header

Chemotheraphy / కీమోథెరపీ

Chemotheraphy / కీమోథెరపీ – Dr. Senthil Rajappa, Basava Tarakam Cancerl Hospital, Hyderabad….సౌజన్యంతో...
క్యాన్సర్ చికిత్సలో కీలకంగా నిలిచే కీమోథెరపీకి చాలా దుష్ప్రభావాలు తలెత్తుతాయి. ముందు జుట్టు రాలిపోతుంది. నోరు పూచిపోతుంది. గుక్క తిప్పుకోనివ్వని వాంతులు. డీలా చేసే విరేచనాలు.. ఇలా ఎన్నో ఎదురవ్వచ్చు. ఇవి అనివార్యమే అయినా.. వీటన్నింటినీ ఎదుర్కొనేందుకు నేటి అత్యాధునిక వైద్యరంగం ఎన్నో మార్గాలను కనుగొంది.
క్యాన్సర్ కణితిని తుదముట్టించేందుకు ప్రధానంగా మూడు చికిత్సా విధానాలున్నాయి. వీలైనంత వరకూ సర్జరీ చేసి ఆ కణితిని తొలగించెయ్యటం ఒక విధానం. రేడియేషన్ కిరణాలతో కణితిపై దాడి చేసి దాన్ని ఛిద్రం చెయ్యటం మరో విధానం. ఈ సర్జరీ, రేడియేషన్ థెరపీలే కాకుండా.. మందులతో క్యాన్సర్ కణితినీ.. ఒంట్లోని క్యాన్సర్ కణాలనూ తుదముట్టించి వాటిని మట్టుబెట్టటం మరో కీలక మార్గం. దీన్నే ‘కీమోథెరపీ’ అంటారు. ఈ కీమోథెరపీలో భాగంగా లోనికి ఇచ్చేవి మందులే అయినప్పటికీ ఇవి మహా శక్తిమంతమైనవి. అత్యంత ప్రభావవంతమైనవి. క్యాన్సర్ కణాలపై ఇవి పెద్దఎత్తున దాడి చేస్తాయి. అయితే ఈ క్రమంలో ఇవి కొన్నిసార్లు ఒంట్లోని ఆరోగ్యవంతమైన కణాలనూ దెబ్బతీస్తాయి. అందుకే కీమోథెరపీ తీసుకుంటున్న సమయంలో అనివార్యంగానే కొన్ని దుష్ప్రభావాలు తలెత్తుతాయి. ఇలా ఏయే రకాల దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉందో ముందే అవగాహన పెంచుకుంటే.. వాటిని అధిగమించటం చాలా తేలిక అవుతుంది.
ఎందుకిలా? అసలు క్యాన్సర్ కణాలను తుదముట్టించాల్సిన కీమోథెరపీ మందులు.. ఇలా సాధారణ, ఆరోగ్యవంతమైన కణాలనూ ఎందుకు దెబ్బతీస్తాయన్న అనుమానం సహజం. దీనికోసం క్యాన్సర్ కణాల స్వభావాన్ని కొద్దిగా అర్థం చేసుకోవటం అవసరం. సాధారణంగా మన శరీరంలోని కణాలన్నీ ఒక క్రమంలో విభజన చెందుతుంటాయి. కానీ కొన్ని కణాలు ఈ క్రమం తప్పి... విపరీతంగా విభజన చెందుతూ.. తామరతంపరగా తమ సంఖ్యను పెంచుకుంటూ.. అవే ఓ పెద్ద కణితిలా తయారవుతాయి. అవే క్యాన్సర్ కణాలు. క్యాన్సర్ చికిత్సలో భాగంగా మనం ఇచ్చే కీమోథెరపీ మందులు.. ప్రధానంగా ఇలా వేగంగా విభజన చెందే కణాలను పట్టుకుని వాటిని చంపేస్తుంటాయి. అందుకే మన శరీరంలో వేగంగా విభజన చెందుతుండే ఇతరత్రా కణాలు కూడా కొంత వరకూ ఈ మందుల ప్రభావానికి లోనై దెబ్బతింటాయి. దుష్ప్రభావాలకు ఇదే మూలం. ఉదాహరణకు మన వెంట్రుకల కుదురులోని కణాలు చాలా వేగంగా విభజన చెందుతుంటాయి. అందుకే కీమోథెరపీ ఆరంభించగానే ఈ కణాలు దెబ్బతిని.. జుట్టు రాలిపోతుంది! అలాగే ఎముక మజ్జలోనూ రక్తకణాలు వేగంగా విభజన చెందుతుంటాయి. కాబట్టి కీమోథెరపీ ప్రభావం దాని మీదా ఉంటుంది. ఇలా వేగంగా విభజన చెందని కణాలు, అవయవాలపై కీమోథెరపీ ప్రభావం పెద్దగా ఉండదు. అందుకే దుష్ప్రభావాలను ఈ కోణం నుంచి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
