header

Blood Pressure

రక్తపోటు

ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో నానాటికీ రక్తపోటు పెరిగిపోతోంది. మారిపోతున్న జీవనశైలి నుంచి అనారోగ్యకర ఆహారపుటలవాట్ల వరకూ.. కారణమేదైనా ‘రక్తపోటు’ పెరిగిపోతుండటం మాత్రం వాస్తవం. తాజాగా పరిశోధకులు 154 దేశాల్లో జరిగిన 844 అధ్యయనాలను క్రోడీకరించి చూసినప్పుడు ఈ వాస్తవం మరింత ప్రస్ఫుటంగా బయటపడింది. మనం రక్తపోటును సాధారణంగా రెండు సంఖ్యల్లో (120/80) చెబుతుంటాం. వీటిలో మొదటి సంఖ్య మరింత కీలకం. దీన్ని ‘సిస్టాలిక్‌ రక్తపోటు’ అంటారు. బీపీ ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీ వ్యాధుల ముప్పు పెరుగుతుంది. ముఖ్యంగా పైసంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే ఈ ముప్పు అంతగా పెరుగుతుంది. కాబట్టి యుక్త వయసు నుంచే ప్రతి ఒక్కరూ బీపీ మీద దృష్టి పెట్టటం, దాన్ని సాధ్యమైనంత తక్కువగా ఉంచుకోవటం ఉత్తమమని ఈ అధ్యయనం నిర్ధరణకు రావటం తప్పకుండా చెప్పుకోవాల్సిన అంశం. ఇందుకోసం మనం తీసుకునే ఆహారం మీద శ్రద్ధ పెట్టటం, బరువు ఎక్కువగా ఉంటే తగ్గటం, నిత్యం వ్యాయామం చెయ్యటం కీలకమైన అంశాలు. యుక్తవయసు నుంచే ఈ జాగ్రత్తలు తీసుకోవటం అవసరం.
కనిపించకుండానే.. కబళిస్తోంది!
అధిక రక్తపోటు (హైబీపీ) ఒకసారి వచ్చిందంటే దీర్ఘకాలం వేధిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే ఆపాద మస్తకాన్ని తొలిచేస్తుంది. గుండె, మెదడు, కిడ్నీలు.. ఇలా కీలక అవయవాలన్నింటినీ నిరంతరం దెబ్బతీస్తుంటుంది. ప్రాణాంతక సమస్యలకు బీజం వేస్తుంది. పైకేమీ కనిపించకుండానే లోలోపల విలయాన్ని సృష్టిస్తుంది. మన దేశంలో హైబీపీ ఉంటున్నప్పటికీ చాలామందికి ఆ సంగతే తెలియటం లేదు. సమస్య ఉన్నట్టు తెలిసినవారు కూడా ‘చాలా మైల్డ్‌గా ఉందిలే’ అని తోసేసేవారు ఎందరో. ఇది పెద్ద పొరపాటు. పైకి అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నా.. హైబీపీ తీవ్ర అనర్థాలను తెచ్చిపెడుతుంది. అందుకే దీన్ని ‘సైలెంట్‌ కిల్లర్‌’.. అంటే ‘కానరాని ముప్పు’ అనీ అంటారు. కాబట్టి తరచుగా బీపీ చూపించుకోవటం, ఒకవేళ హైబీపీ ఉంటే వైద్యుల సిఫార్సు మేరకు దాన్ని కచ్చితంగా అదుపులోనే ఉంచుకోవటం చాలా అవసరం.
అసలు రక్తపోటు అంటే..?
మనం ఏ సమస్యతో డాక్టరు దగ్గరికి వెళ్లినా రక్తపోటు (బీపీ) పరీక్ష చేస్తుంటారు. రక్తపోటుకు ఉన్న ప్రాధాన్యం అది! అసలు రక్తపోటు అంటే ఏమిటో చూద్దాం. మన గుండె బలంగా రక్తాన్ని పంప్‌ చేస్తూ.. శరీరంలోని ప్రతి కణానికీ రక్తం అందేలా చూస్తుంది. ఇలా గుండె బలంగా కొట్టుకుని.. రక్తనాళాల్లో రక్తం ప్రవహించేటప్పుడు రక్తనాళాల గోడల మీద పడే ఒత్తిడినే ‘రక్తపోటు’ అంటారు. సాధారణంగా బీపీ చూసిన తర్వాత డాక్టర్లు ‘120/80’.. ‘130/100’.. ఇలా రెండు సంఖ్యలు చెబుతుంటారు. వీటిల్లో పై సంఖ్య ‘సిస్టాలిక్‌ ప్రెషర్‌’కు.. కింది సంఖ్య ‘డయాస్టాలిక్‌ ప్రెషర్‌’కు గుర్తు. గుండె బలంగా కొట్టుకున్నప్పుడు రక్తనాళాల్లో తలెత్తే పీడనాన్ని ‘సిస్టాలిక్‌ ప్రెషర్‌’ అంటారు. గుండె ఒకసారి కొట్టుకున్న తర్వాత.. తిరిగి మళ్లీ కొట్టుకోవటానికి మధ్య కాలంలో రక్తనాళాల్లో ఉండే పీడనాన్నే ‘డయాస్టాలిక్‌ ప్రెషర్‌’ అంటారు. వీటిలో సిస్టాలిక్‌ పోటు పెరగటమన్నది చాలా కీలకం. ఇది పెరిగిన కొద్దీ వ్యాధుల ముప్పులూ పెరుగుతాయి. ఎవరికి వస్తుంది?
అధిక రక్తపోటు ఎవరికి వస్తుందో కచ్చితంగా చెప్పలేం. ఎవరికైనా, ఏ వయసులోనైనా రావచ్చు. ఇటీవలి కాలంలో ఉప్పు ఎక్కువగా తినటం, మద్యం అధికంగా తీసుకోవటం, శారీరక శ్రమ లేకపోవటం, అధిక బరువు, పొగ అలవాటు వంటి జీవనశైలి అంశాలు దీనికి దోహదం చేస్తున్నట్టు అధ్యయనాల్లో తేలింది. నిజానికి హైబీపీ రావటానికి 95% మందిలో ఎలాంటి కారణాలూ కనబడవు. కొద్దిమందిలో మాత్రం- మూత్రపిండాల వ్యాధులు, థైరాయిడ్‌ సమస్యల వంటి ఇతరత్రా కారణాల వల్ల రక్తపోటు పెరగొచ్చు. ప్రత్యేకించి ఇలాంటి వ్యాధుల వంటివేం లేకుండా హైబీపీ బారినపడే వారి సంఖ్యే ఎక్కువ. కాబట్టి అందరూ ఆర్నెల్లకోసారైనా బీపీ పరీక్ష చేయించుకోవటం తప్పనిసరి.
కీలక అవయవాలకు చేటు
బీపీ నియంత్రణలో లేకపోతే ఒంట్లో కీలక అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందుకే హైబీపీని ఏమాత్రం విస్మరించకూడదు. --హైబీవీతో కళ్లు, కాళ్లలోని రక్తనాళాలు దెబ్బతింటాయి. కంట్లో రెటీనా పొరలోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటే చూపు మందగిస్తుంది. ఇక కాళ్లల్లోని రక్తనాళాలు సన్నబడితే రక్త ప్రసరణ తగ్గుతుంది. దీంతో నడుస్తున్నప్పుడు కాలి కండరాలు నొప్పి పెడతాయి. కొద్ది దూరం నడకకే విశ్రాంతి తీసుకోవాల్సి రావొచ్చు. కొన్నిసార్లు నడక కూడా కష్టం కావొచ్చు.
--గుండెకు రక్త సరఫరా దెబ్బతింటే గుండెనొప్పి (యాంజైనా) రావొచ్చు. అలాగే గుండె బలహీనపడితే ఆయాసం, కాళ్లకు నీరు పట్టటం వంటివి కనబడొచ్చు.
--కిడ్నీలకు రక్త సరఫరా తగ్గిపోయి మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. ఇది దీర్ఘకాల కిడ్నీ వైఫల్యానికి దారితీయొచ్చు. దీంతో మూత్రం సరిగా తయారుకాదు. మూత్రంలోని మలినాలు రక్తంలోకి చేరి.. ఆయాసం, రక్తహీనత, కాళ్లవాపులు వేధిస్తాయి.
--మెదడులోని రక్తనాళాల్లో అవరోధాలు ఏర్పడటం, రక్తనాళాలు చిట్లటం సంభవించొచ్చు. ఇది పక్షవాతం, మాట పడిపోవటం, ఒకోసారి స్పృహ తప్పటం, ఫిట్స్‌ వంటి వాటికి దారితీయొచ్చు.
--అధిక రక్తపోటు వల్ల స్త్రీపురుషులు ఇరువురిలోనూ లైంగిక సామర్థ్యం సన్నగిల్లిపోవచ్చు. పురుషుల్లో స్తంభన సమస్యలు, స్త్రీలలో ఆసక్తి కొరవడటం వంటి సమస్యలు ఎదురవుతాయి. .............................తరువాత పేజీలో...............................