header

Ankylosing Spondylitis Pain/ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్

Ankylosing Spondylitis Pain/ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్

Doctor Saratchandra Mouli/Rumatology Dept/Kims Hospital/Secunderabad డాక్టర్ శరత్ చంద్రమౌళి/రుమటాలజి/కిమ్స్/సికింద్రాబాద్ సౌజన్యంతో....
నొప్పి ఒకటే కావొచ్చు. అది నడుంలోనే ఉండొచ్చు! కానీ అన్ని నడుంనొప్పులూ ఒకటి కాదు. శారీరక శ్రమ ఎక్కువైనప్పుడో, అడ్డదిడ్డంగా కూచోవటం వల్లనో తలెత్తే నొప్పి వేరు. ఇది విశ్రాంతి తీసుకుంటే తగ్గొచ్చు. కానీ ఒంట్లోనే పొడసూపే సమస్యలతో తలెత్తే నొప్పి వేరు. అలాంటిదే యాంకిలోజింగ్ స్పాండిలైటిస్. ఇది విశ్రాంతితో తగ్గదు సరికదా.. మరింత ఎక్కువవుతుంది! వెన్నెముకలోని పూసలను క్రమంగా దెబ్బతీస్తూ.. చివరికి వెన్నెముకను గడకర్రలానూ మార్చేస్తుంది. తలపై బరువేదో మోస్తున్నట్టుగా మెడనూ, నడుమునూ ముందుకు వంగిపోయేలా చేసేస్తుంది. దీంతో ప్రతి కదలికా భారమై.. రోజువారీ పనులు సైతం చేసుకోలేక.. పక్కలకు చూడాలన్నా శరీరం మొత్తాన్ని తిప్పాల్సిన దుస్థితికి తీసుకెళ్తుంది. దీని ఆనవాళ్లు యవ్వనదశలోనే మొదలైనా పోల్చుకోలేకపోవటం పెద్ద సమస్య. ఇది దీర్ఘకాల జబ్బు కావటం.. దీనిపై అంతగా అవగాహన లేకపోవటం మరో సమస్య. మామూలు నడుమునొప్పిగా కొందరు.. వయసుతో పాటు వచ్చే మార్పుగా మరికొందరు భావిస్తూ చేజేతులా సమస్యను తీవ్రం చేసుకుంటున్నారు. కానీ తొలిదశలోనే గుర్తించి, చికిత్స తీసుకుంటే.. వ్యాయామాల వంటివి ఆరంభిస్తే దీన్ని చాలావరకు అదుపులో ఉంచుకోవచ్చు. అందరిలా హాయిగానూ గడపొచ్చు.
యాంకిలోజింగ్ స్పాండిలైటిస్
నిటారుగా నిలబడతాం. ముందుకు వంగుతాం, పక్కలకు తిరుగుతాం. ఇలాంటి పనులన్నింటినీ మనం చాలా తేలికగా, అలవోకగా చేస్తున్నామంటే అదంతా వెన్నెముక చలవే. వెన్నెముకలోని పూసలు సున్నితంగా, మృదువుగా కదలటం వల్లనే. మన తల నుంచి కటి భాగం వరకూ పూసలు పూసలుగా.. ఒక దండలా ఉంటుంది వెన్నెముక. ఒక్కో వెన్ను పూసా ఒక్కో ఎముక అనుకోవచ్చు. వీటి మధ్య మందంగా, ధృడంగా ఉండే రబ్బర్ల వంటి డిస్కులుంటాయి. వీటికి అతుక్కొని ఉండే కండరబంధనాలు (లిగమెంట్లు), స్నాయువులు (టెండన్లు) పూసలు కదిలినా పక్కలకు తొలగిపోకుండా స్థిరంగా పట్టి ఉంచుతాయి. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ సరిగ్గా వీటి మీదే దాడి చేస్తుంది. వెన్నెముకలో వాపు ప్రక్రియ (స్పాండిలైటిస్) మూలంగా పూసలు ఒకదాంతో మరోటి అతుక్కుపోవటం (యాంకిలోజింగ్) దీనిలోని ప్రత్యేకత. ముందుగా వాపు ప్రక్రియ తలెత్తిన చోట ఎముక క్షీణిస్తుంది. దీంతో శరీరం అక్కడ కొత్త ఎముకను వృద్ధి చేసి మరమ్మతు చేయటానికి ప్రయత్నిస్తుంది.
ఇది నిరంతరం కొనసాగుతూ రావటం వల్ల పూసలు ఒకదాంతో మరోటి కలిసిపోతాయి. అంటే ఇటుకల మధ్య సిమెంటు వేస్తే గట్టిపడినట్టుగా అయిపోతాయన్నమాట. సమస్య తీవ్రమవుతున్నకొద్దీ- పూసలన్నీ అతుక్కుపోయి వెన్నెముక వెదురుబొంగులా (బ్యాంబూ స్పైన్) తయారవుతుంది కూడా. దీంతో కదలికలు తగ్గిపోవటం, నడుంనొప్పి వంటివన్నీ బయలుదేరతాయి. ఇది ఒక్క వెన్నెముకతోనే ఆగిపోదు. మోకాలు, మోచేయి, పాదాల్లోని కీళ్లపైనా ప్రభావం చూపుతుంది. కొందరిలో కంటి సమస్యకూ దారితీయొచ్చు.
నడుంనొప్పి తొలి లక్షణం
యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ తొలి లక్షణం నడుంనొప్పి. ముఖ్యంగా పొద్దున లేస్తూనే తీవ్రమైన నొప్పి వేధిస్తుంటుంది. ఈ నొప్పి 45 నిమిషాల నుంచి గంట వరకూ అలాగే ఉంటుంది! దీని బారినపడ్డవాళ్లు వెంటనే పక్క మీది నుంచి లేవలేరు కూడా. శరీరం కాసేపు కుదురుకున్నాకే లేస్తుంటారు. మామూలుగా నడవటానికి దాదాపు గంట సేపు పట్టొచ్చు. రాత్రిపూట పడుకున్న తర్వాత కూడా నొప్పి వేధించొచ్చు. దీంతో అర్ధరాత్రి, తెల్లవారుజామున మెలకువ వచ్చేస్తుంటుంది. వీరికి పడుకొని పక్కలకు దొర్లటమూ సాధ్యం కాదు. నడుము కదలికలు కష్టం కావటం వల్ల చేతులను పక్కవైపులకు ఆనించి, వాటి సాయంతో నెమ్మదిగా కదులుతుంటారు. పిరుదుల్లో మార్చి మార్చి నొప్పి కనబడటం మరో ప్రత్యేకత. కొద్దిరోజులు ఎడమ పిరుదులో నొప్పి వేధిస్తే.. కొన్నాళ్లకు కుడి పిరుదులో నొప్పి తలెత్తుతుంది. కొందరిలో రెండు పిరుదుల్లోనూ నొప్పి ఉండొచ్చు.
మిగతా పేజీలో తరువాత పేజీలో.....