header

Asthma …..ఊపిరి పిండే ఉబ్బసం

Asthma …..ఊపిరి పిండే ఉబ్బసం

డా..ఆర్‌. విజయకుమార్‌, సీనియర్‌ పల్మనాలజిస్ట్‌, యశోదా హాస్పటల్స్‌, సికింద్రాబాద్‌.
ఆస్తమా... తరచుగా రోగులే కాదు... వైద్యులు కూడా పొరబడుతున్న క్లిష్టమైనసమస్య. మన చుట్టూ ఎన్నో ఆస్తమా కారకాలున్నాయి. కానీ అన్నింటితో అందరికీ సమస్య ఉండదు. అలాగని ఎవరికి వేటితో సమస్య తలెత్తుతుందో చెప్పటం అంతతేలిక కాదు. అలాగే బాధితులలో ఎవరికి, ఎప్పుడు, ఎందుకు, ఎంత తీవ్రంగా వస్తుందో చెప్పటమూ అంత సులభం కాదు.
అలాగే కొందరు చాలా కాలంగా ఆస్తమాతో బాధపడుతున్నప్పటికీ పెద్దగా బాధలేవీ లేవనే అంటారు. అంటే వాళ్ళు ఒక రకంగా దానికి అలవాటు పడిపోయారని అనుకోవచ్చు. వేగంగా నడిచినా, మెట్లెక్కినా ఆయాసం రావడం వంటి లక్షణాలన్నీ వీరిలో కనిపిస్తుంటాయి చాలామందికి ఊపిరితిత్తుల సామర్థ్యం పరీక్ష చేస్తే 25శాతమే పనిచేస్తున్నట్లు బయటపడుతుంది. దీర్ఘకాలం ఆస్తమాకు సరైన చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటే ఊపిరితిత్తుల సామర్థ్యం ఇలా గణనీయంగా పడిపోతుంది. ఇలా ఆస్తమా బాధితులు పెద్దగా ఇబ్బందేమీ లేదని చెబుతున్నప్పుడు వైద్యులు పొరబడుతుంటారు. దీనివల్ల మందులు తగిన మోతాదులో సిఫార్సు చేయకపోవచ్చు. ఫలితంగా వ్యాధి ముదురుతూ తీవ్ర పరిస్థితులు తలెత్తుతాయి.
ఆస్తమా బాధితులందరిలోనూ లక్షణాల తీవ్రత ఒకేలా ఉండదు. వీటిలో చాలా రకాలున్నాయి. వీటినే 'ఫీనోటైప్స్‌' అంటారు. కొందరు ఏ కొంచె ఆస్తమా ఉన్నా తీవ్రమైన ఆయాసంతో, శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతుంటారు. వీరిని పరీక్షిస్తే జబ్బు తీవ్రత కూడా ఏమంత ఎక్కువగా ఉండదు. కానీ బాధలు ఎక్కువగానే ఉంటాయి. కొందరిలో కొన్నికొన్ని కాలాల్లో కొద్దిరోజులు మాత్రమే ఆస్తమా కనబడుతుంది. దీనిని 'ఇంటర్‌మీడియట్ ఫీనోటైప్‌' అంటారు. మరికొందరికి ఉన్నట్టుండి హఠాత్తుగా ఉబ్బసం ఉధ్ధృతంగా ముంచుకొచ్చేస్తుంది. వీరిని ఇంటన్సివ్‌ కేర్‌ యూనిట్ లో చేర్చి వెంటిలేటర్స్‌ అమర్చితే కాని తిరిగి కోలుకోలేదు. ఇలాంటిరకాన్ని 'నియర్‌ ఫాటల్‌ ఆస్తమా' అంటారు.
