header

Food for Children…..చిన్న పిల్లల ఆహారం...చిట్టిపొట్టకు శ్రీరామ రక్ష…

Food for Children…..చిన్న పిల్లల ఆహారం...చిట్టిపొట్టకు శ్రీరామ రక్ష….......... డా॥ సాయిబాబా, ఫ్రొఫెసర్‌, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యామిలీ వెల్‌ఫేర్‌
అమ్మపాల నుంచి ....అన్న ప్రాశనలోకి అడుగుపెట్టాక ఎదిగే పాపాయికి ఏం పెట్టాలి ? బిడ్డ చలాకీగా, చురుగ్గా, ఆరోగ్యవంతంగా ఉండటానికి పొట్టను నింపే పోషకాహారాన్ని గోరుముద్దలు ఏ రూపంలో అందించాలి? ఎదిగే క్రమంలో బిడ్డ మానసిక, శారీరక, మానసిక ఎదుగుదలకి అవసరం అయిన పోషకాహారం గురించిన అవగాహన ప్రతి తల్లికి ఎంతో అవసరం.
ముఖ్యంగా ఏడాది లోపు బిడ్డ ఎదుగుదలకి అవసరం అయిన పోషకాలని ఎలా సులువుగా అందించాలో చెబుతున్నారు నిపుణులు.
అమృత సమానం.... అమ్మపాలు : తొలినాళ్ళలో అంటే ఆరునెలల వరకు బిడ్డకు కావల్సిన సమస్త పోషకాలు అమ్మపాలనుంచే అందుతాయి. తల్లి అందించే ఆ అమృతధారలు బిడ్డ వ్యాధి నిరోధక శక్తిని పెంచి రోగాల బారిన పడకుండా చేస్తాయి. ముఖ్యంగా నెలలు నిండకుండా పుట్టిన బిడ్డకు అమ్మపాలే ఔషధం. బదులుగా కొంతమంది ఆవుపాలని, నీళ్ళని ప్రత్యామ్నాయంగా ఇస్తుంటారు. నీళ్ళ వల్ల అనవసరంగా పాపాయి పొట్ట నిండిపోవడం తప్ప ప్రయోజనం ఉండదు. అలాగే ఆవుపాలల్లో ఇనుము లోపం ఉంటుంది. మేకపాల నుంచి అత్యావశ్యక ఫోలిక్‌ ఆమ్లం లభించదు. ఇవి తల్లిపాలకు ప్రత్యామ్నాయం ఎంత మాత్రం కాదు. పైగా కొన్ని సందర్భాల్లో బుద్ధిపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక ఆర్నెల్ల తర్వాత నుంచీ ఎదిగే చిన్నారులకు వారి అవసరాల రీత్యా ఘనాహారాన్ని తప్పనిసరిగా అందించాలి.
బరువుకు తగ్గ ఆహారం. : ఆరోగ్యవంతమైన శిశువు పుట్టినప్పుడు సుమారు మూడు కేజీల వరకు బరువుండాలి. ఐదోనెలకి అది రెట్టింపవ్వాలి. మొదటి పుట్టిన రోజు నాటికి మూడు రెట్లు ఉండాలి. బిడ్డ బరువు పెరుగుతున్న కొద్దీ, ఆటపాటలు అధికమవుతున్న కొద్దీ వారికి తల్లిపాలతో పాటు ఇతర ఘనాహారం నుంచి అందే శక్తి అవసరం పెరుగుతుంది.
తొలి ఘనాహారం ...శక్తి భరితం : సాధారణంగా అన్న ప్రాశన జరిగినప్పట్నుంచి మెత్తగా మెదిపిన అన్నం..పప్పుపై తేట, ఉడికించి మెదిపిన బంగాళదుంపలు, అరటిపండు గుజ్జు నెయ్యి వంటివి వాటిని పిల్లకు తినిపిస్తుంటారు. వాస్తవానికి ఇది మంచి ఆహారమే అయినా పిల్లలు వీటిని కొంచెం తినేటప్పటికి వాటిలోని నీటిశాతం కారణంగా త్వరగా పొట్ట నిండిపోతుంది. దాంతో వాటిని తినమంటూ మారం చేస్తారు. ఫలితంగా పోషకాలు అందవు. అలా కాకుండా తొలి ఘనాహారంలో గింజధాన్యాలు, పాలు, పప్పు దినుసులు కలయికతోచేస్తే మేలు. ఎందుకంటే ఇవి త్వరగా జీర్ణమవుతాయి.
