header

About Cancer….కేన్సర్ గురించి...

About Cancer….కేన్సర్ గురించి...
డా. శాంత ప్రతిష్టాత్మక నాయుడమ్మ పురస్కార విజేత.
అత్యాధునిక చికిత్సలు ఎన్నివున్నా ....ఆరోగ్యకరమైన జీవనవిధానంతోనే క్యాన్సర్‌ ముప్పు తప్పుతుంది.....
క్యాన్సర్‌ వ్యాధి ప్రాణాంతకం. ముఖ్యంగా రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లతో పెను ప్రమాదం అన్న భావనలు విస్తృతంగా వ్యాప్తి చెందాయి. కాని ప్రారంభ దశలో ఉన్నపుడే తగు చికిత్సా పద్ధతులను ఖచ్చితంగా అవలంభించడం వలన చాలామటుకు ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు చక్కటి అవగాహనతో స్వస్థత అసాధ్యమేం కాదు అంటున్నారు చెన్నై క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ శాంత. దేశంలోనే తొలి క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్ పేరెన్నిక గన్న ఈ సెంటర్ కు రోజూ వచ్చే రోగుల్లో మూడింట ఒక వంతు ఆధ్రప్రదేశ్‌కి చెందిన వారేనంటున్నారు.
తమిళనాట శాస్త్రవేత్తల కుటుంబంలో 1927లో శాంత జన్మించారు. ఇరవై రెండేళ్ళకు యం.బి.బి.యస్‌. ఎండి (గైనకాలజిస్ట్‌)లను పూర్తి చేసారు. 1955లో చెన్నై క్యాన్సర్‌ ఆస్పత్రిలో చేరారు. నాటి నుంచి నేటి వరకు బాధితులకు ఆరోగ్యభాగ్యం కలిగించడమే లక్ష్యంగా సేవలందిస్తున్నారు.
నిర్లక్ష్యం వీడితే: అన్ని ప్రాంతాలలోనూ క్యాన్సర్‌ ప్రభావం దాదాపు ఒకే రకంగా ఉంది. చాలా చోట్ల అవగాహనా రాహిత్యం, ఆరంభంలో వైద్యుల్ని సంప్రదించడంలో చేసే ఆలస్యం, సమస్య చిన్నదే కదా అన్న ధోరణి ప్రాణాపాయాన్ని అధికం చేస్తున్నాయి అంటున్నారు.
ముందు జాగ్రత్తలు ముఖ్యం : క్యాన్సర్‌ కేవలం పెద్ద వయసువారికే వస్తుందన్నది నిజం కాదంటరు శాంత. ఏ వయసు వారయినా ఈ సమస్య బారిన పడే అవకాశం ఉంది. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, పరిశుభ్రత పాటించకపోవటం, ధూమపానం చేస్తున్న వారికి సన్నిహితంగా ఉండి పొగను పీల్చడం, కొన్ని ప్రాంతాల్లో మహిళలూ పొగాకూ తీసుకోవడం.. వంటివన్నీ క్యాన్సర్‌ ముప్పును పెంచుతాయి. అయితే , వయసు పెరిగే కొద్దీ మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యకరమైన జీవన విధానం తప్పనిసరిగా పాటించాలి. ఫాస్ట్‌ఫుడ్స్‌, జంక్‌ఫుడ్‌లకు బదులుగా పోషకాహారం తీసుకోవడం అన్నివిధాలా మేలు అంటున్నారు.
అంతేకాదు, నేడు పాఠశాలల్లో క్రీడా మైదానాలు దాదాపు కనుమరుగయ్యాయి. ఇంటి నుంచి అతిస్వల్ప దూరం వెళ్లడానికిక్కూడా వాహనాన్ని ఆశ్రయిస్తున్నారు. దీంతో శరీరానికి సహజ సిద్ధమైన నడక, వ్యాయామం వంటివి నిత్య జీవితంలో తగ్గిపోతున్నాయి. అది ఎన్నిరకాల శారీరక సమస్యలకు గురిచేస్తుందో ఊహించలేకపోతున్నారు అంటూ ముందు జాగ్రత్త అవశ్వకతను విశదీకరించారు.
అవగాహనతో ఆరోగ్యమే.. రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కి సంబంధించి చాలామంది మహిళలకు అవగాహన లేదు సరికదా అపోహలు ఉన్నాయి. ఈ పరిస్థితులలో మార్పు రావాలి అన్నారామె. ఆలస్యంగా వివాహం చేసుకోవటం, పిల్లల్ని కనడం, వారికి తల్లిపాలు పట్టకపోవడం, ఎక్కువకాలం గర్భనిరోథక మాత్రలను వాడటం, పట్టణ ప్రాంతాల్లో అధికంగా జరుగుతోంది. ఇవి రొమ్బు క్యాన్సర్‌ వచ్చే అవకాశాలను పెంచుతాయి. కనీసం ఆరు నెలల పాటయినా పిల్లలకు పాలివ్వడం తల్లికి మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక పెద్ద సంఖ్యలో గ్రామీణ మహిళలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో సతమతమవుతున్నారు.
చాలామంది దాని బారిన పడ్డట్లు కూడా తెలుసుకోలేకపోతున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించక పోవడం ప్రధాన సమస్య. పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉండదు. నెలసరి సమయంలో శానిటరీ న్యాప్‌కిన్లు వాడాలి. మల, మూత్ర విసర్జన తరువాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ చిన్న చిన్న పద్ధతులు గర్భాశయ క్యాన్సర్‌కు కారణమయ్యే హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ నుంచి రక్షణను ఇస్తాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్న దీనిబారిన పడితే అది ప్రాణాంతకమనేనని చాలామంది ప్రాణాలపై ఆశలు వదులుకొంటారు. ఇది సరికాదు. ఆరంభదశలో దీనిని గుర్తించగలిగితే కోలుకోవడానికి చాలా అవకాశాలున్నాయి. అక్కడి దాకా ఎందుకు ఏడాదికొకసారి పాప్‌స్మియర్‌ పరీక్షను చేయుంచుకోవడం వల్ల దానిని ముందే గుర్తించవచ్చు.
1969లో మనదేశంలో క్యాన్సర్‌ నియంత్రణకు ఉద్యమించడంలోనూ ఆమెది కీలక భూమిక. పరిశోధనకోసం జీవితమంతా అంకితం చేసి, అవివాహితగా ఉండిపోయి, ఎందరికో ప్రాణదానం చేసిన ఆమె ఇప్పటికే పద్మశ్రీ, పద్మభూషణ్‌, రామన్‌ మెగసెసె అవార్డులను అందుకొన్నారు