header

Test for Ladies/ స్త్రీలు చేయుంచుకోవాలసిన కొన్ని ముఖ్యమైన పరీక్షలు

Test for Ladies/ స్త్రీలు చేయుంచుకోవాలసిన కొన్ని ముఖ్యమైన పరీక్షలు

Pop Smear Test….పాప్స్మియర్

గర్భాశయ ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్ని గుర్తించడానికి చేసే చాలా ముఖ్యమైన పరీక్ష ఇది. ఇందులో గర్భాశయ ముఖద్వారం నుంచి కొన్ని కణాలను సేకరించి, పరీక్షిస్తారు. దీంతో క్యాన్సర్ రావడానికి ఐదు నుంచి పది సంవత్సరాల ముందుగానే గుర్తించవచ్చు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ భారతీయ స్త్రీలల్లో అత్యంత సాధారణంగా కనిపిస్తుంది. అందుకే కలయిక మొదలుపెట్టిన సంవత్సరం తరువాత నుంచీ, లేదా ఇరవై ఒక్క సంవత్సరాల నుంచీ చేయించుకోవటం మంచిది. ప్రతి రెండు మూడు సంవత్సరాలకోసారి చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే క్యాన్సర్ను ముందుగా గుర్తించి, రాకుండానే నివారించవచ్చు. ఇప్పుడు మనకు పాప్స్మియర్తోపాటు హెచ్పీవీ (హ్యూమన్పాపిలోమా వైరస్) పరీక్ష కూడా అందుబాటులో ఉంది. దీన్ని ఐదేళ్లకోసారి చేయించుకుంటే క్యాన్సర్ ముప్పును ముందుగానే పసిగట్టవచ్చు.

Mammography test …మామోగ్రాఫీ

దీనిద్వారా రొమ్ముక్యాన్సర్ని ప్రారంభదశలోనే గుర్తించొచ్చు. సాధారణంగా అయితే దీన్ని నలభై ఏళ్ల నుంచీ చేయించుకోవాలి. అయితే కుటుంబంలో ఎవరైనా క్యాన్సర్ బాధితులు ఉన్నా... రిస్క్ఫ్యాక్టర్స్ ఉంటే గనుక అంతకన్నా ముందునుంచీ చేయించుకోవాలి. అలాగే ప్రతి రెండుమూడేళ్లకోసారి చేయించుకోవాలి. దీన్ని ప్రత్యేకమైన ఎక్సరే, ఆ తరువాత అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా చేస్తారు. అలాగే స్వీయ రొమ్ము పరీక్ష చేసుకోవడం కూడా తెలిసుండాలి. నెలసరి అయిపోయిన వెంటనే రొమ్ముల్ని చేతులతో తాకి పరీక్షించుకోవడం వల్ల తేడాలు ఏమైనా ఉంటే గమనించుకోవచ్చు.

Bowel Cancer…బవెల్ క్యాన్సర్

ఇది పేగులకు సంబంధించిన క్యాన్సర్. మలంలో రక్తం పోవడాన్ని గుర్తించే అక్కల్ట్ బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల దీన్ని గుర్తించొచ్చు. ఆ రిస్క్ ఉన్నవారు రెండేళ్లకోసారి చేయించుకోవడం మంచిది.

Bone Density test….ఎముకల దృఢత్వం కోసం

వయసుపైబడిన స్త్రీలల్లో అత్యంత సాధారణంగా కనిపించే సమస్య ఆస్టియోపోరోసిస్. అంటే ఎముకలు గుల్లబారతాయి. ఏ మాత్రం జారి కిందపడినా, ఒక్కోసారి కాలు మెలికపడినా ఫ్రాక్చర్లు అవుతాయి. అందుకే బాగా సన్నగా ఉన్నవారూ, వయసు నలబైఅయిదు పైన ఉన్నవారూ, మెనోపాజ్ దశకు చేరుకున్నవారూ, ఉబ్బసంతో బాధపడేవారూ, స్టిరాయిడ్లు ఎక్కువగా తీసుకునేవారు కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఇది జన్యుపరంగా కూడా రావచ్చు. మెనోపాజ్ తరువాత ప్రతి స్త్రీలో ఎముకల సాంద్రత తగ్గుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ బోన్డెన్సిటీ (డెక్సా) పరీక్ష చేయించుకోవాలి. ఒకవేళ ఎముకల దృఢంగా ఉంటే మూడేళ్ల తరువాత చేయించుకోవాలి.