header

Urinary Infections

మూత్ర నాళ ఇన్‌ఫెక్షన్లు డా. కె. శుబ్రహ్మణ్యం, సీనియర్ యురాలజిస్ట్, అపోలో హాస్పటల్స్, జూబ్లిహిల్స్, హైదరాబాద్

urinary infections మూత్రం మంటగా ఉండొచ్చు. నొప్పి పుడుతుండొచ్చు. లేదూ తరచుగా వెళ్లాల్సి వస్తుండొచ్చు, ఆపుకోలేక ఇబ్బంది పడనూ వచ్చు. అంతా మామూలుగా.. సాఫీˆగా సాగిపోవాల్సిన మూత్ర విసర్జనలో ఇలాంటి తేడాలు కనబడితే ఎవరికైనా మనసు కలుక్కుమనే అంటుంది. ఏమైపోయిందో ఏమోననే ఆందోళన మొదలవుతుంది. నిజానికి చాలావరకు ఇవి సాధారణ లక్షణాలే కావొచ్చు. కొద్దిరోజుల్లో వాటంతటవే తగ్గిపోనూవచ్చు. కానీ అన్నిసార్లూ అలాగే జరగాలనేమీ లేదు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు, మూత్రమార్గం దెబ్బతినటం.. చివరికి క్యాన్సర్‌ వంటి సమస్యలు వీటికి దోహదం చేస్తుండొచ్చు. కాబట్టి మూత్ర సమస్యలపై నిర్లక్ష్యం పనికిరాదు. కారణాన్ని గుర్తించి తగు చికిత్స తీసుకోవటం అత్యవసరం.
ఒంట్లో నిరంతరం జరిగే జీవక్రియల నుంచి పుట్టుకొచ్చే వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటకు పోతుంటేనే ఆరోగ్యం ఇనుమడిస్తుంది. లేకపోతే శరీరం ‘చెత్తకుప్ప’లా తయారవుతుంది. ఈ లోపలి వ్యర్థాలను బయటకు పంపించేయటంలో మూత్రం కీలకపాత్ర పోషిస్తుంది. కణస్థాయిలో జరిగే జీవక్రియల నుంచి పుట్టుకొచ్చిన వ్యర్థాలన్నీ ముందు రక్తంలోనే కలుస్తాయి. ఈ రక్తాన్ని కిడ్నీలు నిరంతరం శుద్ధిచేస్తూ.. అందులోని మలినాలను, విషతుల్యాలను వేరుచేస్తూ.. మూత్రం రూపంలో బయటకు పంపించేస్తుంటాయి. కిడ్నీల్లో తయారైన మూత్రం.. మూత్రనాళాల ద్వారా మూత్రాశయంలోకి.. అక్కడ్నుంచి మూత్రమార్గం ద్వారా బయటకు వస్తుంది. మన మూత్రాశయం సుమారు అరలీటరు మూత్రాన్ని 2-5 గంటల వరకు పట్టి ఉంచగలదు. మూత్రంతో నిండినపుడు మూత్రాశయ కండరాలు వదులుగా ఉంటాయి. పూర్తిగా నిండుకోగానే కండరాలు ఆ విషయాన్ని నాడుల ద్వారా మెదడుకు చేరవేస్తాయి. ఫలితంగా మనకు వెంటనే బాత్రూమ్‌కు వెళ్లాలని అనిపిస్తుంది. విసర్జనకు వెళ్లగానే మూత్రాశయ కండరాలు సంకోచించి మూత్రం బయటకు వచ్చేస్తుంది. సాధారణంగా మూత్రం స్పష్టంగా, లేత పసుపు రంగులో ఉంటుంది. ఎలాంటి వాసనా ఉండదు. ఈ విసర్జన ప్రక్రియ అంతా ఎలాంటి కష్టం లేకుండా సజావుగా సాగిపోతుంటుంది. అయితే అన్నిసార్లూ ఇలాగే జరగాలనేమీ లేదు. కొన్నిసార్లు ఇది గాడి తప్పొచ్చు. మూత్రకోశంలో ఇన్‌ఫెక్షన్లు, రాళ్లు, వయసుతో పాటు వచ్చే మార్పుల వంటివి మూత్రం, మూత్ర విసర్జన తీరుతెన్నులను మార్చేయొచ్చు. దీంతో మంట, నొప్పి వంటి ఇబ్బందులు పొడసూపొచ్చు. కాబట్టి ఆయా లక్షణాలు, కారణాలపై అవగాహన కలిగుండటం అవసరం.
