంది. -