telugukiranam

Indonisia Tourism…ఇండోనేషియా టూరిజం...

Indonisia Tourism…ఇండోనేషియా టూరిజం...
Indonisia  tourism ఇండోనేసియా దేశం వేల ద్వీపాల సమూహం. కానీ జనావాసానికి అనుకూలంగా ఉండేవి పదుల సంఖ్యలోనే ఉన్నాయి. వాటిలో కూడా ప్రపంచాన్ని ఆకర్షించేవి కొన్నిమాత్రమే. అందులో ప్రధానమైన ద్వీపం బాలి. పసిఫిక్‌, హిందూ మహాసముద్రాల అంచున ఉన్న బాలీలో విశేషాలెన్నో. ఇండోనేషియా ముస్లిం దేశం. ఈ దేశంలో 90 శాతం ముస్లిం జనాభా.. కానీ బాలీ దీవిలో 90 శాతం జనాభా హిందువులే! వీరంతా సనాతన ఆచారాలను పద్ధతిగా పాటిస్తారు. ఇండోనేషియా రాజధాని జకార్తా. వీరి భాష ఇండోనేషియన్‌ కరెన్సీ రుపయా.
ఇండోనేషియా... ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీప దేశం. ఆగ్నేయ ఆసియాలోని ఈ ద్వీప దేశంలో మొత్తం 17,800 ద్వీపాలుంటాయి. ఇందులో సగం ద్వీపాలకు ఇంకా పేర్లే లేవు. హిందూ, పసిఫిక్‌ సముద్రాల మధ్య ఉందిది. ప్రపంచంలో అతి పెద్ద పువ్వు ‘రాఫ్లీసియా ఆర్నాల్డి’ని ఇక్కడ చూడొచ్చు. ఈ పూల రేకులు ఒకటిన్నర అడుగుల పొడవు, అంగుళం మందంతో ఉంటాయి.
ఇండోనేసియాలో ప్రత్యేకంగా చూడదగ్గది బాలీ ద్వీపం..... బాలీలో వీధివీధినా హిందూ దేవాలయాలు కనిపిస్తాయి. అందుకే బాలి ‘దేవుళ్ల ద్వీపం’గా గుర్తింపు పొందింది. చాంద్రమానాన్ని అనుసరించి పండగలు, పబ్బాలు జరుపుకుంటారు. అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఉపవాసాలు ఉంటారు. ప్రతి రోజూ దైవానికి కృతజ్ఞతలు చెబుతారు. ‘నిన్నటిరోజు ప్రశాంతంగా గడిచినా, నేడు సంతోషంగా ఉందన్నా.. నీ దయే’ అంటూ వారి ఇష్ట దైవానికి ప్రత్యేకమైన కానుక సమర్పిస్తారు. అరటి, కొబ్బరి, బాదం ఆకులతో అందమైన దొప్పలను చేసి.. అందులో పూలు, వక్కలు పెట్టి.. అగరొత్తులు వెలిగించి.. ఇంటి ముందు ఉంచుతారు. దుకాణాల ముందు, వీధి కూడలిలో, ఆలయం మెట్ల మీద ఇలా ప్రతి చోటా ఇవి కనిపిస్తాయి. వీటిని స్థానికంగా ‘కనంగ్‌-సారి’ అని పిలుస్తారు. ఇదొక్కటి చాలు బాలి ప్రజలు ఎంత సంప్రదాయవాదులో చెప్పడానికి.
ఆతిథ్యం అద్భుతం..
ఏటా బాలిని సందర్శించే పర్యాటకుల సంఖ్య 70 లక్షల పైమాటే. స్థానికుల ఆచారాలు, విశ్వాసాలను గౌరవించే పర్యాటకులను ఆదరిస్తారు ఇక్కడి వారు. ఇంట్లో ఆశ్రయమిస్తారు. దేశీయ రుచులను రుచి చూపిస్తారు. బాలీలో కుటుంబంతో లేక స్నేహితులతో సరదాగా గడపవచ్చు. ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించవచ్చు. సాహస క్రీడల్లో పాల్గొనవచ్చు.
క్లబ్బుల్లో, పబ్బుల్లో ఆనందంగా గడపవచ్చు. యూరప్‌, అమెరికా దేశాల నుంచీ కూడా బాలీకి పర్యాటకులు ఎక్కవగా వస్తారు. భారతదేశం నుంచి లక్షల్లో బాలీకి వెళ్తుంటారు.
రామాయణం ......
ఉలవటు ఆలయం బాలీలో చూడాల్సిన ప్రదేశాల్లో ముఖ్యమైనది. డెన్పసార్‌ నుంచి 31 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్రం అంచులో ఉన్న పర్వత శిఖరంపై ఉలవటు ఆలయం కట్టబడింది. సముద్రాన్ని చీల్చుకుంటూ పైకి వచ్చిన రెండు పర్వతాలు పచ్చదనంతో కనువిందు చేస్తుంటాయి. ఉలవటు ఆలయంలో ప్రధాన దైవం మహావిష్ణువు. ప్రాంగణంలో భారీ కుంభకర్ణుడి విగ్రహం ఉంటుంది. ప్రధాన ఆలయంలోకి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అనుమతిస్తారు. సూర్యాస్తమయం ఇక్కడ చూడ ముచ్చటగా ఉంటుంది.
ఉలవటు గుడి ప్రాంగణంలో ప్రతి రోజూ సాయంత్రం స్థానిక కళాకారులు రామాయణ కావ్యాన్ని నృత్యరూపకంగా ప్రదర్శిస్తారు. అద్భుతమైన వేషధారణ, అనిర్వచనీయమైన హావభావాలతో రూపకాన్ని వాళ్లు పండించే తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ రూపకాన్ని చూడటం కోసం బాలీకి వచ్చే వాళ్లూ ఉంటారు.
