header

Water.... మంచినీరు ఎంత త్రాగాలి....

Water.... మంచినీరు ఎంత త్రాగాలి....

శరీరానికి ఎంతో మేలు చేసే నీటిని తగినంతగా తాగడమనేది ప్రతి ఒక్కరూ అలవాటుగా చేసుకోవాలి... డాక్టర్‌ టి. కృష్ణమూర్తి.
సమస్త జీవకోటికి ఆధారభూతమైనది నీరు. ఆరోగ్యానిచ్చే టానిక్‌. మానవ శరీరం సుమారు 70 శాతం నీటితోనే నిండివుంది.
వేదాలలోను, ఉపనిషత్తులలోను, ఇతర ప్రామాణిక గ్రంథాలోను నీటి ప్రాముఖ్యత వివరించబడింది. శరీరంలోని మలినాలు తొలగించి, ఆరోగ్యవంతంగా ఉంచే శక్తి నీటికి ఉందని ఋగ్వేదం చెబుతోంది. అనేక ఔషధ గుణాలు నీటిలో ఉన్నాయని, నీటి సద్వినియోగం వల్ల శక్తి, తద్వారా జ్ఞానం కలుగుతుందని ఋగ్వేదం చెబుతోంది. అందుకనే దీన్ని విశ్వజనీన ఔషధం అంటారు. ఆహారం లేకుండా కొన్ని రోజులు జీవించవచ్చు. కాని నీరు తాగకుండా కొన్ని గంటలు కూడా బతకలేము.
శరీరం జీవకణ నిర్మితం. ఆ జీవకణాలకు ఆహారం, ఆక్సిజన్‌ నీటి ద్వారా (రక్తం ద్వారా) సరఫరా అవుతుంది. హృదయస్పందన, కాలేయం, మూత్రపిండాలలోని విషపదార్థాల విసర్జన, జీర్ణక్రియ శోషణం, విసర్జన క్రియ వంటి ప్రముఖ జీవచర్యలన్నిటికీ నీరు అవసరం.
కీళ్ళను ఆర్థరైటిస్ నుండి కాపాడేది పరోక్షంగా నీరే. నీరు లేకుంటే ప్రాణం నిలబడదు.
ఎంతనీరు తాగాలి : ఒక రోజుకు ఎంత నీరు తాగాలనేది చాలా మంది తెలుసుకోవలసిన విషయం. వ్యక్తి యొక్క ఆరోగ్యం, శారీరక వ్యాయామం, జీవన పరిస్థితులు, వాతావరణం వంటి విషయాలపై తీసుకోవలసిన నీటి పరిమాణం ఆధారపడి వుంటుంది.
రోజుకు రెండున్నర నుండి 3 లీటర్ల నీటిని త్రాగడం అవసరమని, సాధారణ పరిస్థితుల్లో ఇది సరిపోతుందని వైద్యులు అభిప్రాయపడుతుంటారు. వాంతులు, విరోచనాలు, జ్వరం వంటి పరిస్థితులలో ఎక్కువ నీరు తాగడం అవసరం. ఎండలో తిరిగేటప్పుడు, పనిచేసేటపుడు, ఉష్ణప్రదేశాల్లో నివసించేవారు, చెమట ఎక్కువ పట్టేవాళ్ళకు 10-15 గ్లాసుల వరకు నీరు అవసరం.
శారీరక శ్రమ తాగవలసిన నీటి పరిమాణాన్ని నియంత్రిస్తుంది.. వ్యాయామం ఎక్కువగా చేసేవాళ్ళకు నీరు ఎక్కువ అవసరం. కొన్ని రకాల మూత్రపిండ, కాలేయ వ్యాధులలో తక్కువగా నీరు తాగాలి. ప్రత్యక్షంగా తాగే నీటితో పాటు పళ్ళు కూరలు, పండ్లజ్యూస్‌లు వంటి వాటిలో ఉండే నీటిని కూడా లెక్కలోకి తీసుకోవాలి. ఎత్తైయిన ప్రదేశాలలో నివసించేవారు రోజుకు షుమారు ఇరవై గ్లాసుల నీరు తాగాలి. ఎక్సర్‌సైజులు ముందు వెనుకల శరీర బరువు చూసుకొని ప్రతి పౌండు తగ్గుదలకు పదహారు ఔన్సుల చొప్పున నీరు తాగుతుండాలి.