ఉబ్బసం బాధితుల్లో ఎక్కువమందికి ఏడాది పొడవునా అప్పుడప్పుడు ఉబ్బసం బాధలు వచ్చిపోతుంటాయి. ఇల్లు దులిపినప్పుడో దుమ్ము, ధూళిలోకి వెళ్ళినప్పుడో వీరిలో ఆస్తమా లక్షణాలు బాధించవచ్చు. దీన్ని 'మోడరేట్ ఫీనోటైప్‌' అంటారు. అసలు ఉబ్బసం విషయంలో ఇలా వ్యక్తులను బట్టి, పరిస్థితులను బట్టి తీవ్రతలో తేడాలు ఎందుకు కనిపిస్తున్నాయన్నది ఇప్పటివరకూ పూర్తిగా తెలియదనే చెప్పాలి. అయితే ఏ రకం ఉబ్బసం ఉన్నా దాన్ని సమర్థంగా నియంత్రించేందుకు మాత్రం ఇప్పుడు సమర్థమైన చికిత్సా విధానాలు మాత్రం ఉన్నాయి.
ఉబ్బసం ఉందా? లేదా? ఉంటే ఎంత తీవ్రంగా ఉంది అన్నది గుర్తించడం ఒకప్పుడు కొంత కష్టంగా ఉండేదిగానీ ఇప్పుడు దీనికి కచ్చితమైన పరీక్షలు ఉన్నాయి. ఇవి ఐదేళ్ళు దాటిన పిల్లలనుంచి పెద్దల వరకు అందరికీ ఉపయోగపడతాయి.
లంగ్‌ ఫంక్షన్‌ టెస్ట్‌ : ఇందులో మనం ఎంత గాలి పీలుస్తున్నాం, ఎంత వదులుతున్నాం, ఎంత సమయంలో వదులుతున్నామన్నది కంప్యూటర్‌ సహాయంతో కచ్చితంగా కొలుస్తారు. ఆరోగ్యవంతుడైన ఒక వ్యక్తి గాలి వదిలినప్పుడు తొలిసెకండులోనే 80-90 శాతం గాలి బయటకు వచ్చేస్తుంది. అదే ఆస్తమా గలవారిలో ఇందుకు 4 సెకండ్ల వరకు సమయం పడుతుంది. ఇలాంటి వారికి వెంటనే రిలీవర్‌ మందు ఇచ్చి, 20 నిమిషాల తర్వాత మళ్ళీ పరీక్ష చేస్తారు. అప్పుడు మొదిసారి పరీక్షలో వదిలిన గాలికన్నా 10-12 శాతం ఎక్కువ గాలి వదిలితే ఆస్తమా ఉన్నట్టు నిర్థారిస్తారు.
పీక్‌ఫ్లో మీటర్‌ : ప్లాస్టిక్‌ గొట్టంలా ఉండే దీనిలోకి గట్టా ఊదినప్పుడు ముల్లు కదులుతుంది. ఆ అంకెలను బట్టి గాలి వదిలిన వేగాన్ని గుర్తిస్తారు. ఆరోగ్యంగా ఉన్న 6 అడుగుల ఎత్తున్న వ్యక్తి ఇందులో గాలిని ఊదితే ముల్లు 600 వరకు చేరుతుంది. ఒకవేళ ఇది 300 వరకే నమోదైతే ఆస్తమా ఉన్నట్టు అర్థం. అప్పుడు రిలీవర్‌ ఇచ్చి 20 నిమిషాల తర్వాత మళ్ళీ పరీక్ష చేస్తారు. అప్పుడు మొదిసారికన్నా 10 శాతం మెరుగ్గా ఉంటే ఆస్తమాగా నిర్ధారిస్తారు.
ఛాతీ ఎక్స్‌రే : ఆస్తమా లక్షణాలే గల ఇతర సమస్యలేమైనా ఉంటే ఛాతీ ఎక్స్‌రేలో బయటపడతాయి.
