header

Migraine …..పార్శ్వనొప్పి

Migraine …..పార్శ్వనొప్పి

ఒకవైపే తలనొప్పి... బాధకు తల చాలా భారంగా అనిపిస్తుంది. తలలో లోలోపల సమ్మెటపోటు, మనసు దేనిమీదా లగ్నం కాదు. ఏ పనీ చేయబుద్ధికాదు. తలలో ఆ నరకాన్ని అనుభవించడం కష్టం.ఈ నొప్పి వచ్చిందంటే ఎన్ని గంటలు ఉంటుందో తెలియదు. ఎలా పోతుందో అంతుపట్టదు.
తలనొప్పి... కావడానికి తలలో నొప్పే కానీ దీనిలో దాదాపు 300 రకాలున్నాయి. వీటిల్లో పార్శ్వనొప్పి... మైగ్రేన్‌ ఒక ముఖ్యమైన రకం. ఈ పార్శ్వనొప్పి మహిళల్లో ఎక్కువ. అదీ 15-40 మధ్య వయస్సు వారిలో ఎక్కువ. తీవ్రమైన సమస్యేం కాదు. సరైన చికిత్స, జాగ్రత్తలతో దీన్ని చక్కగ నియంత్రణలో అదుపు చేయవచ్చు.
ఒకవైపే బాధ...
మైగ్రేన్‌ ముఖ్య లక్షణం... తలలో ఒకవైపు మాత్రమే నొప్పి. అందుకే దీన్ని పార్శ్వనొప్పి అంటారు. అయితే చాలామంది పార్శ్వనొప్పి అంటే ఎప్పుడూ తలలో ఏదో ఒకవైపే వస్తుందని భావిస్తుంటారుగానీ ఈ నొప్పి ఎటువైపైనా రావొచ్చు. కొన్ని సార్లు ఎడమవైపు వస్తే... కొన్నిసార్లు కుడివైపు రావొచ్చు. తలలో నొప్పి అటూ ఇటూ మారుతుండొచ్చు. నొప్పి తలలో ఎప్పుడూ ఒకవైపే వస్తోందంటే అందుకు ఇతరత్రా సమస్యలేమైనా కారణమవుతున్నాయా? అన్నది చూడాల్సి ఉంటుంది. పార్శ్వనొప్పి... సాధారణంగా తలలో ఒకవైపు వచ్చేదే అయినా అరుదుగా కొన్నిసార్లు రెండోవైపు కూడా వస్తుంటుంది.
పార్శ్వనొప్పి వచ్చిందంటే చాలావరకూ కొన్ని గంటలు మాత్రమే వేదిస్తుంది. కొందరిలో కొన్ని గంటల నుంచి రోజుల తరబడి వేధించవచ్చు. ఇది ఎంత తరచుగా వస్తోందన్న దాన్ని బట్టి దీని తీవ్రత అర్థం చేసుకోవచ్చు. కొందరికి 2, 3 నెలలకు ఓసారి మాత్రమే ఈ నొప్పి వస్తుంది. ఇలాంటి వారు నొప్పి తగ్గే మాత్రలు వేసుకుంటే అప్పికది తగ్గుతుంది. మళ్ళీ 2-3 నెలల వరకూ దానితో ఇబ్బంది ఉండదు. అయితే వచ్చినప్పుడు మాత్రం నొప్పి చాలా తీవ్రంగా ఉండి, వాంతుల వంటివి వేధించడం బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది. పైగా ఈ పార్శ్వనొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళలేకపోవటం, వెలుతురు చూడలేకపోవడం (ఫోఫోబియా), శబ్దాలంటే చిరాకు (ఫోనోఫోబియా), కొందరికి వాసనలు పడకపోవడం (అస్మోఫోబియా) వంటి లక్షణాలూ కనిపిస్తాయి. వీటీ మూలంగా రోజువారీ పనులపై తీవ్ర ప్రభావం పడుతుంది.
తలనొప్పి, వాంతుల వంటివి తీవ్రంగా ఉంటే ఎవరైనా నిర్లక్ష్యం చేయకూడదు. చాలాసార్లు వాంతికాగానే తలనొప్పి తగ్గిపోతుంది. కొందరికి నిద్రపోయినా కూడా తగ్గిపోతుంది. కొందరికి మాత్రం ఈ పార్శ్వనొప్పి నిద్రలోనే మొదలవుతుంది. పార్శ్వనొప్పి భరించలేనంతగా ఉన్నప్పుడు దాన్ని తగ్గించడానికి తప్పకుండా మందులు వాడాల్సిఉంటుంది. మందులతో మైగ్రేన్‌ తరచుగా దాడిచెయ్యకుండా నివారించుకోవడానికి, క్రమేపీ బయటపడడానికి అవకాశం ఉంది.
15-50 ఏళ్ళ మధ్య స్త్రీలలో సుమారు 15 శాతం మంది మైగ్రేన్‌తో బాధపడుతున్నారని అంచనా. ఈ పార్శ్వనొప్పికి జన్యుపరమైన అంశాలు కారణం కావచ్చ. అందుకే ఇది ఒకే కుటుంబంలో ఎక్కువమందిలో కనిపిస్తుంటుంది. చాలా వరకు 15, 20, 30 ఏళ్ళ వయసులోనే మొదటి సారి బయటపడుతుంది. అరుదుగా 40ఏళ్ళకూ మొదలవ్వవచ్చు. అప్పటికే పార్శ్వనొప్పితో బాధపడుతున్న వారికి 45 ఏళ్ళ తర్వాతా రావొచ్చుగానీ ఆ వయసులో తొలిసారి మొదలవ్వడం మాత్రం చాలా అరుదు.
స్త్రీలల్లో ముట్లుడిగిపోయే దశలో కొందరికి పార్శ్వనొప్పి తీవ్రత పెరిగి ఆ తర్వాత పూర్తిగా పోయే అవకాశం కూడా ఉంది.
పార్శ్వనొప్పిని ప్రైమరీ రకం తలనొప్పి అంటారు. అంటే ఎమ్మారై స్కానింగ్‌ల వింటి పరీక్షలు ఎన్ని చేసినా వాటిలో మెదడు నిర్మాణాల్లో ఎటువంటి తేడాలు కనబడవు. అందుకే మొదదటిసారి తలనొప్పి వచ్చినపుడు అది పార్శ్వనొప్పేనా? కాదా? అన్నది తెలుసుకోవడం చాలా కష్టం. దీని నిర్ధారణకు పరీక్షలకంటే రోగి చెప్పే బాధలే కీలకం. తలలో ఒకవైపు పోటు పొడుస్తున్నట్టుగా నొప్పి, వాంతులతోపాటు వెలుతురు, చప్పుళ్ళు, వాసనలు పడకపోవడం, వంటి లక్షణాలుంటే పార్శ్వనొప్పిగా అనుమానించవచ్చు. అంతర్జాతీయ హెడేక్‌ సొసైటీ మార్గదర్శకాల ప్రకారం ఈ తరహా లక్షణాలతో తలనొప్పి ఐదుసార్లు వస్తే దాన్ని ఖచ్చితంగా పార్శ్వనొప్పిగా నిర్ధారించుకోవచ్చు. అయితే కొందరికి ఈ నొప్పి ఒకసారి వస్తే మళ్ళీ కొన్నేళ్ళ వరకూ రాకపోవచ్చు. మరికొందరికి చాలా తరచుగా రోజూ లేదా రోజు విడిచి రోజు కూడా రావొచ్చు. కొన్నిసార్లు విడవకుండా రెండు మూడ్రోజుల పాటూ కొనసాగుతూ క్రానిక్‌ మైగ్రేన్‌గా మారొచ్చు.
కళ్ళముందు కాంతి.... తలలో నొప్పి....
పార్శ్వనొప్పిలో ప్రధానంగా రెండురకాలున్నాయి. ఒకటి కళ్ళ ముందు రకరకాల కాంతులు, మెరుపులు కనిపిస్తూ ఆ తర్వాత నొప్పి మొదలయ్యే రకం. దీన్నే 'మైగ్రేన్‌ విత్‌ ఆరా' (క్లాసిక్‌) అంటారు. ఇలాంటివేమీ లేకుండా నేరుగా నొప్పి మొదలయ్యేది మరో రకం. దీన్ని 'వితౌట్ ఆరా' (కామన్‌) అంటారు. వివరంగా చూద్దాం...
క్లాసిక్‌ మైగ్రేన్‌ : వీరిలో పార్శ్వనొప్పి మొదలవడానికి ముందు ఒకవైపు చూపు సరిగా కనబడక, మసక మసకగా అనిపించ వచ్చు. కళ్ళ ముందర ఏవో కాంతులు, వెలుగులు వస్తూ పోతూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలను ఆరా అంటారు. సాధారణంగా ఈ ఆరా ఎడమవైపు కనిపిస్తే తలనొప్పి కుడివైపున వస్తుంటుంది. కుడివైపున కనిపిస్తే తలనొప్పి ఎడమవైపున వస్తుంది.
కామన్‌ మైగ్రేన్‌ : ఇందులో ఆరా లక్షణాలు ఏవీ లేకుండా తీవ్రమైన పార్శ్వనొప్పి మొదలవుతుంది.
అయితే కొందరికి కేవలం ఆరా లక్షణాలు కనిపించి... తలనొప్పి రాకుండా ఆగిపోవచ్చు.
కొందరికి కళ్ళముందు కాంతులు(ఆరా) లేకపోయినా... కేవలం ఉత్సాహంగా అనిపించకపోవడం, స్తబ్దుగా ఉండడం వంటి లక్షణాలతో పార్శ్వనొప్పి మొదలవుతుంది. (ప్రోడ్రోమల్‌సిండ్రోమ్‌) ఈ నిరుత్సాహాన్ని బట్టి మైగ్రేన్‌ వస్తున్నట్లు ముందే తెలిసిపోతుంది .
మెదడులో చికాకు.. నొప్పికి ప్రేరణ...
చాలామందికి పెద్దపెద్ద శబ్దాలు, ఎండలోకి వెళ్ళటం, వెలుగుతూ ఆరుతూ ఉండే దీపాలు... ఇలాంటివన్నీ పార్శ్వనొప్పిని ప్రేరేపిస్తుంటాయి. కొందరికి కొన్ని రకాల సెంట్లు కూడా పార్శ్వనొప్పిని తెచ్చిపెడతాయి. మన మెదడులోని థాలమస్‌ సున్నితమైన నాడుల కూడలి. చూపు, వినికిడి, వాసన, స్పర్శ ఇలా చాలారకాల భావనలకు ఇది కీలకకేంద్రం. ఈ థాలమస్‌లోని కణాలు తీవ్ర చికాకుకు గురైతే పార్శ్వనొప్పికి దారితీయొచ్చు. ఈ నాడులు ప్రేరేపితమైనప్పుడు ఆ ప్రేరణలు, నాడీ చివర్లను చేరి రక్తనాళాలనూ ప్రేరేపిస్తాయి. దాంతో రక్తనాళాలు వెంటనే సంకోచిస్తాయి. అప్పుడు రక్తసరఫరా తగ్గి కళ్ళ ముందు కాంతులు (ఆరా) వస్తాయి.
అనంతరం రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. అప్పుడు రక్తసరఫరా పెరిగిపోయి... తలలో మోదుతున్నట్లుగా తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఇది బ్రెయిన్‌స్టెమ్‌ లోని ఇతర కేంద్రాలనూ ప్రేరేపిస్తుంది. అందువల్ల పార్శ్వనొప్పి వచ్చినపుడు వెలుతురు, శబ్దాలు భరించలేక చికాకు పడడం, తలకి గుడ్డ కట్టుకొని చీకటి గదిలోకి వెళ్ళిపోయి పడుకోవడం, వాంతి చేసుకోవడం వంటివి చేస్తుంటారు.
కాంతులు, సెంటులు వంటివే కాదు.. ఇలా పార్శ్వనొప్పిని ప్రేరేపించే అంశాలు చాలానే ఉంటాయి. కొందరికి ఐస్‌క్రీమ్‌ తింటే రావొచ్చు. మరికొందరికి కాఫీ తాగినా, చాక్ల్‌ట్, చీజ్‌ తిన్నా మైగ్రేన్‌ ఎక్కువవ్వొచ్చు. ఇది వ్యక్తులను బట్టి మారుతుంటుంది. ఇలా పార్శ్వనొప్పిని ప్రేరేపిస్తున్నవేమిటో గుర్తించి వాటికి దూరంగా ఉండడం ఉత్తమం. కొన్నిసార్లు మానసిక ఒత్తిడి, విశ్రాంతి కూడా పార్శ్వనొప్పికి కారణాలవుతాయి. అందుకే కొందరు వారాంతంలో పార్శ్వనొప్పితో బాధపడుతుంటారు. మరికొందరికి సెలవు రోజు తర్వాత పనికి వెళ్ళబోయే ముందు మొదలవుతుంటుంది. పార్శ్వనొప్పిని గుర్తించడానికి ఇవన్నీ కూడా కీలకమైన ఆధారాలే అవుతాయి. దీంతోపాటు మిగతా సమస్యలేమైనా ఉన్నాయేమోనని అనుమానం వచ్చినపుడు మాత్రం పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.
చాలామందికి వాంతికాగానే పార్శ్వనొప్పి తగ్గిపోతుంది. కొందరికి తగ్గకపోవచ్చు. ఇది సాధారణంగా కొన్ని గంటలకు మాత్రమే పరిమితమైన తలనొప్పి. అయితే కొందరికి 24గంటలూ విడవకుండా కొనసాగుతుండ వచ్చు. దీన్ని స్టేటస్‌ మైగ్రోనేసస్‌ అంటారు. ఇలాంటి నొప్పికి చికిత్స కూడా భిన్నంగానే ఉంటుంది.
పార్శ్వనొప్పిలక్షణాలు మొదలవుతున్నపుడే ఎర్గ్ టా ఆల్కలాయిడ్‌ మందులతో ఎంతో ప్రయోజనం కలుగుతుంది. మన దేశంలో వీటిని ఎక్కువగా మాత్రల రూపంలో వాడుతున్నారు. విదేశాల్లో ఎక్కువగా ఇంజెక్షన్లు ఇస్తున్నారు. వీటితో వెంటనే ఉపశమనం లభిస్తుంది.
ప్రస్తుతం తీవ్రమైన తలనొప్పిని తగ్గించానికి టిప్టాన్‌ మందులు అందుబాటులోకి వచ్చాయి. మైగ్రేన్‌లో నాడీకణాలు ప్రేరేపితమైనపుడు కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. వాటిల్లో సెరోనిన్‌ టిప్టాన్లు, ఇవి సెరోనిన్‌ను అడ్డుకొని తలనొప్పి తగ్గేలా చేస్తాయి. ఇవి మాత్రలతోపాటు ఇంజెక్షన్లు, ముక్కులోకి స్ప్రే రూపంలోనూ లభిస్తాయి. ఈ స్ప్రేలు వేగంగా పనిచేస్తాయి. మాత్రల్లో నాలుక కింద పెట్టుకునే రకాలూ ఉన్నాయి. కాకపోతే ఈ టిప్టాన్ల ధర ఎక్కువ. ప్రతీసారి వీటిని తీసుకోవడం ఖర్చుతో కూడుకున్న పని.
నాప్రాక్సిన్‌ వంటి చవకైన మందులూ బాగా పనిచేస్తాయి. వాంతి, వికారాలను తగ్గించే మందులతో కలిపి కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి చాలా రకాల మందులు హఠాత్తుగా వచ్చే నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడతాయి.
పార్శ్వనొప్పి చాలా త్వరత్వరగా భరించలేని స్థాయిలో దాడిచేస్తుంటే వరుసగా దీర్ఘకాలం తలనొప్పి వచ్చినా రాకపోయినా రోజూ మందులు వేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పార్శ్వనొప్పి తరచుదనం తగ్గిపోతుంది. వీటితోపాటు బీబ్లాకర్స్‌, కాల్షియంచానెల్‌ బ్లాకర్స్‌ కొన్నిరకాల మూర్ఛకు వాడే మందులు కూడా మైగ్రేన్‌ రాకుండా నివారిస్తాయి. వీటితో కొన్ని దుష్ప్రభావాలు కూడా లేకపోలేదు. కాబట్టి వీటిని దీర్ఘకాలం వాడేటప్పుడు ఎవరికి ఏవి అవసరమన్నది జాగ్రత్తగా ఇస్తారు. సాధారణంగా 3-9 నెలల పాటు మందులు వాడితే ఈ పార్శ్వనొప్పి తీవ్రత, ఆ తరచుదనం తగ్గిపోతాయి. తర్వాత మందులను కూడా ఆపేయవచ్చు. అయితే కొందరికి ఎక్కువకాలం మందులు వాడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది.
తలనొప్పి చాలా తీవ్రంగా వచ్చినపుడు కొన్ని ఇంజెక్షన్లు కూడా ఇస్తారు. కొందరి విషయంలో స్టిరాయిడ్స్‌ బాగా ఉపయోగపడతాయి. మైగ్రేన్‌ హఠాత్తుగా దాడిచేసినప్పుడు తలనొప్పి తగ్గడానికి ఎర్గ్ టా ఆల్కలాయిడ్‌ మందులు బాగా ఉపయోగపడతాయి. కానీ వీటిని దీర్ఘకాలం వాడితే అధిక రక్తపోటు, గుండెసమస్యల వంటి దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ మందులను వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి.
సాధారణ రకం పార్శ్వనొప్పులకు చికిత్స తేలికే కానీ, దీర్ఘకాలం విడవకుండా వేధిస్తుండే రకాలకు చికిత్స కొంచెం క్లిష్టంగా మారుతుంది. అయితే వీటికి ఇప్పుడు యాంటి డిప్రెసెంట్లు, తలపైన కండరాలకు బొటాక్స్‌ ఇంజెక్షన్లు ఇవ్వడం, మరీ అవసరమైతే మెదడులో ప్రేరేపణలు ఇచ్చేందుకు పేస్‌మేకర్ల వంటి అమర్చే విధానాలూ అందుబాటులోకి వస్తున్నాయి.
సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ పార్శ్వనొప్పి తగ్గిపోతుంది. నొప్పి వచ్చినపుడు మాత్రలు వేసుకుంటూ క్రమంగా దీన్ని ఎలా నివారించుకోవాలో అర్థం చేసుకుంటే దీన్ని జయించడం సులభం.
పార్శ్వనొప్పి వచ్చినప్పుడు నొప్పి భరించరానిదిగా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు. వీరికి వ్యాధిపట్ల అవగాహన పెంచడం... వ్యాధి తీరుతెన్నుల గురించి వివరంగా తెలియజేయడం వల్ల సాధారణ మందులతో కూడా అద్భుత ఫలితాలు ఉంటాయని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) వంటి సంస్థల అధ్యయనాలలో స్పష్టంగా వెల్లడైంది. కాబట్టి సమస్య పట్ల అవగాహన పెంచుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.