గుండె జబ్బులున్నవారు ఎక్కువ నీరు తాగితే గుండెమీద ఒత్తిడి పెరిగే అవకాశం వుంది కనుక వైద్యుని సలహా తీసుకోవాలి.హిమోగ్లోబిన్‌ తక్కువగా ఉన్నవారు, ఆల్కహాల్‌ తాగేవారు, కాలేయ వ్యాధులు వున్నవారు డాక్టర్‌ సలహాను అనుసరించి నీరు తాగాలి. దాహం లేకపోయినా అతిగా నీరు తాగడం అనర్థదాయకం.
నీరు తక్కువగా తాగితే
1. డీహైడ్రేషన్‌ కలుగుతుంది.. మలబద్ధకత ఏర్పడుతుంది.
2. తలనొప్పి, తలతిరగడం, అలసట, నిస్త్రాణ, ఆందోళన కలిగే అవకాశం ఉంది.
3. మూత్ర విసర్జన తగ్గుతుంది. ఒక్కోసారి ఆగిపోవచ్చు. కండరాల నొప్పులు, బలహీనత, కాళ్ళు చేతులు చల్లబడటం జరుతాయి.
4. చర్మం పొడి ఆరుతుంది.కాంతి విహీనమవుతుంది. నోరు పొడి ఆరుతుంది. అజీర్ణంవల్ల అనేక జీర్ణ సంబంధిత బాధలు కలుగుతాయి.
5. మూత్రవిసర్జన సమయంలో మంట, నొప్పి కలుగుతాయి. మూత్రవిర్జన సక్రమంగా జరగకపోవటం వల్ల రక్తం మలినాలతో నిండిపోతుంది. విషపదార్థాలు విసర్జింపబడక శరీరంలో పేరుకుపోతాయి.
6. తగినంత నీరు తాగకపోతే అనేక రకాల ప్రమాదకర వ్యాధులు కలుగుతాయి.
7. వయసు పెరిగేకొలది దాహం తగ్గుతుంది. నీరు తాగాలని అనిపించకపోయినా తగినంత నీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. రోజుకు కనీసం 2,3 లీటర్లకు తగ్గకుండా తాగాలి. 8. ఎక్కువ రక్తపోటు, ఆస్త్మా, విపరీతమైన శారీరక నొప్పులు రావానికి మూలకారణం నీటిసరఫరా తక్కువగా ఉండటమే నంటున్నారు వైద్యులు.
నిర్జలీకరణ వచ్చే రోగాలు : 1. కోలన్‌ యుటెరస్‌, లివర్‌, ఊపిరితిత్తులు వంటి అవయవాలకు సంబంధించిన క్యాన్సర్‌
2. యూరిన్‌ జెనిటల్‌ వ్యాధులు, రెక్టల్‌ ప్రొలాప్స్‌, అజీర్ణం, ఫైల్స్‌ వంటి వ్యాధులు వస్తాయి.
3. అత్యధిక కొలెస్ట్రాల్‌ నిల్వలు, అధిక రక్తపోటు, టెన్షన్‌, గుండె సంబంధిత వ్యాధులు.
4. ఓవేరియన్‌ సిస్టులు, మెన్సస్‌ సమస్యలు, అధిక బరువు,కళ్లు ఎరుపెక్కటం, తల తిరుగుట, సైనసైటిస్ , కంటి హెమరేజ్‌.
శరీరంలో నీటి శాతాన్ని ఎలా అంచనావేయవచ్చు :
1.మూత్రం పసుపు రంగులో ఉంటే నీరు తక్కువైనట్లు భావించాలి. కాని పచ్చకామెర్లు, బి.కాంప్లెక్స్‌, కొన్ని ఇతర మందులవల్ల,వ్యాధులవల్ల కూడా మూత్రం పసుపురంగులో ఉండవచ్చు.
2. మూత్రం ఎండుగడ్డిరంగులో ఉంటే చాలినంత నీరు శరీరంలో ఉన్నట్లు లెక్క.
3. మూత్రం తెలుపురంగులో స్వచ్ఛమైన నీటిలా ఉంటే ఎక్కువ నీరు తాగుతున్నట్లు భావించాలి.
4. తాగే నీటి ప్రమాణాన్ని నియంత్రించేందుకు మూత్రం రంగు కొంతవరకు సహాయపడుతుంది.
ఖాళీకడుపుతో తాగితే : పరగడుపున నీరు తాగితే ఎంతో మేలు. ఆ సమయంలో జీర్ణమండలం ఖాళీగా ఉంటుంది. ఆహారం ఏమీ కడుపులో ఉండదు. అందువల్ల తాగినటు వంటి నీటి వల్ల అంతర్గతంగా శుభ్రత కలుగుతుంది. విషపదార్థాలు, మలినాలు బయటకు విసర్జింపబడతాయి. శరీరం కూడా శక్తివంతమవుతుంది. మూత్రం, చెమటవల్ల మలినాలు విసర్జిపబడతాయి. రక్తం పలుచబడుతుంది. రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.
దేహరక్షణకు :మనశరీరంలోని వివిధ అవయవాలు, కణజాలాలు సరిగా పనిచెయ్యాటానికి పోషకాలు, ఆక్సిజన్‌, హార్మోనులు, ఎంజైమ్స్‌ వంటివి అవసరం. ఇవన్నీ కూడా ఆయా అవయవాలకు రక్తంద్యారా సరఫరా అవుతాయి. రక్తంలో 83 శాతం దాకా నీరు ఉంటుంది. అందువల్ల రక్త సరఫరా బాగా జరగాలంటే నీటి శాతం తగినంతగా ఉండాలి. అందువల్ల పోషకాలను శరీరం గ్రహించడానికి, జీవక్రియల నిర్వహణకు నీరు అవసరం. జీవక్రియలవల్ల, ఇతరత్రా ఏర్పడిన మలినాల్ని విసర్జించేందుకు కూడా నీరు ఉపయోగపడుతుంది.
బరువుతగ్గడానికి : భోజనం చెయ్యడానికి కొంతసేపు ముందుగాను, భోజనం మధ్యలోను గ్లాసుడు నీరు తాగడం మంచిది. దీనివల్ల ఆకలి కూడా బాగా తగ్గుతుంది. తక్కువగా తింటారు. శరీరంలోని కేలరీలు బాగా ఖర్చవుతాయి. అందువల్ల బరువు తగ్గుతారు.
మూత్రాశయంలో రాళ్ళు ఏర్పడకుండా : చాలా పురాతనకాలం నుంచి గుర్తింపు పొందిన ఈ విషయాన్ని ప్రస్తుతం వైద్యశాస్త్రం ధృవీకరించింది, వయస్సు, సెక్స్‌, వంశపారంపర్యత, వృత్తి, ఆహారం వంటివి కిడ్నీలలో రాళ్ళు ఏర్పడడానికి కారణమని శాస్త్రజ్ఞులు గుర్తించారు.
1. ఎక్కువగా నీరు తాగాలి మరీ చిన్న రాళ్ళుంటే అవి మూత్రం ద్వారా బయటకు వస్తాయి.