ఒకప్పుడు ఆస్తమా అనగానే... దగ్గు, ఆయాసం వంటి బాధలు ఎక్కువ ఉంటేనే చికిత్స చేయాలని భావించేవారు. ఈ విషయంలో మన వైద్యరంగం అవగాహన ఇప్పుడు చాలా మారింది. ఆస్తమా జీవితాంతం ఉండే సమస్య. కేవలం లక్షణాలు కనిపించినంత మాత్రాన వ్యాధి లేదని అనుకోరాదు. శ్వాసనాళాల్లో ఆస్తమాకు సంబంధించిన వాపు (ఇన్‌ఫ్లమేషన్‌) లోలోపల అలా ఎంతోకొంత కొనసాగుతూనే ఉంటుంది. అందుకే దీనికి నిరంతరం చికిత్స అవసరం. సరైన చికిత్స తీసుకోకపోతే... ఊపిరితిత్తుల్లోని శ్వాసనాళాలు ఏటా 2-3% చొప్పున మూసుకుపోతాయి. క్రమేపీ కొన్నేళ్ళకు శ్వాసనాళాల నిర్మాణం, స్వభావంలోనే తేడాలు వచ్చేసే (రీ మోడలింగ్‌) ప్రమాదం ఉంది. ఒకసారి ఈ స్థితికి చేరితే వాటిని తిరిగి సరిచేయడం సాధ్యంకాదు. కాబట్టి... ఉబ్బసం లక్షణాలు కనిపించకపోయినా మందులు వాడుతూనే ఉండడం చాలా అవసరం.
మేలుచేసే ఇన్‌హేలర్లు
ఉబ్బసానికి 1970 సంవత్సరం నుంచీ ఇన్‌హేలర్లతో చికిత్స అందుబాటులోకి వచ్చింది. మామూలుగా బిళ్ళలు, మాత్రల్లో ఉండే మందే ఇన్‌హేలర్లలోనూ ఉంటుంది కానీ, వీటిద్వారా తీసుకుంటే మందు మోతాదును 1/40శాతం వంతుకు తగ్గించే వీలుంది. నోటిద్వారా పీల్చినప్పుడు వీటిలోని మందు నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది. కాబట్టి వీటితో ఇతరత్రా దుష్ప్రభావాలకు ఆస్కారం ఉండదు. ఇలా మందును చాలా తక్కువ మోతాదుల్లో ఇస్తుండడం, వీటికి దుష్ప్రభావాలు లేకపోవడం వల్ల దీర్ఘకాలం వాడినా ఇబ్బంది ఉండదు. చిన్నపిల్లలు, గర్భిణులకు కూడా నిశ్చింతగా ఇవ్వవచ్చు
మందులు రెండురకాలు
ఆస్తమా మందుల్లో రెండు రకాలు ఉన్నాయి. ఉబ్బసం లక్షణాలు బాధిస్తున్నప్పుడే వాడాల్సినవి ఒకరకం. వీటిని రిలీవర్స్‌ అంటారు. ఇవి కుంచించుకుపోయిన శ్వాసనాళాలు వెంటనే తెరుచుకొనేలా చేస్తాయి. దీంతో వెంటనే ఉబ్బసం బాధలనుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే వీటి ప్రభావం కొంత తాత్కాలికం. కాబట్టి మళ్ళీ రాకుండా నివారించేందుకు మరో రకం మందులనూ వైద్యులు సిఫార్సు చేస్తారు. వీటిని 'ప్రివెంటర్స్‌', 'కంట్రోలర్స్‌' అంటారు. ఈ మందుల్లో దేని పని దానిదే. అంటే రిలీవర్స్‌, ఆస్తమా రాకుండా నివారించలేవు... అలాగే కంట్రోటర్స్‌ వెంటనే ఉపశమనాన్ని ఇవ్వలేవు. కాబ్టి వైద్యుల సిఫార్సుతో రెంటినీ పద్ధతిప్రకారం వాడుకోవడం అవసరం.