మంట, నొప్పి
‘మూత్రం పోస్తున్నప్పుడు మంటగా ఉంటోంది, లోపల కారం పూసినట్టుగా అనిపిస్తోంది’. ఇవి చాలామంది చెప్పే మాటలే. దీనికి ప్రధాన కారణం మూత్రకోశంలో ఇన్‌ఫెక్షన్లు తలెత్తటం. వీటిల్లో తరచుగా కనబడేవి ఇ-కొలై ఇన్‌ఫెక్షన్లు. మూత్ర ఇన్‌ఫెక్షన్లు మగవారిలో కన్నా ఆడవారిలోనే ఎక్కువ. ఆడవాళ్లలో మూత్రమార్గం మలద్వారానికి దగ్గరగా ఉంటుంది. అందువల్ల మలంలోని ఇ-కొలై వంటి బ్యాక్టీరియా తేలికగా మూత్రమార్గంలోకి వెళ్లే అవకాశముంటుంది. పైగా ఆడవాళ్లలో మూత్రమార్గం పొడవు చిన్నగానూ ఉంటుంది. దీంతో మూత్రాశయంలోకి బ్యాక్టీరియా త్వరగా ప్రవేశిస్తుంది కూడా. అలాగే లైంగిక సంపర్కం మూలంగానూ కొన్నిరకాల బ్యాక్టీరియా మూత్రకోశంలోకి చేరుకోవచ్చు. ఇవి ఇన్‌ఫెక్షన్‌కు దారితీయొచ్చు. దీంతో మంట, వెంటనే మూత్రానికి వెళ్లాల్సి రావటం, మూత్రం పోస్తున్నప్పుడు చివర్లో బాగా నొప్పి పుట్టటం వంటివి వేధిస్తాయి. అప్పుడప్పుడు రెండు మూడు చుక్కలు రక్తం కూడా పడొచ్చు. కొందరికి జ్వరం కూడా రావొచ్చు.
మూత్ర ఇన్‌ఫెక్షన్లను అనుమానిస్తే ముందుగా మామూలు మూత్ర పరీక్ష చేస్తారు. చీము కణాలేవైనా ఉంటే ఇందులో బయటపడుతుంది. అనంతరం మూత్రం కల్చర్‌ పరీక్ష చేస్తారు. ఇందులో ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన బ్యాక్టీరియా కచ్చితంగా బయటపడుతుంది. కల్చర్‌ పరీక్షతో చిక్కేంటంటే- మూత్ర నమూనాను సరిగా పట్టకపోవటం. పరీక్ష కోసం మూత్రాన్ని పట్టే ముందు ఆడవాళ్లు జననాంగం వద్ద, మగవాళ్లు అంగం చివరి భాగాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. కొంత మూత్రాన్ని పోసిన తర్వాత మధ్యలో వచ్చే మూత్రాన్ని మాత్రమే పట్టాలి. అప్పుడే బ్యాక్టీరియా రకాలు సరిగ్గా తెలుస్తాయి. సాధారణంగా కల్చర్‌ పరీక్ష ఫలితాలు రావటానికి 48 గంటలు పడుతుంది. అందువల్ల అంతవరకూ వేచి చూడకుండా వెంటనే యాంటీబయోటిక్‌ మందులు ఆరంభిస్తారు. కల్చర్‌ పరీక్ష ఫలితాలు వచ్చాక అవసరమైతే మందులు మారుస్తారు. మామూలు ఇన్‌ఫెక్షన్లయితే వీటితోనే నయమైపోతుంది. అయితే కొందరికి ఇన్‌ఫెక్షన్లు సంక్లిష్టంగానూ ఉండొచ్చు. మంటతో పాటు వీపు కిందిభాగాన లాగుతున్నట్టుగా నొప్పి, తీవ్రమైన జ్వరం, చలి, మూత్రంలో రక్తం పడటం వంటి లక్షణాలు కూడా ఉంటే కారణమేంటన్నది గుర్తించటం తప్పనిసరి. ఇందుకు అల్ట్రాసౌండ్‌ పరీక్ష బాగా ఉపయోగపడుతుంది. కిడ్నీలో, మూత్రాశయంలో రాళ్లు, మూత్రమార్గంలో అడ్డంకి వంటి సమస్యలేవైనా ఉంటే ఇందులో తెలుస్తుంది. మూత్రాశయం పూర్తిగా ఖాళీ అవుతోందా లేదా అనేదీ బయటపడుతుంది.