2. మూత్రం పల్చగా వుంటే యూరిక్‌ యాసిడ్‌ రాళ్ళు ఏర్పడవు. బార్లీగింజల నీరు తాగడం కిడ్నీస్టోన్స్‌ చికిత్సలో ప్రముఖ ప్రక్రియ.
జ్ఞాపకశక్తి నియంత్రణకు : మెదడులోని బూడిదరంగు పదార్థంలో 85 శాతం నీరు వుంటుంది. అందువల్ల మెదడు సరిగా పనిచేయాలంటే తగినంత నీరు కావాలి. మానసిక శక్తుల పెరుగుదలకు నీరు ఎంతగానే ఉపకరిస్తుంది. రెండుశాతం నీరు తక్కువైతే స్వల్పకాల జ్ఞాపకశక్తి తగ్గుతుంది. కూడిక, తీసివేతలు చేసేశక్తి సన్నగిల్లుతుంది.
శ్యాసక్రియ - జలవిసర్జన : రోజుకు 2-4 గ్లాసుల నీరు శ్యాసక్రియ వలన విసర్జించ బడుతుంది. చెమట బాగాపడితే మరొక కప్పు నీరు విసర్జింపబడుతుంది. పదిశాతం నీరు శరీరం నుండి బయటకిపోతే నిర్జలీకరణగా గుర్తించాలి.
రెండుశాతం నీరు బయటికి పోతే క్రీడాకారుల సామర్థ్యం తగ్గుతుంది. అలసట కలుగుతుంది. సునిశితంగా ఆలోచించే శక్తి తగ్గుతుంది. హృదయస్పందనపై ప్రభావం: వ్యాయామంవల్ల శరీరంలో నీరు బయటకు పోతుంది. అందువల్ల జీవక్రియలలో మార్పు వస్తుంది. నీటి సరఫరా చాలినంత లేకపోతే హృదయస్పందన సక్రమంగా ఉండదు. తగినంత నీరు తాగడంవల్ల ఈ పరిస్థితి చక్కబడుతుంది.
ఆరోగ్యంగా, యవ్యనంగా ఉండానికి :జీర్ణక్రియ, శోషణలకు నీరు తోడ్పడుతుంది. కాలేయం, మూత్రపిండాల నుండి విషపదార్థాలను తొలగిస్తుంది. శరీరంలోని మలినాల్ని విసర్జిస్తుంది. రక్తం పలచగా ఉండేందుకు సహకరించడలవల్ల మెదడును చైతన్యవంతంగా ఉంచతుంది. ఏకాగ్రతను పెంచుతుంది.
అకాల వృద్ధాప్యం ఆపడంకోసం : ఏజింగ్‌ తగ్గడానికి, వాయిదా వెయ్యడానికి నీరు ఎంతగానో సహకరిస్తుంది.పరిశుభ్రమైన నీరుతాగితే శరీరంలోని మలినాలు విసర్జింపబడతాయి. శరీరం ఆరోగ్యంగా ఉంటుది. యంగ్‌గా ఉంటారు. మన శారీరక, మానసిక శక్తుల పెంపుదలకు తగినంత నీరు తాగాలి. నీరు లేనిదే జీవం లేదు. శారీరక అవసరాలకు నీరు చక్కని నెలవు.
అంతా జలమయం : మన శరీరంలో ఎక్కడ ఎంత నీరు ఉందో తెలుసా ! రక్తంలో 80 శాతం, మెదడులో 74 శాతం, కండరాలో 75 శాతం ఎముకల్లో 22 శాతం, కార్నియాలో 80 శాతం, శరీరబరువులో 2/3 వ వంతు నీరు ఉంటుంది.
జలచికిత్స : ఐస్‌ ముక్కలు నుదుటిపై రుద్దితే తలనొప్పి తగ్గుతుంది. వేడి ఉప్పునీరు పుక్కిటపడితే గొంతు నొప్పి టాన్సిల్స్‌ తగ్గతాయి. తడ్డిగుడ్డతో అరికాళ్ళు, అరిచేతులు బాగా తుడిస్తే హై టెపంరేచర్‌ 1, 2 డిగ్రీలు తగ్గవచ్చు. చర్మం కాలితే నీటితో తడపాలి. కుక్క కరిస్తే ఏకధారగా పుండును కడగాలి. వేడినీరు తాగితే కఫం కరుగుతుంది. పసుపు ఆవిరిపడితే జలుబు తగ్గుతుంది.
నీటిని తీసుకోవడానికి : ఇన్సులేషన్‌ ఉన్న స్పోర్ట్స్‌ బాటిల్స్‌ వాడాలి. నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. పరిశుభ్రమైన నీటిని తాగాలి.
ఎండాకాలంలో: ఎండలోంచి రాగానే నీళ్ళు తాగకూడదు. దుస్తులు మార్చకుని, కాళ్ళు, చేతులు కడుక్కున్నాకనే నీళ్ళు తాగడం మంచిది. ఉదయం, సాయంత్రం, చన్నీళ్ళతో స్నానం చేయాలి. ఉదయం లేవగానే నీళ్ళు తాగాలి. కాచి చల్లార్చిన గోరువెచ్చని నీళ్ళు రెండుగ్లాస్లులు పరగడుపున తాగితే దేహం శుభ్రపడుతుంది. రోజంతా ఫ్రెష్‌గా ఉంటుంది.
నీళ్ళు కాచుకుని తాగడం మంచిదే. ఐతే కాచిన నీటిలో మృత బాక్టీరియా ఉంటుందని గమనించాలి. కనుక చల్లార్చిన తరువాత తప్పనిసరి వడకట్టాలి. నీరు శరీరానికి అంతర్గతంగాను, బాహ్యంగాను ఎంతో మేలు చేస్తుంది. లోపలి అవయవాలను శుద్ధిచేయడమే కాకుండా మరమ్మత్తు చేయగల శక్తి నీటికి ఉంటుంది. అంతేకాదు, చర్మం నిగనిగలాడాలంటే నీరు ఎంతెక్కువ తాగితే అంత మంచిది.
స్టీమ్‌బాత్‌ వలన ఎంతో రిలాక్స్‌ అవుతారు. దేహంపైన వుండే టాక్సిన్స్‌ శుభ్రపరచబడతాయి. నీరు బాగా తాగేవారికి గుండెజబ్బులు దూరంగా వుంటాయి.
నీరు త్యరగా రక్తంలో కలుస్తుంది. ఎక్కువ నీరు తాగడం వలన రక్తం పలుచబడుతుంది. పర్యవసానంగా హృద్రోగాలు మన దరిచేరవు.
ఇంతేకాదు, మధుమేహం, పక్షవాతం లాంటి రోగాలు గుండెకు ఎంత హానికరమో నీరు ఎక్కువగా తాగకపోవడమూ అంతే ప్రమాదకరం. నీటికి సమమైన ప్రత్యాయామ్న్ ఏదీలేదు. శీతల పానీయాలు గాని, పండ్లరసాలు గాని, మధ్యం గాని, కాఫీ, టీలు గాని ఇవేవీ నీటికి సాటి రావు. ఇవన్నీ ఎక్కువ కేలరీల శక్తిగల పానీయాలు. ఇవి రక్తంలో కలవాలంటే ముందుగా వాటిలోని రసాయనిక కృత్రిమాలు జీర్ణం కావలసి వుంటుంది.
ఈ లోగా పానీయాలలోని రసాయనాలు రక్తంలోని నీటిని గ్రహించడంతో దేహం డీహైడ్రేషన్‌ అవుతుంది. మరీ ముఖ్యంగా వేసవికాలంలో తాగే శీతల పానీయాలవల్ల ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
శరీరానికి ఎంతో మేలు చేసే నీటిని తగినంతగా తాగడమనేది ప్రతి ఒక్కరూ అలవాటుగా చేసుకోవాలి.