దుష్ప్రభావాలు
జుట్టు రాలిపోవటం
కీమోథెరపీ ఆరంభించగానే చాలా ఎక్కువగా కనిపించే దుష్ప్రభావం ఈ జుట్టు రాలిపోవటం. కుప్పలుకుప్పలుగా జుట్టురాలిపోతుంటే తీవ్ర మనస్తాపానికీ, ఆందోళనకు గురవుతుంటారు. కానీ వాస్తవానికి ఇదేమంత పెద్ద సమస్య కాదు. చికిత్స పూర్తవగానే జుట్టు మళ్లీ వచ్చేస్తుంది. పైగా ఇటీవలికాలంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక మందులతో ఈ జుట్టు రాలిపోవటమన్న ఇబ్బందీ ఉండదు.
తిమ్మిర్లు: కీమోథెరపీ మందులు శరీరంలోని నాడులను కూడా కొద్దిగా ప్రభావితం చేస్తాయి. దీనివల్ల చేతులు, కాళ్లలో తిమ్మిర్లు మొదలవుతాయి. ఇది మరీ అంత ఎక్కువగా వేధించేది కాదుగానీ వైద్యులతో చర్చిస్తే దీనికీ చికిత్స సూచిస్తారు.
వాంతులు: చాలా ఎక్కువగా ఇబ్బందిపెట్టేది వాంతులు. ఎప్పుడూ వికారంగా అనిపించటం. నోరు చేదు, ఆకలి తగ్గిపోవటం, తినబుద్ధి కాకపోవటం.. కొద్దిగా తిన్నా జీర్ణం కాక.. రోజంతా కడుపు నిండినట్లుండటం. వీటన్నింటినీ సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇప్పుడు మందులున్నాయి.
అరుదుగా: కీమోథెరపీ తీసుకునే క్యాన్సర్ బాధితుల్లో 2 శాతం మందికి గుండె కూడా దుష్ప్రభావానికి లోనవ్వచ్చు. కొందరిలో మూత్రపిండాలు, కాలేయం కూడా ప్రభావితం కావచ్చు. దుష్ప్రభావాలకూ చికిత్స ఉంది!
కీమోథెరపీ ఆరంభించగానే చాలామందిలో వికారం, వాంతులు మొదలవుతాయి. దీన్ని నివారించేందుకు అసలు కీమో మొదలుపెట్టక ముందే స్టిరాయిడ్స్ ఇస్తారు. దీనివల్ల వాంతుల సమస్య చాలా వరకూ తగ్గుతుంది. వాంతులు మరీ ఎక్కువ అయితే ఆసుపత్రిలో చేర్చి చికిత్స చెయ్యాల్సి ఉంటుంది. కీమోథెరపీ వల్ల జీర్ణ సమస్యలూ కొన్ని తలెత్తుతాయి. ముఖ్యంగా గ్యాస్ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. అందుకని గ్యాస్ చేరకుండా, చేరినా తేలికగా బయటకు వచ్చేయటానికి కొన్ని రకాల మందులుంటాయి. మలవిసర్జన సరిగా లేకుంటే కొన్ని రకాల సిరప్లు వాడాల్సి ఉంటుంది. ఇలా ప్రతీ దుష్ప్రభావానికీ కొన్నిరకాల మందులుంటాయి. అందుకని కీమోథెరపీ తర్వాత అవయవాలపై ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయన్నది తెలుసుకునేందుకు ముందుగానే కొన్ని పరీక్షలు చేయిస్తుంటారు. కీమోథెరపీ ఇచ్చే ముందు ప్రతిసారీ కొన్ని రక్తపరీక్షలు చేసి అప్పుడే నివారణ చర్యలు ఆరంభిస్తారు.
