header

Kneel Replacement

డాక్టర్ రమేష్ చంద్ర కాట్రగడ్డ, ఆర్ధోపెడిక్ సర్జన్, జాయ్ హాస్పటల్, సోమాజీగూడ, హైదరాబాద్ వారి సౌజన్యంతో.......
మోకీలు.. మన ఒంట్లో అతి సంక్లిష్టమైన కీలు. అన్ని కీళ్ల కన్నా పెద్దది, బలమైంది కూడా. అటు తుంటి ఎముకకూ ఇటు కింది కాలు ఎముకకూ మధ్య ఇరుసులా పనిచేస్తూ.. తేలికగా కదలటానికి తోడ్పడుతుంటుంది. మనం నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు, పరుగెత్తుతున్నప్పుడు శరీర బరువును మోస్తూ, ఒత్తిడిని భరిస్తూ కూడా అతి సున్నితంగా కదలటం దీని ప్రత్యేకత. మనం హాయిగా నడవగలుగుతున్నామంటే, మోకాళ్లు ముడుచుకొని కూచుంటున్నామంటే, అలవోకగా పక్కలకు తిరుగుతున్నామంటే అంతా మోకీలు చలవే. చూడటానికి ఒకటేనని అనిపించినా..
ఇది పలు ఎముకలు, కండరాలు, మృదులాస్థి, కండర బంధనాలు, అనుసంధాన కణజాలాల సమాహారం. ఇవన్నీ కలిసికట్టుగా, చక్కటి సమన్వయంతో పనిచేస్తూ మన అవసరాలకు అనుగుణంగా ఎన్నెన్నో కదలికలకు తోడ్పడతాయి. అందుకే మోకీలులో ఏ చిన్న సమస్య తలెత్తినా జీవితం కుంటుపడినట్టే అనిపిస్తుంది. ముఖ్యంగా కీళ్లవాపులు (ఆర్థ్రయిటిస్) మొదలైతే ఆ బాధ వర్ణనాతీతం. సమస్య తీవ్రమైతే అడుగు తీసి అడుగు వేయటమే గగనమైపోతుంది. మన సమాజంలో చాలామంది వృద్ధులు దీంతో బాధపడుతున్నవారే. తీవ్రమైన నొప్పుల మూలంగా- కూచుంటే లేవలేక, లేస్తే కూచోలేక.. ఎక్కడికీ వెళ్లలేక, నలుగురితో కలవలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. దీనంతటికీ కారణం వయసు మీద పడుతున్న కొద్దీ మోకీళ్లు అరిగిపోవటమే.
ఏమిటీ సమస్య?
ఎందుకో తెలియదు గానీ.. గత 20 ఏళ్లుగా మోకీళ్ల అరుగుదల, వాపు సమస్య రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది. మనదేశంలో సుమారు 30% మంది దీని బారినపడి నలిగిపోతున్నారని అంచనా. కీళ్లు అరగటం వల్ల తలెత్తే మొదటి ఇబ్బంది నొప్పి. ముఖ్యంగా ఏదైనా పనిచేసినప్పుడు లేదా ఎక్కువసేపు కదలకుండా ఉన్నప్పుడు నొప్పి మరింత వేధిస్తుంటుంది. కీళ్లు బిగుసుకుపోవటం, వాపు, కదలికలు తగ్గటం వంటి లక్షణాలూ ఉండొచ్చు. ఇంతకీ ఇది ఎందుకొస్తుంది? మన మోకీలు ఎముకల చివర్లలో మృదులాస్థి (కార్టిలేజ్) అనే సున్నితమైన ఎముక ఉంటుంది. ఇది ఎముకలు ఒకదానికి మరోటి రుద్దుకోకుండా, అవి మృదువుగా కదలటానికి తోడ్పడుతుంటుంది. అలాగే ఎముకల మధ్య ‘మినిస్కస్’ అనే దళసరి ‘వాషర్’ లాంటి పొర కూడా ఉంటుంది.
మృదులాస్థి, మినిస్కస్ పొరలు మన శరీర బరువును, కదలికల ఒత్తిడిని ఎప్పటికప్పుడు గ్రహిస్తూ.. కదలికలు సాఫీగా సాగేలా చూస్తాయి. అయితే వయసు మీద పడుతున్నకొద్దీ జట్టు తెల్లబడటం వంటి మార్పుల మాదిరిగానే మృదులాస్థి క్షీణించటమూ మొదలవుతుంది. క్రమేమీ వాషర్ కూడా దెబ్బతింటుంది. దీంతో మోకీలు కదిలినపుడు ఎముకలు రెండూ ఒకదాంతో మరోటి రుద్దుకొని విపరీతమైన నొప్పికి దారితీస్తుంది. ఇదే ఆర్థ్రయిటిస్కు మూలం. ఒకసారి ఈ మృదులాస్థి క్షీణిస్తే తిరిగి సరిచేయటం దాదాపు అసాధ్యం. అందుకే దీనికి శాశ్వత పరిష్కారం చూపించే మోకీలు మార్పిడికి ప్రాధాన్యం పెరుగుతోంది.
తరువాత పేజీలో.......