మేలుచేసే మాల్టింగ్‌ పద్దతి : ప్రత్యేక పద్దతిలో చేసే మాల్టింగ్‌ ఆహారాలు పిల్లలకు తేలికగా జీర్ణమై సంపూర్ణ పోషకాలని అందిస్తాయి. ఎంపిక చేసిన చిరు, గింజ ధాన్యాలని ఎండబెట్టి పొడికొట్టే ఈ విధానంలో రాగులు, పెసలతో చేసే మాల్టింగ్‌ ఆహారాలు ఎంతో మేలు చేస్తాయి. వాటిని ఎలా చేసుకోవచ్చో చూద్దాం
రాగి మాల్ట్‌ : శుభ్రం చేసిన కేజీ రాగులని పదిహేను గంటలపాటు నానబెట్టుకోవాలి. నీటిని వంపి తడి వస్త్రంలో మూడు రోజుల పాటు మూటకట్టి ఉంచాలి. మధ్యలో నీటిని చిలకరిస్తూ మొలకలు వచ్చిన తర్వాత తీసి ఎండపెట్టాలి. తర్వాత వాటిని దోరగా వేయించుకోవాలి. మొలకలని తొలగించి పిండి పట్టించుకొని గాలిచొరని డబ్బాలో భధ్రపరుచుకోవాలి.
పెసలమాల్ట్‌ : శుభ్రం చేసిన కిలో పెసలని పదిహేను గంటలపాటు నానబోసి వాటిని తడి వస్త్రంలో మూటకట్టి రోజంతా ఉంచితే మొలకలొస్తాయి. తర్వాత వీటిని ఎండబెట్టి పొట్టు, మొలకలు తొలగించిన తర్వాత సన్న సెగన దోరగా వేయించి, చల్లార్చి పిండి పట్టించుకుంటే పెసల మాల్ట్‌ సిద్ధమైనట్టే.
రుచికరమైన బేబి ఫుడ్‌ చేసుకొనేదిలా... రెండు భాగాలు రాగి మాల్ట్‌కి, ఒక భాగం పెసల మాల్ట్‌ కలిపితే బేబి ఫుడ్‌ సిద్దమైనట్టే. అందులోంచి ఐదు చెంచాల పొడిని తీసుకొని కప్పు పాలలో లేదా నీళ్లలో వేసి ఉడకనివ్వాలి. కమ్మటి వాసనతో మూడు నిమిషాల పాటు ఉడికిన తర్వాత పిల్లకు కాస్తగా జారుగా చేసి పెట్టాలి. ఈ ఆహారం వలన పిల్లలకు ఉబ్బరం, గ్యాస్‌ వంటి సమస్యలు తలెత్తవు. పాలతో కలిపి ఇస్తున్నట్లయితే అవి బాగా మరిగాక ఈ పొడి కపాలి. లేకపోతే అజీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
1) ఆరునెలల పిల్లలకు ఆ ఆహారాన్ని ప్రారంభించవచ్చు. నెమ్మదిగా ఏడు, ఎనిమిది నెలల్లో ఈ మాల్ట్‌ ఆహారానికి తోడుగా బాగా ఉడికించిన మాంసం, పప్పు, చేపలు, కూర ముక్కలు, పండ్లు, గుడ్డులోని పచ్చసొన అవసరాన్ని బట్టి కొద్దిగా పంచదార కలపొచ్చు
2) ఇలా నాలుగైదు రకాల ఆహారాని కలిపి ఇవ్వడాన్ని మల్టీమిక్స్‌ అంటారు. ఈ విధానంలో పిల్లలకు మాంసకృత్తులు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి. ఈ ఆహారాన్ని తప్పనిసరిగా చనుపాలు పట్టిన తర్వాతే పెట్టాలి. ముందే పెడితే తల్లిపాలు తాగడం మానేస్తారు. మొదట్లో రెండు చెంచాల వరకు సరిపోతుంది. ఇలా పెట్టినప్పుడు కొన్నిసార్లు పిల్లలు ఉమ్మేస్తుంటారు కూడా కారణం అంతవరకు ఇతర ఆహారం రుచి ఎలా ఉంటుందో తెలియకపోవడమే. క్రమంగా అలవాటు చేసుకుంటారు. అధిక శక్తి కోసం ఆహారంలో కొద్దిగా నూనె, నెయ్యి వంటి కొవ్వు పదార్ధాలని కలపడం పిల్లలకు రెట్టింపు శక్తి అందుతుంది.