పిల్లల్లో మూత్ర ఇన్‌ఫెక్షన్లు తక్కువ. వస్తే మాత్రం సంక్లిష్టంగానే ఉంటాయి. సాధారణంగా మూత్రం వెనక్కి మళ్లటం (వసైకోయూరెత్రల్‌ రిఫ్లక్స్‌) పిల్లల్లో ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తుంది. మూత్రాశయం వద్ద మూత్రనాళం కలిసేచోట కవాటం సరిగా పనిచేయకపోవటం దీనికి మూలం. ఇది పుట్టుకతో వచ్చే సమస్య. వీరికి ముందుగా ఇన్‌ఫెక్షన్‌ తగ్గేందుకు యాంటీబయోటిక్స్‌ ఇస్తారు. సమస్య మామూలుగా ఉంటే వయసు పెరుగుతున్నకొద్దీ సరిదిద్దుకుంటుంది. తక్కువ మోతాదులో దీర్ఘకాలం యాంటీబయోటిక్స్‌ ఇవ్వటం ద్వారా ఇన్‌ఫెక్షన్లు రాకుండా నివారించొచ్చు. సమస్య మరీ తీవ్రంగా ఉంటే సర్జరీ ద్వారా కవాటాన్ని సరిచేయాల్సి వస్తుంది.
ఆడవాళ్లలో మూత్ర ఇన్‌ఫెక్షన్లు సాధారణంగా చూసేవే కాబట్టి అంతగా పరీక్షల అవసరం ఉండకపోవచ్చు. అయితే ఏడాదిలో 3 కన్నా ఎక్కువసార్లు మూత్ర ఇన్‌ఫెక్షన్ల బారినపడుతుంటే మాత్రం కారణమేంటన్నది లోతుగా పరిశీలించాల్సి వస్తుంది. అదే మగవారిలోనైతే ఒక్కసారి ఇన్‌ఫెక్షన్‌ తలెత్తినా కారణమేంటన్నది నిశితంగా పరీక్షించాల్సి ఉంటుంది.`
రక్తం పడుతుండటం
‘మూత్రం ఎర్రగా కనబడుతోంది. రక్తం పడుతోంది’ అని కొందరు వాపోతుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన లక్షణం. మూత్రంలో రక్తం పడినప్పుడు ముందుగా ఆలోచించాల్సింది నొప్పి గురించి. నొప్పితో పాటు మూత్రం వస్తుంటే ఇన్‌ఫెక్షనో, మూత్రాశయంలో రాళ్ల వంటివో కారణం కావొచ్చు. ఇదేమంత ప్రమాదకరం కాదు. ఆయా సమస్యలకు చికిత్స తీసుకుంటే నయమైపోతుంది. కానీ నొప్పిలేకుండా మూత్రం ఎర్రగా వస్తుంటే మూత్రశయంలో, కిడ్నీలో, మూత్రమార్గంలో ఎక్కడైనా కణితి ఉందేమోనని పరిశీలించటం తప్పనిసరి. కేవలం ఇన్‌ఫెక్షన్‌గా భావించి మందులు వాడుకోవటం సరికాదు. ఇన్‌ఫెక్షన్‌ బాగా తీవ్రమై, మూత్రం బాగా మంటగా వస్తున్నప్పుడు రెండు, మూడు చుక్కలు రక్తం పడితే పడొచ్చు గానీ మూత్రం మొత్తం ఎర్రగా రావటం అరుదు. అందువల్ల నొప్పిలేకుండా మూత్రంలో