header

Bone Fracture

Dr.k.krishnaiah ఎముక విరిగింది.. అతుక్కోవాలంటే ఏం చెయ్యాలి?

నిజం చెప్పాలంటే మనమేం చెయ్యక్కర్లేదు.
విరిగిన ఎముకలు వాటంతట అవే అతుక్కుంటాయి. అతుక్కునే శక్తి ప్రకృతి సహజంగానే ఎముకలకు ఉంది. కాకపోతే మనం చెయ్యాల్సిందల్లా.. అవి అతుక్కునేలా దగ్గరగా చేర్చటం! అలా స్థిరంగా ఉంచటం!! వంకర టింకరగా, అడ్డదిడ్డంగా అతుక్కుపోకుండా.. సజావుగా, సరైన తీరులో అతుక్కునేలా చూడటం!!! అంతే!
కానీ ఇప్పటికీ మన సమాజంలో ఈ వాస్తవం చాలామందికి తెలియటం లేదు. అందుకే ఎముకలు విరిగినప్పుడు నానా రకాలుగా గందరగోళ పడుతున్నారు. ఎముకలు అతుక్కునేందుకంటూ మందుమాకులు, పసర్లు, నాటు వైద్యాల వంటివాటన్నింటినీ ఆశ్రయిస్తున్నారు. అపోహల్లో కూరుకుని, అనవసర సమస్యలనూ తెచ్చుకుంటున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో మన సమాజం- ఎముకలు విరిగినప్పుడు ఏం చెయ్యాలో తెలుసుకోవటం ఎంత అవసరమో.. ఏం చెయ్యకూడదో తెలుసుకోవటం కూడా అంతే అవసరం.
మన శరీరానికి బలమైన మూలాధార పంజరం.. ఎముకలే!
గట్టిగా, దృఢంగా ఉంటాయి కాబట్టి దెబ్బ తగిలినప్పుడు ఎముక చిట్లటం లేదా విరగటం సహజం. ఈ సమస్య మనిషిని అనాదిగా వేధిస్తున్నదే. వాస్తవానికి ఎముక కూడా సజీవ కణజాలమే. అయితే దీనిలో దట్టంగా పేరుకున్న క్యాల్షియం, అక్కడి ప్రోటీన్ల ప్రత్యేకమైన కలయిక మూలంగా ఎముక చాలా గట్టిగా, దృఢంగా ఉంటుంది. శరీరానికి సుస్థిర ఆకారాన్ని తెస్తుంది. చాలా బరువు కూడా మోస్తుంది. ఎంతో బలమైన ఒత్తిడికి గురైనప్పుడు మాత్రమే ఈ ఎముక విరుగుతుంది. ఎముక విరిగిందంటే దాని మీద బలమైన ఒత్తిడి పడినట్లే! ఎముకలు విరగటమన్నది మన సమాజం ఎదుర్కొంటున్న సర్వసాధారణమైన, అతిపెద్ద సమస్య. వాహనాలు, ప్రయాణాలు, వాటితో పాటే ప్రమాదాలు పెరుగుతున్న ఈ ఆధునిక కాలంలో ఈ సమస్యా పెరిగిపోతోంది.
విరుగుట: పలు రకాలు!
తగిలిన దెబ్బ, దాని తీవ్రతను బట్టి ఎముకలు రకరకాలుగా విరగొచ్చు. లోతుగా పరిశీలించి వైద్యశాస్త్రం వీటిని ఎన్నో రకాలుగా వర్గీకరిస్తోందిగానీ స్థూలంగా 4 రకాలను చెప్పుకోచ్చు.
- -చిట్లటం: తగిలిన దెబ్బకు ఎముక మీద ఒకవైపు కాస్త పగులు వచ్చి చిట్లొచ్చు. దీన్ని ‘హెయిర్‌లైన్‌ ఫ్రాక్చర్‌’ అంటారు. చిట్లినా కూడా ఎముక ఆకారం స్థిరంగానే ఉంటుంది కాబట్టి పైకేమీ తేడా కనిపించదు. ఎక్స్‌రే తీస్తే పగుళ్లు కనబడొచ్చు. గాయమైన భాగం కదలకుండా పట్టీవేసి, విశ్రాంతి ఇస్తే చాలు, ఇవి చాలావరకూ వాటంతటవే మానిపోతాయి.
- -విరగటం: ఎముక విరిగి.. ఎక్కడిదక్కడే ఉండిపోతే దీన్ని సింపుల్‌ ఫ్రాక్చర్‌ అంటారు. విరిగినవి కదలకుండా చూసుకోవటం ముఖ్యం. ఇందుకోసం పైన సిమెంటు పట్టీ వేస్తే సరిపోతుంది. దీంతో ఎముక కదలిక ఆగిపోతుంది, నొప్పి తగ్గుతుంది. నాలుగు వారాల్లో ఎముక అతుక్కుంటుంది. అయితే ఈ మధ్యలో తరచూ ఎక్స్‌రే తీస్తూ, ఒకవేళ ఎముక బెసిగిపోతోందేమో గమనిస్తుండటం ముఖ్యం.
- -విరిగి బెసగటం: ఎముక పూర్తిగా విరిగి, అటూ ఇటూ జరిగిపోతే ముందు దాన్ని సరైన స్థితికి తీసుకురావాలి. మత్తుమందు ఇచ్చి వాటిని సరిచేసి, కదలకుండా పట్టీ వెయ్యచ్చు. పైనుంచి సరిచేయలేని స్థితిలో ఆపరేషన్‌ చేసి లోపల రాడ్‌, ప్లేట్ల వంటివి అమరస్తారు. దీంతో ఎముక అతుక్కుంటుంది. లోపల ప్లేట్లు అమర్చే అవకాశం లేకపోతే పై నుంచే రాడ్స్‌ వేసి స్థిరపరుస్తారు.
- -ముక్కలవటం: ఎముక విరిగి ముక్కలు ముక్కలైతే.. వాటన్నింటినీ యథాస్థానానికి తెచ్చి జోడించాల్సిన అవసరం ఉండదు. కష్టపడి జోడించినా రక్తసరఫరాలో ఇబ్బందులొచ్చి సరిగా అతక్క పోవచ్చు. అందుకని ఇలాంటప్పుడు ఆ ముక్కల జోలికిపోకుండా- ప్లేట్‌ వేయటం ద్వారా ఎముక పైభాగాన్నీ, కింది భాగాన్నీ బలంగా స్థిరపరిచే ‘మినిమల్లీ ఇన్‌వేసివ్‌ ప్లేట్‌ ఆస్టియోసింథసిస్‌ (మిపో)’ విధానం ఉపకరిస్తుంది. ఈ సమయంలో ఎముక పొడవు, వంపు మాత్రం సరిగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటారు. దీంతో కొంతకాలానికి ఆ ముక్కల చుట్టూ కొత్త ఎముక ఏర్పడి అవన్నీ ముద్దలా దగ్గరకు అతుక్కుపోతాయి.
- -గాయంతో: ఎముక విరగటంతో పాటు పెద్ద పుండు, గాయం కూడా ఉన్నప్పుడు దానికి అత్యవసరంగా చికిత్స చెయ్యాలి. గాయం చూసి చాలామంది రక్తం కారిపోతోందని భయపడుతుంటారు. దానికంటే కూడా ముఖ్యం- ఆ ప్రాంతాన్ని శుభ్రం చెయ్యటం! ఎక్కడెక్కడో తగిలిన దెబ్బలు కాబట్టి వాటిలో గులకరాళ్లు, చెత్త, గడ్డి, బురద వంటివెన్నో ఉండిపోతాయి. వీలైనంత వరకూ 6 గంటల్లోపు శుభ్రం చెయ్యాలి. లేకపోతే ఇన్ఫెక్షన్లు వచ్చి, ఎముకలు అతుక్కోవు. పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత విరిగిన ఎముకలను స్థిరపరచాలి. గాయం మరీ పెద్దగా ఉన్నప్పుడు పైవైపునే.. అవసరమైతే కిందా పైనా రాడ్లు వేసి, దాన్ని ఫిక్స్‌ చెయ్యాల్సి ఉంటుంది. సర్జరీలు చేసేటప్పుడు మొదట్లోనే సరిగా చెయ్యకపోతే.. ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.
...............తరువాత పేజీలో ............