3) పసిపాప ఆహారంలో గట్టిగా ఉండే పదార్ధాలని, పొట్టు ఉన్నవాటిని దూరంగా ఉంచాలి. లేకపోతే అజీర్తి చేస్తుంది.
4) ఆహారాన్ని బవంతంగా కాకుండా బుజ్జగించి పదార్ధాన్ని ఆస్వాదించేలా చేసి అప్పుడు పెట్టాలి. ఏడాది నిండిన పిల్లలకు క్రమంగా అన్ని రకాల ఆహారాలని పరిచయం చెయ్యాలి.
పసితనంలో ఏ ఆహారపు అవాట్లు చేస్తారో అవే చాలాకాలం ఉంటాయి. నడక నేరుస్తున్న రోజులోనే పిల్లలకు అన్ని రుచులూ అలవాటు చేయాలి. మూడేళ్ళ పిల్లల ఆహారం పెట్టే తల్లులు ఒకేచోట కూర్చుని ఆహారం తినే అవాటు చేయాలి. అటు, ఇటూ తిరుగుతూ తినే తిండి వంటబట్టదు. అన్నం 20 నిమిషాలో తినిపించాలి.
ప్రతి వారం ఒక కొత్త రుచిని అవాటు చేయాలి. పాలు, పెరుగు రోజులో కనీసం రెండుసార్లు ఇవ్వాలి. బరకగా, మెత్తగా ఉండే ఆహారం అలవాటు చేయాలి. రోజులో పప్పు రెండుసార్లు, పండ్లు ఒకసారి అలవాటు చేయాలి. అన్నంతో కూరగాయలు కలిపి పెట్టాలి.
పిల్లలను తామంత తామే తినేటట్లు ప్రోత్సహించాలి. పిల్లలకు అన్ని రుచులు తెలియాలి. అన్నీ కలిపి మిక్సీలో వేసి మిక్సడ్‌ రుచులు వద్దు. బయటకు తీసుకు వెళ్ళి తినిపించే ఆహారం అసు వద్దు.
పిల్లల పళ్ళు దృఢంగా ఉంచే ఆహారం
బాగా పీచు ఉండి ఎక్కువ సేపు నమిలితే పళ్ళు శుభ్రపడతాయి.
నట్స్‌ : నట్స్‌ ఉప్పులేకుండా తింటే మంచిది. పచ్చి నట్స్‌ చప్పరించటం వన బ్యాక్టీరియా, యాసిడ్స్‌ తొలగి పోతాయి.
తాజాపండ్లు : పండ్లలో పీచు ఎక్కువగా ఉండి చిగుళ్లకు మసాజ్‌ జరుగుతుంది.ఎక్కువగా నమడం వలన పళ్ళు దృఢంగా అయ్యే అవకాశం ఎక్కువ. సిట్రస్‌ పళ్ళు (పుల్లనివి) తిన్న తరువాత నోరు కడుక్కునే అలవాటు చేయాలి. లేకపోతే వీటిలో ఉండే ఆమ్లం వలన పళ్ళపై ఉండే ఎనామిల్‌ దెబ్బ తింటుంది.
పచ్చి కూరగాయలు : పండ్లకంటే పచ్చికూరగాయలు మంచిది. వీటివలన అదనపు చక్కెర చేరదు.
పెరుగు లేదా పాలు : ఇవి కాల్షియంకు అద్భుతమైన ఆధారం. పళ్ళు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడతాయి.