telugukiranam

Seychelles Tourism....... సీషెల్స్‌ పర్యాటకం...

Seychelles Tourism....... సీషెల్స్‌ పర్యాటకం...
సీషెల్స్‌ ఆఫ్రికా ఖండానికి చెందిన దేశం. హిందూ మహాసముద్రం మధ్యలో 115 ద్వీపాల సమూహం సీషెల్స్‌. హనీమూన్‌ డెస్టినేషన్‌గా ఈ ద్వీపదేశానికి మంచి పేరుంది. అందమైన తీరాలు, అత్యద్భుతమైన జలపాతాలు, అడవులు, పర్వతాలతో పర్యావరణ కేంద్రంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది.
పెద్దవాళ్లకు ఆటవిడుపు, యువజంటకు హనీమూన్‌ లొకేషన్‌... మొత్తంగా పర్యటకుల పాలిట భూతల స్వర్గమే సీషెల్స్‌
సీషెల్స్‌ రాజధాని విక్టోరియా. వీరి భాషలు ఇంగ్లీష్, ఫ్రెంచ్ సీషెల్లీస్. వీరి కరెన్సీ సీషెల్స్‌ రూపాయి. మన రూ.5.30తో సమానం (2019) సీషెల్స్ క్రిస్టియన్ దేశం.
సాహస క్రీడలకు సీషెల్స్‌ పెట్టింది పేరు. స్కూబా డైవింగ్‌, స్నూర్కెలింగ్‌ సముద్ర గర్భంలోని అందాలను ఆస్వాదించవచ్చు. పగడాల దిబ్బలు పరవశుల్ని చేస్తాయి. స్టార్‌ రిసార్టులు భూతల స్వర్గాన్ని గుర్తు తెస్తాయి. పెద్దగా లోతులేని సముద్ర తీరాలలో విహరించవచ్చు. సీషెల్స్‌ ప్రధాన దీవుల మధ్య ఫెర్రీలో విహరించవచ్చు.
160 చ.కి.మీ. వైశాల్యం గల మహె దీవి అన్నింటిలోకెల్లా పెద్దది. దేశ రాజధానితోబాటు అంతర్జాతీయ విమానాశ్రయం, అతిపెద్ద ఓడరేవు ఈ దీవిలోనే ఉన్నాయి. రెండో అతిపెద్ద దీవి ప్రాస్లిన్‌. విస్తీర్ణం 40 చ.కి.మీ. ఇక్కడ కూడా విమానాశ్రయం, ఓడరేవు ఉన్నాయి. అన్ని వసతులతో అనుకూలంగా ఉంటుందని
ఆన్సే లాజియో తీరంలో పాలమీగడని తలపించే తెల్లని ఇసుకా, వెండిరంగులో మెరుస్తున్న గ్రానైట్‌ రాళ్లూ, దట్టంగా అలుముకున్న పచ్చని చెట్లూ స్వచ్ఛ సముద్ర జలాలతో అలరారుతోన్న బీచ్ చూడదగ్గవి. అక్కడి సాగరజలాలు పురాణాల్లోని పాలసముద్రాన్ని తలపిస్తాయి.
అక్కడి నుంచి మరపడవలో ఐదు నిమిషాలు ప్రయాణించి క్యూరియస్‌ దీవికి చేరుకోవచ్చు. కేవలం చదరపు కి.మీ. విస్తీర్ణం గల ఈ దీవి, సీషెల్స్‌లోని అతి సుందర పర్యటక ప్రదేశం. అందులోకి ప్రవేశించాలంటే 200 సీషెల్స్‌ రూపాయలు(సుమారు వెయ్యి రూపాయలు) చెల్లించాలి. భూతల స్వర్గంగా పేరొందిన ఈ దీవి, సీషెల్స్‌కే ఆభరణాలుగా చెప్పుకోదగ్గ నల్లని చిలుక, అతిపెద్ద తాబేలు, కోకోడెమెర్‌ చెట్లకీ ప్రసిద్ధి.
సుమారు పది అడుగుల పొడవూ వెయ్యి కిలోల బరువూ ఉండే అల్డాబ్రా తాబేళ్లు ఇక్కడే కనిపిస్తాయి. చూడ్డానికి భయంకరంగా ఉన్నా ఎంతో స్నేహపూర్వకంగా ఉంటాయి. సాధారణంగా తాబేళ్లన్నీ గుడ్లు పెట్టడానికీ పొదగడానికీ మరుగు ప్రదేశాలను ఎన్నుకుంటాయి. కానీ అల్డాబ్రా జెయింట్‌ తాబేళ్లు పగటి వెలుగులో గుడ్లు పెట్టి, వాటిని సంరక్షిస్తాయి. వందల సంఖ్యలో తాబేళ్ల పిల్లలు ఒడ్డు నుంచి సముద్రంలోకీ సముద్రం నుంచి ఒడ్డుకీ తిరుగుతుంటే ఆ దృశ్యం చూసేవాళ్లకి కనులపండగే. తరవాత అక్కడి పార్కులో నల్లని ఈకలతో కనిపించాయి చిలుకలు. ఈ నల్లని చిలుక సీషెల్స్‌ జాతీయ పక్షి. ఈ పక్షి, క్యూరియస్‌ దీవిలోనే ఎక్కువగా కనిపిస్తుంది.
మార్నె జాతీయ వనం..... మహె దీవి భూభాగంలో ఇది 20 శాతం ఉంటుంది. అక్కడ రకరకాల చెట్లు కనువిందు చేస్తాయి. పైగా అక్కడ అన్నీ ఎత్తుపల్లాలే. ఎత్తైన కొండా, అక్కడి నుంచి కిందకు నిటారైన లోయా, లోయ అంచునే సముద్రమూ... ఎంతో ఆహ్లాదంగా అనిపించిందా ప్రాంతం. ఇక్కడే తేయాకు తోట ఉండటం విశేషం.
సీషెల్స్‌లో చూడదగ్గ మరో విశేషం ప్రెగేట్‌ దీవి. అది ప్రపంచ సంపన్నుల స్వర్గం. అక్కడి రిసార్టులో ఒక్కరోజుకి సుమారు మూడు లక్షల రూపాయల పైనే ఉంటుంది. మహె విమానాశ్రయం నుంచి హోటల్‌ వారే వచ్చి హెలీకాప్టర్‌లో తీసుకెళ్తారు.
పర్యటించటానికి అనుకూల సమయం: నవంబరు నుండి మే నెల వరకు
భారతీయ రెస్టారెంట్లు ఉన్నాయి. బడ్జెట్‌ హోటళ్ల నుంచి ఖరీదైన రెస్టారెంట్లు.... రకరకాల రుచులు అందిస్తాయి.
ఎలా వెళ్లాలి ? ముంబయి నుంచి సీషెల్స్‌లోని మాహె విమానాశ్రయానికి నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులు ఉన్నాయి.
ముంబయి నుంచి ప్రైవేట్‌ టూర్‌ ఆపరేటర్లు సీషెల్స్‌ ప్యాకేజీలు నిర్వహిస్తున్నారు. ధర రూ.75వేల నుంచి మొదలవుతాయి. సీషెల్స్‌ లో చూడవలసినవి....ఆల్డాబ్రా అటోల్‌ - ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఈ పగడాల దీవి తాబేళ్లకు ఆవాసం. ప్రాస్లిన్‌ బీచ్‌ (ఇక్కడ తీరంలోని ఇసుక.. ముఖానికి రాసుకునే పౌడర్‌లా మెత్తగా ఉంటుంది), మాహె నగరం, సెయింట్‌ అన్నే నేషనల్‌ మెరైన్‌ పార్క్‌ సీషెల్స్‌ నేషనల్‌ పార్క్‌

>