అవసరాన్నిబట్టి కీమోథెరపీ మోతాదులను కూడా హెచ్చుతగ్గులు చేస్తుంటారు. ఉదాహరణకు రోగికి కామెర్లు వస్తే దాన్ని తగ్గించటానికి ఒక క్రమపద్ధతిలో చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రక్తకణాల సంఖ్య తగ్గిపోతుంటే అలా తగ్గకుండా ఉండేందుకు బూస్టర్ ఇంజెక్షన్లు ఇస్తారు. అయితే ఈ మందులు నూరుశాతం ఫలితాన్నివ్వకపోవచ్చు. ఇవి కాకుండా మరికొన్ని సమస్యలు కూడా తలెత్తే అవకాశం లేకపోలేదు. అందుకని తరచూ పరీక్షలు చేసి చూస్తూ.. అప్పటికప్పుడు వైద్యం చేయాల్సి ఉంటుంది. మరో ముఖ్యమైన సమస్య- రోగనిరోధక శక్తి బలహీనపడటం. దీనివల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు మొదలవుతుంటాయి. తరచూ జ్వరం వస్తుంటుంది. మన ఒంట్లో ఉండే సూక్ష్మక్రిములే మనపై విజృంభించి కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంటాయి. అందుకే వైద్యులు తరచూ పరీక్షలు చేసి, రోగి పరిస్థితిని అంచనా వేస్తుంటారు.
రోగులు ఏం చెయ్యొచ్చు?
ఆహారం
ఈ దుష్ప్రభావాల నుంచి తేలికగా గట్టెక్కటానికి రోగులు తమకు తాముగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమం. ఆహారపరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. తక్కువ ఆహారం తినాలి. నోరు చేదు, కొద్దిగా తింటే కడుపు నిండినట్లు, కడుపులో తిప్పినట్లు ఉంటుంది కాబట్టి తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవాలి. మరీ వేడిగా.. మరీ చల్లగా ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. కారం మసాలాలు లేని పదార్ధాలు ఉత్తమం.
తరచూ ఇన్ఫెక్షన్ల బారినపడకుండా ఉండేందుకు తాజాగా వండిన, శుభ్రమైన వెచ్చటి ఆహారం తీసుకోవాలి. కొందరు చక్కెర, పాలు, మాంసాహారం తినకూడదని భావిస్తుంటారుగానీ ఇవన్నీ అపోహలే. నోటికి సయించేది ఏదైనా తినొచ్చు. కీమోథెరపీ కోసమంటూ ఆహారపుటలవాట్లను కొత్తగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. కొందరు క్యారెట్, బీట్రూట్ జ్యూసులు ఎక్కువగా తాగుతుంటారు. కానీ ఇదేమంత అవసరం లేదు. ఏం తీసుకున్నా అందులో క్యాలరీలు, ప్రోటీన్లు ఉంటున్నాయో లేదో చూసుకోవటం ముఖ్యం. కీమోథెరపీ వల్ల కొంత మంచి కణజాలం దెబ్బతింటుంది కాబట్టి అది కోలుకునేందుకు మంచి బలవర్ధకమైన ఆహారం తినాలి. అందుకే కీమోథెరపీ చేసే అన్ని ఆసుపత్రుల్లో డైటీషియన్లు ఉంటారు. వారి సలహా మేరకు ఆహారాన్ని ఎంచుకోవటం ఉత్తమం. మనం రోజూ తినే పూరీ, దోశ, పొంగల్ వంటి పదార్ధాలనే బలవర్ధకంగా ఎలా వండుకోవచ్చో వాళ్లు చెబుతారు. కొందరు కేవలం పండ్లు, గింజలు మాత్రమే తింటుంటారు. అలాగే రోగులను చూడటానికి వచ్చేవాళ్లు కూడా నారింజ, బత్తాయి, కొబ్బరినీళ్ల వంటివి తెస్తుంటారు. వాటివల్ల ప్రత్యేకించి ప్రయోజనం ఏదీ ఉండదు. పైగా రోగికి రక్తక్యాన్సర్ ఉంటే నారింజ పండ్లు, కొబ్బరినీళ్లు తాగితే అందులోని పొటాషియం రోగిలోకి చేరి.. అతని శరీరంలో పొటాషియం స్థాయిని పెంచుతుంది. అది మంచిదే కాదు. అందుకే ఏం చేసినా పద్ధతిగా, వైద్యులు లేదా డైటీషియన్ల సూచలన మేరకే తీసుకోవాలి.