ఈ మందులకు అయ్యే ఖర్చు కూడా మరీ ఎక్కువేం కాదు. ముఖ్యంగా ఆస్తమా తీవ్రతరమై ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు ఆసుపత్రిలో చేరి 3,4 రోజులు ఉంటే అయ్యే ఖర్చుతో, జీవితాంతం ఇన్‌హేలర్స్‌ వాడుకోవచ్చు. ఈ ఇన్‌హేలర్స్‌ వాడేటప్పుడు కూడా అరుదుగా ఉబ్బసం లక్షణాలు పెరగవచ్చు. ఇలాంటి సమయంలో మందులను మాత్రలు లేదా ఇంజెక్షన్ల రూపంలో ఇస్తారు.
ప్రివెంటర్స్‌ జీవితాంతం తీసుకోవాల్సిన మందులు. ఏదైనా ఇల్లు దులపడం, దుమ్ములోకి వెళ్ళటం వంటి సందర్భాల్లోనే ఉబ్బసం వచ్చే 'ఇంటర్‌మీడియ్‌ ఫీనోటైప్‌' వాళ్ళు ఇలా నిరంతరం వాడుకోవాల్సిన పనిలేదు కానీ ఆస్తమా లక్షణాలు వస్తూపోతూ ఉంటే వాళ్ళంతా వీటిని జీవితాంతం వాడుకోవాల్సిందే. ముఖ్యంగా పిల్లల్లో ఈ రకం ఆస్తమా (పర్సిస్టెంట్) ఎక్కువ ప్రివెంటర్స్‌గా ఇచ్చే ఈ మందులన్నీ స్టిరాయిడ్లే. వీటి వాడకం మీద చాలా అపోహలున్నాయి గానీ, వాస్తవానికి ఇవి చాలా సురక్షితమైనవి.
మందులు వాడినా ఆస్తమా నియంత్రణలోకి రానివారికి ప్రస్తుతం మోనోక్లోసల్‌ యాంటీబాడీలనే రకం మందులు ఉన్నాయి.
ఎందుకొస్తుంది?
మన ఊపిరితిత్తుల్లోని శ్వాసనాళాలు చాలా సున్నితమైనవి. వీటికి ఏదైనా అలర్జీ కారకం తగిలినప్పుడు... ఇవి ఒక్కసారిగా వాచి.. ఉబ్బిపోయి.. సంకోచించుకుపోతాయి. దీంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఇదే ఉబ్బసానికి మూలం. అయితే సరిపడని పదార్థాలు... అలర్జీ కారకాలన్నవి వ్యక్తి వ్యక్తికీ మారిపోతుంటాయి. దీనికి జన్యుపరమైన అంశాలు కారణమవుతున్నాయి.
ఆస్తమా, అలర్జీలకు జన్యుమూలాలు ఉన్నాయని తాజా పరిశోధనల్లో తేలింది. ఇలాంటి జన్యువులను 'అటోపీజీన్స్‌' అంటారు. చాలామంది ఆస్తమా బాధితుల్లో 11వ క్రోమోజోమ్‌ జన్యువుల్లో ఒక 'అటోపీజీన్‌' ఉంటున్నట్లు గుర్తించారు. ఇంకా కొత్తకొత్త జన్యువులూ బయటపడుతున్నాయి. అయితే ఈ జన్యువులు ఉన్న వారందరికీ ఆస్తమా రావాల్సిన అవసరం లేదు. తల్లితండ్రుల్లో ఈ జన్యువులు లేకపోయినా, పిల్లలకు వస్తున్న సందర్భాలున్నాయి. వంశంలో ఎవరికీ లేకపోయినా ఆస్తమా వచ్చే అవకాశాలున్నాయి. సిజేరియన్‌ కాన్పు ద్వారా పుట్టిప పిల్లల్లో ఆస్తమా వచ్చే అవకాశం 15-20 శాతం ఎక్కువ. తక్కువ బరువుతో పుట్టే పిల్లల్లోనూ రావచ్చు