రక్తం పడుతుంటే నిర్లక్ష్యం పనికిరాదు. ఒక్కసారి మూత్రంలో రక్తం పడినా తగు పరీక్షలు చేసి కారణమేంటన్నది గుర్తించాలి. కణితుల వంటివి ఉన్నాయేమో నిర్ధరించుకోవాలి. సాధారణంగా కిడ్నీలో, మూత్రాశయంలో కణితులు ఏర్పడుతుంటాయి. కణితి నుంచి చిన్నముక్క తీసి పరీక్షిస్తే ఏ దశలో ఉందో తెలుస్తుంది. దానికి అనుగుణంగా చికిత్స చేస్తారు. కిడ్నీలో కణితి చిన్నగా ఉంటే అంతమేరకు తొలగిస్తే సరిపోతుంది. మరీ పెద్దగా ఉంటే కిడ్నీ మొత్తం తీసేయాల్సి వస్తుంది.
మూత్రంలో రక్తం కనబడినప్పుడు చాలామంది యాంటీబయోటిక్‌ మందులు వేసుకుంటారు. అప్పటికది తగ్గిపోవచ్చు కూడా. నిజానికి యాంటీబయోటిక్స్‌ తీసుకోకపోయినా రక్తం పడటం తగ్గుతుంది. ఆర్నెళ్ల తర్వాత మళ్లీ మొదలవుతుంది.
లీక్‌ అవుతుండటం
‘దగ్గినా తుమ్మినా మూత్రం చుక్కలు చుక్కలుగా పడుతోంది’ అని కొందరు చెబుతుంటారు. ఇది ఆడవారిలో ఎక్కువ. సుమారు 50% మంది మహిళలు జీవితంలో ఎప్పుడో అప్పుడు ఈ సమస్యను ఎదుర్కొన్నవారే! సాధారణంగా 40, 50 ఏళ్లు దాటినవారిలో ఇది కనబడుతుంటుంది. ఊబకాయుల్లో, ఎక్కువమంది సంతానాన్ని కన్నవారిలో మూత్రాశయ కండరాలు బలహీనపడుతుంటాయి. దీంతో చిన్నపాటి ఒత్తిడికే మూత్రం లీకవుతుంటుంది. వీరికి కటి కండరాలను బలోపేతం చేసే కీగల్‌ వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. వీటితో ఫలితం కనబడకపోయినా, మూత్రం తరచుగా చాలా ఎక్కువగా లీక్‌ అవుతున్నా, నలుగురిలో వెళ్లటానికి ఇబ్బంది అవుతున్నా సర్జరీ చేయాల్సి వస్తుంది. దీనికి రకరకాల సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. టెన్షన్‌ ఫ్రీ వజైనల్‌ టిప్‌ (టీవీటీ) పద్ధతిలో మూత్రమార్గం కింద టేపులాంటిది అతికిస్తారు. కొందరికి ల్యాప్రోస్కోపీ సాయంతో కాల్పోసస్పెన్షన్‌ కూడా చేయొచ్చు.
బాగా దగ్గినపుడో, గట్టిగా తుమ్మినపుడో ఏదో రెండు మూడు చుక్కలు పడితే పెద్దగా బాధపడాల్సిన పనిలేదు. కటి కండరాలను బలోపేతం చేసే కీగల్‌ వ్యాయామాలతోనే సమస్య నయమైపోతుంది.
ఎక్కువసార్లు రావటం
‘పొద్దుట్నుంచీ సాయంత్రం వరకూ గంట గంటకూ మూత్రానికి వెళ్లాల్సి వస్తోంది’ అని కొందరు వాపోతుంటారు. ఇందుకు రకరకాల కారణాలు దోహదం చేస్తుండొచ్చు. ఇన్‌ఫెక్షన్‌తోనూ తరచుగా మూత్రం రావొచ్చు. ప్రోస్టేట్‌ ఉబ్బు, స్ట్రిక్చర్‌, స్టినోసిస్‌ వంటి సమస్యల్లో మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాదు. దీంతో మూత్రాశయం త్వరగా నిండి తరచుగా మూత్రం రావొచ్చు. మూత్రాశయ క్షయ, మధుమేహం నియత్రణలో లేకపోవటం కూడా దీనికి దారితీయొచ్చు. కారణమేంటో తెలియదు గానీ కొందరిలో మూత్రాశయం కండరం అతిగా స్పందించటం కూడా సమస్యను తెచ్చిపెట్టొచ్చు. వీరిలో మూత్రాశయ కండరం సంకోచించటం అస్తవ్యస్తమై ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. అందువల్ల తరచుగా మూత్రం వస్తుంటే కారణమేంటన్నది లోతుగా పరిశీలించటం తప్పనిసరి. మూత్రం ఎంత వస్తోందో కూడా పరీక్షించాల్సి ఉంటుంది. దీంతో మూత్రాశయ సామర్థ్యమూ బయటపడుతుంది.
మూత్రాశయం అతిగా స్పందించేవారికి యాంటీ కొలనర్జిక్‌ మందులు బాగా ఉపయోగపడతాయి. వీటిని దీర్ఘకాలం వాడుకోవాల్సి ఉంటుంది. పెద్దగా దుష్ప్రభావాలేవీ ఉండవు. కొందరికి నోరు ఎండిపోవటం, మలబద్ధకం వంటివి తలెత్తొచ్చు.
రాత్రిపూట లేవటం
‘రాత్రిపూట మూత్రం వస్తుండటంతో తరచుగా మేల్కొవాల్సి వస్తోంది’ అనేది కొందరి ఫిర్యాదు. చాలామంది వయసు పెరిగినకొద్దీ రాత్రిపూట ఎక్కువగా మూత్రం వస్తుంటుందని భావిస్తుంటారు. ఇది నిజం కాదు. వయసుతో పాటు వచ్చే ప్రోస్టేట్‌ ఉబ్బు వంటి ఇతరత్రా సమస్యలే దీనికి మూలం. రాత్రిపూట తరచుగా లేవటం వల్ల నిద్ర బాగా దెబ్బతింటుంది. దీంతో తెల్లారాక నిస్సత్తువ, బడలిక వంటివి వేధిస్తుంటాయి. కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు. కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకోవటం ఉత్తమం. అలాగే జీవనశైలిని మార్చుకోవటంతోనూ మంచి ఫలితం కనబడుతుంది. రాత్రి 7 గంటల తర్వాత ద్రవాలు తగ్గిచటం మంచిది. చాలామంది రాత్రి పడుకోబోయే ముందు పాలు, మజ్జిగ వంటివి తాగుతుంటారు. దీంతో మూత్రం ఎక్కువ వస్తుంది. మద్యం మూలంగానూ మూత్రం ఎక్కువగా రావొచ్చు. కాబట్టి అలాంటి అలవాటుంటే మానెయ్యాలి. ఇలాంటి జాగ్రత్తలను పాటిస్తూ యాంటీకొలనర్జిక్‌ మందులు వాడుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. అప్పటికీ ఫలితం కనబడకపోతే రాత్రిపూట మూత్రం తయారీని తగ్గించే మందులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వీటితో సోడియం స్థాయులు తగ్గిపోయే అవకాశముండటం వల్ల వృద్ధులకు అంత సురక్షితం కాదు. మధ్యవయసు వారికి బాగా ఉపయోగపడతాయి.
ధార సన్నబడటం
‘ఇంతకుముందు మూత్రం బాగానే వచ్చేది, ఇప్పుడు ధార సన్నగా వస్తోంది’ అని చాలామంది చెబుతుంటారు. కొందరైతే రెండు ధారలుగా పడుతోందని, మూత్రం పోసేటప్పుడు ముక్కాల్సి వస్తోందని, పూర్తిగా పోసిన తృప్తి కలగటం లేదని అంటుంటారు.
మహిళల్లో- నెలసరి నిలిచిపోయినవారిలో ధార సన్నబడటం ఎక్కువ. వీరిలో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ స్థాయులు తగ్గటం వల్ల మూత్రమార్గం సన్నబడి (యూరెత్రల్‌ స్టినోసిస్‌) ధార తగ్గుతుంది. వీరికి యురెత్రోస్కోపీ సాయంతో మూత్రమార్గాన్ని వెడల్పు చేస్తే దారి మెరుగవుతుంది. అలాగే ఈస్ట్రోజెన్‌ పూత మందును రోజూ జననాంగం లోపల రాసుకుంటే మూత్ర మార్గం మళ్లీ మళ్లీ మూసుకుపోకుండా చూసుకోవచ్చు.
ఇక పురుషుల్లో 40, 50 ఏళ్లు దాటిన తర్వాత ధార సన్నబడటం ఎక్కువ. దీనికి ప్రధాన కారణం ప్రోస్టేట్‌ గ్రంథి ఉబ్బటం. దీంతో ధార, వేగం తగ్గుతాయి. విసర్జన వెంటనే కాకపోవటం, వచ్చినా ఆగి ఆగి రావటం వంటి లక్షణాలూ కనబడతాయి. ప్రోస్టేట్‌ గ్రంథి ఉబ్బటమనేది చాలావరకు వయసుతో పాటు వచ్చే సమస్యే అయినా కొందరిలో క్యాన్సర్‌ కూడా దీనికి కారణం కావొచ్చు. అందువల్ల అవసరమైతే పీఎస్‌ఏ (ప్రోస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటీజెన్‌) పరీక్ష చేయాల్సి వస్తుంది. పీఎస్‌ఏ నార్మల్‌గా ఉండి, కొంత మూత్రమే మిగిలిపోతుంటే ఆల్ఫాబ్లాకర్‌ మందులతో మంచి ఫలితం కనబడుతుంది. వీటిని క్రమం తప్పకుండా వాడుకోవాలి. మాత్రలతో ఫలితం కనబడకపోయినా, దుష్ప్రభావాలు కనబడుతున్నా, ప్రోస్టేట్‌ ఉబ్బు మరీ ఎక్కువగా ఉన్నా, మూత్రం బాగా మిగిలిపోతున్నా, మూత్రం పూర్తిగా ఆగిపోయి గొట్టం వేయాల్సి వచ్చినా ప్రోస్టేట్‌ సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రోస్టేట్‌ గ్రంథిని కొంతవరకు కత్తిరించి తీసేస్తారు.
కొన్నిసార్లు మగవారిలో మూత్రమార్గంలో కణజాలం మీద మచ్చబడి మార్గం సన్నబడటం (స్ట్రిక్చర్‌) మూలంగానూ ధార సన్నబడొచ్చు. స్ట్రిక్చర్‌ చిన్నగా ఉంటే శస్త్రచికిత్స ద్వారా మధ్యలో అంతవరకు కత్తిరించి.. మిగతా మార్గాన్ని తిరిగి జతచేస్తారు. ఒకవేళ స్ట్రిక్చర్‌ పెద్దగా ఉంటే దవడ నుంచి జిగురుపొరను తీసుకొచ్చి దెబ్బతిన్న చోట అమరుస్తారు.