అపోహ - వాస్తవం
వ్యాయామం చేయొచ్చా?
క్యాన్సర్ రోగులు ఎలాంటి శ్రమ లేకుండా పూర్తి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటారు. కానీ సాధ్యమైనంత వరకూ చురుకుగా ఉండటానికే ప్రయత్నించాలి. ఉదయాన్నే నడక, ఇంట్లో కూడా అటూఇటూ నడవటం, ప్రాణాయామం చేయడం, తమ పనులు తాము చేసుకోవటానికి ప్రాధాన్యం ఇవ్వాలి. దీనివల్ల శారీరకంగానూ, మానసికంగానూ బలపడతారు. బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లొచ్చా? క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నవాళ్లు జనం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదు. కొందరు మాస్క్ కట్టుకుని తిరుగుతూ ఉంటారు. అది కొంత మంచిదేగానీ మంచి నాణ్యమైన మాస్కులు ధరిస్తేనే ప్రయోజనం. దగ్గు, జలుబు ఉండేవారికి కాస్త దూరంగా ఉండాలి.
ఇది అంటువ్యాధా?
ఇంటికి ఎవరైనా వస్తే హాయిగా మాట్లాడొచ్చు. ఏమీకాదు. అంతేకానీ ఇన్ఫెక్షన్లు వస్తాయని ఇంట్లోనే మగ్గాల్సిన పని లేదు. ముఖ్యంగా- క్యాన్సర్ ఓ అంటువ్యాధిలాంటిదనే అపోహ కొందరిలో ఉంటుంది. కానీ క్యాన్సర్ అస్సలు అంటువ్యాధి కానేకాదని అంతా గుర్తించాలి!
పొయ్యి దగ్గరకు వెళ్లొచ్చా?
చాలామంది క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న మహిళలు పొయ్యి దగ్గరకు వెళ్లకూడదు, వేడివల్ల ఇబ్బంది అని చెబుతుంటారుగానీ ఇవన్నీ వాస్తవాలు కావు. సౌకర్యవంతంగా ఉంటే తమ పనులు, ఇంటి పనుల్లో నిమగ్నం కావటం ఉత్తమం.
దిగులు పడొద్దు..
కొందరు రోగులు డిప్రెషన్లోకి వెళ్లిపోయి ఏడుస్తారు, కోప్పడతారు. ఇక జీవితంలో ఏమి చేయలేమని భోరుమంటారు. నిజానికి దీనికి కారణం వ్యాధి కాదు.. సమాజంలో వినిపించే మాటలు, వ్యాధి గురించి సరైన అవగాహన లేకపోవటం. రోగిలో అవగాహన పెంచి, ఆశావాహదృక్పథం నెలకొనేలా, ధైర్యం చెప్పటం అవసరం. అందుకే క్యాన్సర్ చికిత్సా సమయంలో... రోగీ, వైద్యుల మధ్య బంధం గట్టిగా ఉండాలి. సమస్యలేవైనా తలెత్తుతుంటే వెంటనే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి.