header

Spine TB…వెన్నుముకకు క్షయవ్యాధి

Spinal TB…..వెన్నుకు టిబి
వెన్నుకు టిబి. : డా. సంజయ్‌ మాథుర్‌, స్పైన్‌ సర్జన్‌ యశోదా హాస్పటల్స్‌, హైదరాబాద్‌
వెన్నుకు టి.బి. సోకిందని తెలియగానే చాలా మంది ఇక తమ పనైపోయినట్లేనని ఆందోళన చెందుతుంటారు. జీవితంలో ఇక నడవలేమని, మంచానికే పరిమితం కావాల్సి వస్తుందని భయపడుతుంటారు. ఆపరేషన్‌ చేయించుకున్నా ఫలితం ఉండదనే భయం కూడా వారిలో ఉంటుంది. అయితే అది నిజం కాదని, స్పైన్‌ టి.బి.కి ప్రస్తుతం మంచి చికిత్స అందుబాటులో ఉందని అంటున్నారు.... డా. సంజయ్‌ మాథుర్‌.
లక్షణాలు : స్పైన్‌ టి.బిలో కనిపించే ప్రధాన లక్షణం బ్యాక్‌ పెయిన్‌. దీంతో పాటు చీము నరంపైన ఒత్తిడి కలగచేస్తున్నపుడు కాళ్లు లాగడం మొదలవుతుంది. రాత్రివేళ నొప్పి ఎక్కువగా ఉంటుంది. జ్వరం, బరువు తగ్గడం, ఆకలి తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. వీటితో పాటు తీవ్రమైన నడుం నొప్పి ఉంటుంది. నడకలో తేదా వస్తుంది. నొప్పి నడుం దగ్గర మొదలై క్రమంగా శరీరమంతా విస్తరిస్తుంది.
గుర్తించేదెలా : శరీరంలో టి.బి. బాక్టీరియా ఉన్నదీ లేనిదీ తెలుసుకోవడానికి ఇమ్యునోగ్లోబిలిన్‌ పరీక్ష బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ బాక్టీరియా ఉన్నట్లయితే ఎక్కడ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నది తెలుసుకోవడానికి ఇతర పరీక్షలు చేయించుకోవాలి. వెన్ను టిబిని గుర్తించడానికి ఎక్స్‌రే, ఎమ్‌ఆర్‌ఐ పరీక్షలు బాగా ఉపయోగపడతాయి. టి.బి. సోకిన ప్రాంతం నుంచి సిటిస్కాన్‌ ద్వారా ముక్కను తీసి బయాప్సీ చేయడం ద్వారా కూడా నిర్థారించుకోవచ్చు.
చికిత్స: స్పైన్‌ టి.బిని ప్రాథమిక దశలో గుర్తిస్తే సర్జరీ చేయాల్సిన అవసరం ఉండదు. మందులు వాడితే సరిపోతుంది. లంగ్స్‌ టి.బి. మాదిరిగానే స్పైన్‌ టిబి.ని మందులతో తగ్గించవచ్చు.మందుల ద్వారా తగ్గనపుడు, చికిత్సకు స్పందించనపుడు మాత్రమే సర్జరీ అవసరమవుతుంది. అందుకే సరియైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రాథమిక దశలో గుర్తించకుండా సమస్య ముదిరిన తరువాత ఆసుపత్రికి వెళితే సర్జరీ తప్పక చేయాల్సి ఉంటుంది.
వెన్ను ఆపరేషన్‌ చేయించుకుంటే కాళ్ళు పడిపోతాయని, మంచానికి పరిమితం కావాల్సి వస్తుందని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. ఆపరేషన్‌ చేసినా ఫలితం ఉండదనే అపోహ చాలా మందిలో ఉంటుంది. కాని, అది నిజం కాదు. ప్రస్తుతం వెన్నుకు సంబంధించి ఆధునాతన చికిత్సలు అందుబాటులో వచ్చాయి. మినిమల్‌ ఇన్‌వాసివ్‌ సర్జరీ, లాప్రాస్కోపిక్‌ సర్జరీలతో రోగి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఆపరేషన్‌ చేసిన తరువాత రెండవ రోజునుంచి నడవడం ప్రారంభించవచ్చు.
బాగా నీరసం ఉన్నవారు వారం రోజుల్లో నడవటం మొదలు పెట్టవచ్చు. అయితే ఆపరేషన్‌ను నిపుణులైన వైద్యుల చేత చేయించుకోవటం చాలా అవసరం. వ్యాధిని సరిగ్గా గుర్తించి చికిత్స అందించినట్లయితే సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
మల్టీ డ్రగ్‌ రెసిస్టెన్స్‌ : లంగ్స్‌ టి.బి. మాదిరిగానే స్పైన్‌ టి.బికి క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. మందులు మధ్యలో మానేస్తే డ్రగ్‌ రెసిస్టెన్స్‌ వచ్చి మందులు పనిచేయకుండా పోయే అవకాశం ఉంటుంది. అప్పుడు చికిత్స మరింత కష్టమవుతుంది. మందులు మార్చి వాడాలి వస్తుంది. ఎక్కువ కాలం వాడాల్సి వస్తుంది. కాబ్టి వెన్ను టి.బి. ఉందని తెలిసిన తరువాత మందులు వాడటం మొదలు పెట్టినట్లయితే పూర్తి కోర్సు తీసుకోవాలి. చాలా మంది నాకు ఎటువంటి దురలవాట్లు లేవు. ఏ కారణం వల్ల ఈ వ్యాధి వచ్చిందో అర్థం కావటం లేదు. ఛాతీ క్షయ పూర్తిగా తగ్గుతుందని తెలుసుకానీ వెన్నుకు టిబి. సోకితే పూర్తిగా తగ్గుతుందో లేదోనని భయంగా ఉంది. నేను మళ్ళీ మాములు మనిషిని కాగలనా? అని చాలా మంది అడుగుతుంటారు.
అయితే అటువంటి సందేహాలు ఏమీ పెట్టుకోకుండా డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకుంటే స్పైన్‌ టి.బి. పూర్తిగా తగ్గిపోతుంది.