అటోపీ జన్యువులు ఉన్నవారిలో మాత్రం... అలర్జీకి సంబంధించి ఒక స్పష్టమైన పద్ధతి కనిపిస్తుంది. వీరిలో అలర్జీకి ఒక దాని తర్వాత మరోదానికి (అలర్జీమార్చ్‌) పాకుతుంటుంది. ముందు చర్మానికి సంబంధించిన అలర్జీ మొదలవుతుంది. కాళ్ళు, చేతుల మీద దురద, దద్దుర్ల వంటివి వస్తాయి. అయితే గమ్మత్తుగా కొన్నాళ్ళకు ఈ చర్మ అలర్జీ దానంతట అదే తగ్గుతుంది. ఆ వెంటనే ముక్కుకు సంబంధించిన అలర్జీ దాడిచేస్తుంది. ముక్కు బిగిసిపోవడం, కారటం, తుమ్ములు రావడం వంటివి ఆరంభమవుతాయి. కొంతకాలానికి ఇవీ తగ్గిపోతాయి. తర్వాత ఊపిరితిత్తులకి ఈ అలర్జీ పాకుతుంది. దగ్గు, పిల్లికూతలు, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆస్తమా బారిన పడిన 95 శాతం మందిలో ఈ అలర్జీమార్చ్‌ స్పష్టంగా కనిపించడం గమనార్హం. ఈ మార్చ్‌ చిన్నతనంలో ప్రారంభమై పిల్లలు పెద్దయ్యే సరికి ఊపిరితిత్తుల్లోకి విస్తరిస్తుంది. 40ఏళ్ళు దాటిన వారిలోనూ ఆస్తమా తొలిసారిగా బయటపడే అవకాశం ఉంది. వీరికి ముందునుంచీ ఆస్తమా తత్వం శరీరంలో ఉండిపోతుంది. ఏదో ఒక ప్రేరకానికి (ట్రిగ్గర్‌) గురికావడం వల్ల హఠాత్తుగా ఆస్తమా లక్షణాలు బయటపడుతుంటాయి.
మందులు : కొందరిలో కొన్ని మందులు ముఖ్యంగా నొప్పి నివారణ మందులు (నాన్‌స్టిరాయిడల్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీడ్రగ్స్‌) కూడా ఆస్తమా ప్రేరకాలుగా మారొచ్చు. సురక్షితమైన నొప్పి నివారిణిగా భావిస్తున్న పారాసిటమాల్‌ వాడే వారికి కూడా ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు బ్రిటన్‌ అధ్యయనంలో వెల్లడైంది.
రంగులు : ఆహార పదార్ధాల్లో ఉపయోగించే రంగులు కూడా కొందరిలో ఆస్తమాను ప్రేరేపిస్తున్నాయి. చాలామంది తమకు అవి తింటే పడదు. ఇవి తింటే పడదు. అని చెబుతుంటారు. కానీ ఆహారంతో వచ్చే అలర్జీ 5శాతం కన్నా తక్కువే. ఆస్తమా నియంత్రణలో లేకపోవడం వల్ల ఇలాంటి వాళ్ళు ఏం తిన్నా పెరిగినట్టుగానే అనిపిస్తుంది. దీంతో అపోహలు పెరిగిపోతున్నాయి. అసలే మన దేశంలో సమతుల ఆహారం వినియోగంపై అవగాహన తక్కువ. దీనికి రకరకాల అపోహలు తోడై చివరికి పోషణలోపానికి దారితీస్తుంది. అందువల్ల ఆస్తమా ఉన్నవాళ్ళు అన్ని రకాల పదార్థాలను నిర్భయంగా తినొచ్చు. ప్రత్యేకించి ఏదైనా ఒక వస్తువు పడడం లేదని గుర్తించినపుడు దానికి దూరంగా ఉంటే సరిపోతుంది. వేడి - చల్లన : ఆహారం విషయంలో ఆయా పదార్ధాలకన్నా వాటి ఉష్ణోగ్రత ఆస్తమా ప్రేరకంగా పనిచేస్తోంది. అప్పుడే వండుకొని, వేడిగా తింటే ఎలాంటి బెడదా ఉండదు. అదే పదార్థాన్ని ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా ఉన్నప్పుడు తీసుకుంటే కొందరికి అలర్జీ రావచ్చు. కాబ్టి ఆస్తమా, అలర్జీ ఉన్నవాళ్ళు కూల్‌డ్రింక్‌లు, ఐస్‌క్రీముల విం వాటికి దూరంగా ఉండడం, వేడివేడి పదార్థాలు తీసుకోవడం మంచిది.
జాగ్రత్తలు :
వ్యాయామం చేస్తున్పప్పుడు గాలిని వేగంగా తీసుకుంటారు. ఈ సమయంలో కొంత గాలి లోపలే నిల్వ ఉంటుంది. ఇది కూడా ఆస్తమా ప్రేరకంగా పనిచేయవచ్చు. దీన్నే ఎక్సర్‌సైజ్‌ ఇండ్యూస్డ్‌ ఆస్తమా అంటారు. అయితే ఆస్తమా గలవారికి మెట్లు ఎక్కినా ఏదైనా బరువు పనిచేసినా ఆయాసం వస్తుంది. దీనికి, వ్యాయామం వల్ల వచ్చే దానికీ సంబంధం లేదు. మిగతా వారిలాగానే ఆస్తమా బాధితులు వ్యాయామం చేయడం అవసరం.
సరైన పోషకాహారం తీసుకోవాలి. ముఖ్యంగా సూర్యరశ్మి తాకేలా చూసుకోవాలి. విటమిన్‌ డి, అన్నిరకాల కూరగాయలు, పండ్లు తినాలి. పొగాకు జోలికి అసలే వెళ్లకూడదు. సిగరెట్లు, బీడీలు, తాగేవారి పక్కన ఉండరాదు. పొగ తాగేవారి కన్నా పక్కనుండి పీల్చే వారిలో పొగాకు సంబంధ రసాయనాలు ఎక్కువగా ఉంటాయని మరువరాదు.
తల్లిదండ్రుల్లో ఎవరికైనా సిగరెట్లు కాల్చే అలవాటు ఉంటే వారి పిల్లల్లో ఆస్తమా త్వరగా తగ్గదు. ఒక సిగరెట్ కాల్చినా దాని ప్రభావం రోజంతా గదిలో ఉంటుంది.
క్రిమి సంహారకమందులు, దోమలను తరిమే రిపెల్లెంట్లు, కాయిల్స్‌, అగరుబత్తీలు, హోమాల నుండి వచ్చే పొగ... ఇవి కూడా ఆస్తమాకు ప్రేరకాలుగా పనిచేస్తాయి.
బెడ్‌రూమ్‌ను స్టోర్‌రూమ్‌గా ఉపయోగించరాదు. పుస్తకాలు, పాతపేపర్లు, ధాన్యం నిల్వలు వింవి ఉంచరాదు.
ఉబ్బసం కారకాలు, ఏసీలు, సిమెంట్, దుమ్ము, చల్లని కూల్‌డ్రింక్‌లు, ఇంట్లో దుమ్ము, ధూళి, పాతపుస్తకాలు, పుప్పొడి, పెంపుడు జంతువుల బొచ్చు, దిండ్లలో ఉండే తవిటి పురుగులు, సముద్ర ఆహారం ఇలాంటి వన్నీ ప్రేరకాలుగా పనిచేసి ఆస్తమా ముంచుకు రావడానికి దోహదం చేస్తాయి.
పిల్లల్లో గుర్తించడం ముఖ్యం
పిల్లల్లో తరచుగా జలుబు, దగ్గు, ఆయాసం విం లక్షణాలు కనిపిస్తాయి. సహజంగానే డాక్టర్లు ఇలాంటి పిల్లలకు యాంటిబయాటిక్స్‌ ఇస్తారు. వీటితో పిల్లలు వారం పదిరోజులు బాగుంటారు. మళ్ళీ లక్షణాలు ఆరంభమవుతాయి. ఇలా తరచుగా వస్తుండడంతో స్కూలుకు సరిగ్గా వెళ్ళకపోవడంతో చదువు దెబ్బతింటుంది. నిజానికి ఈ లక్షణాలకు ఆస్తమా కారణమేమోనని అనుమానించడం, తగు పరీక్ష చేసి గుర్తించడం చాలా అవసరం. ఎందుకంటే దగ్గు, ఆయాసం విం లక్షణాలు ఆస్తమాలోనూ కనిపిస్తాయి. చాలాసార్లు డాక్టర్లు వీటిని అలర్జీ, బ్రాంకౖటీస్‌, న్యుమోనియా, వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌... ఇలా రకరకాల జబ్బులుగా పొరపడే అవకాశం ఉంది. దీంతో ఇవ్వాల్సిన మందులు ఇవ్వకపోగా, వాడకూడని మందులు వాడాల్సి వస్తుంది. జలుబు, దగ్గు, వింవి ఉంటే యాంటీబయాటిక్స్‌ బాగా పనిచేస్తాయి. కానీ ఆస్తమాలో యాంటీబయాటిక్స్‌ అవసరం అసలు ఉండదని గుర్తించాలి. కాబ్టి అసలు సమస్యను గుర్తించడం ముఖ్యం. దీంతో వీరికి యాంటీబయాటిక్స్‌ అనవసరంగా వాడే ముప్పు తప్పుతుంది. ప్రివెంటర్స్‌ ఇవ్వడం మొదలెడితే దగ్గు, ఆయాసం, పిల్లికూతలు వంటా వాటి నుంచి విముక్తి లభిస్తుంది.
వరమే కానీ...
మన ఊపిరితిత్తులకు శక్తి, సామర్థ్యం అవసరమైన దానికంటే కూడా సహజంగానే ఐదురెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది ఒకరకంగా వరమేగానీ ఆస్తమాను తొలిదశలో గుర్తించడంలో శాపంగానూ మారుతోంది. ఎందుకంటే ఆస్తమా లక్షణాలు కనిపిస్తున్నా, తొలిదశలో తెలుసుకుని తిరగుతూ బాగా ముదిరిన తర్వాతే వైద్యులను సంప్రదిస్తున్నారు. దీనివల్ల దీర్ఘకాలంలో నష్టం జరుగుతోంది.
దగ్గు ప్రభావం
ఇటీవలి వరకూ కూడా విపరీతమైన ఆయాసం, పిల్లికూతలు, ఉంటేనే ఆస్తమా అనుకునేవారు. కానీ అన్నింకన్నా ప్రధానమైన లక్షణం దగ్గు. దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. చాలామంది వైద్యులు దగ్గు అనగానే యాంటీబయాక్స్‌, దగ్గు తగ్గించే సిరప్‌లు ఇచ్చేస్తుంటారు. కానీ ఎప్పుడైనా ఒక కోర్సు యాంటీబయాటిక్స్‌ వాడినా దగ్గు తగ్గకపోతే వెంటనే ఆస్తమానేమోనని అని అనుమానించాలి. టీ.బీ అనుమానం నివృత్తి కోసం ఛాతీ ఎక్స్‌రే తీసినట్టుగానే ఆస్తమాను గుర్తించడానికి లంగ్‌ఫంక్షన్‌ టెస్ట్‌ తప్పకుండా చేయాలి. గతంలో చర్మం, ముక్కు, సంబంధ అలర్జీల వంటివి వుంటే మరింత బలంగా అనుమానించాలి.