ఉబుడ్‌ సమీపంలో వానర సంరక్షణ కేంద్రం ఉంది. సఫారీలో తిరిగి కోతి చేష్టలను చూడొచ్చు. జాగ్రత్తగా ఉండాలి.. చటుక్కున వచ్చి పర్యాటకుల చేతిలో ఉన్న కెమెరాలు, కళ్లద్దాలు, పర్సులు లాక్కెళ్లిపోతాయి. పళ్లో, తినుబండారాలో సమర్పిస్తే.. వదిలేస్తాయి. ఉలవటు ఆలయం దగ్గర కూడా వానరమూక చిలిపి చేష్టలను చూడొచ్చు. వానర సంరక్షణ కేంద్రానికి సమీపంలోనే ఏనుగు గుహ ఉంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రవేశానికి అనుమతిస్తారు. గుహ ప్రవేశ ద్వారం చాలా చిత్రంగా ఉంటుంది. లోనికి వెళ్లాక విశాలమైన ప్రాంగణం ఉంటుంది. కొలనులు, ఆలయాలు చూడొచ్చు. ఉబుడ్‌ నగర చుట్టుపక్కలున్న పల్లెల్ని చూడాల్సిందే. కొండల్లో, గుట్టల్లో మెట్లలా మడులు ఏర్పాటు చేసి వరి పండించే తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
వరుణదేవుడి ఆలయం..
డెన్పసార్‌ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో తనహ్‌లాట్‌ ఆలయం ఉంటుంది. వరుణదేవుడి గుడి, సముద్రం అంచున ఉంటుంది. సముద్రం అలలు ఆలయం ప్రధాన ద్వారం వరకు వస్తుంటాయి. ఈ దృశ్యం మనోహరంగా ఉంటుంది. బాలీలో మరో ఆకర్షణ.. అగుంగ్‌ పర్వత సానువుల్లో ‘పుర బెసకి’ ఆలయం. దీనిని ‘మదర్‌ ఆఫ్‌ టెంపుల్స్‌’ అని పిలుస్తారు. ఈ భారీ ఆలయంలో 23 గుళ్లున్నాయి. శివుడు, విష్ణువు, సరస్వతిదేవి తదితర ఆలయాలు ఇక్కడ దర్శించుకోవచ్చు.
బాలి పర్యటనకు పెద్దగా ఖర్చుకాదు. నాలుగైదు రోజులు (త్రీస్టార్‌ అకామిడేషన్‌) పర్యటించడానికి ఒక్కొక్కిరికీ రూ.50 వేల వరకు ఖర్చు అవుతుంది. ఎక్కువమంది కలిసి వెళ్తే రూ.40 వేలల్లో చూసి రావొచ్చు.. బాలీలో వస్తువులు, ఆహార పదార్థాల ధరలన్నీ అమెరికన్‌ డాలర్ల రూపంలోనే కనిపిస్తాయి. చెల్లింపులు మాత్రం ఇండోనేషియా రుపాయాల్లోనే ఉంటాయి. మన ఒక్క రూపాయి సుమారు 215 ఇండోనేషియన్‌ రూపాయాలతో సమానం. ఒక లక్ష రూపాయలు తీసుకొని వెళ్తే.. రెండు కోట్లు వస్తాయి. మంచి భోజనం చేయాలంటే ఇండోనేషియన్‌ రూపాయాలలో యాభై వేలు సమర్పించాలి. మన కరెన్సీలో లెక్కేసుకుంటే సుమారు రూ.220 అన్నమాట. అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారికి ఇక్కడ స్కూటర్లు, బైకులు అద్దెకిస్తారు. బాలి రాజధాని డెన్పసార్‌, ఉబుడ్‌ నగరాలు ఖరీదైన రిసార్ట్స్‌కు పెట్టింది పేరు. కుటా, లెగియాన్‌, సెమిన్యక్‌, నూసాదువా, సానుర్‌ బీచ్‌లు పర్యాటకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తాయి. సముద్ర తీరాల్లో స్కూబాడైవింగ్‌, సర్ఫింగ్‌, వాటర్‌ స్కీయింగ్‌, పారా సెయిలింగ్‌, బనానా రైడ్‌ వంటి సాహస క్రీడలు జోరుగా సాగుతాయి. సముద్ర గర్భంలో రయ్‌ మంటూ దూసుకుపోయే బైకులపై ప్రయాణం రోమాంచితంగా ఉంటుంది.
పర్యటనకు ఎప్పుడు అనుకూలం...?....
ఏప్రిల్‌, మే, జూన్‌ బాలి పర్యటనకు అనుకూలం. డిసెంబర్‌, జనవరి నెలల్లో పర్యాటకుల తాకిడి అధికంగా ఉండటంతో రిసార్ట్‌ అద్దెలు ఎక్కువగా ఉంటాయి. జనవరి, ఫిబ్రవరి వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. వేసవి సీజన్‌లో ప్రైవేట్‌ టూర్‌ ఆపరేటర్లు బాలి ప్యాకేజీలు బోలెడు ప్రకటిస్తూ ఉంటారు. వీటి ధర రూ.25,000 నుంచి రూ.1,00,000 వరకు ఉంది. పర్యటన కొనసాగే రోజులు, బస ఏర్పాట్లు, ఇతర సదుపాయాలను బట్టి ప్యాకేజీ ధర ఉంటుంది.హైదరాబాద్‌ నుంచి బాలి రాజధాని డెన్పసార్‌కు సింగిల్‌ స్టాప్‌ (కౌలాలంపూర్‌) విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. టికెట్‌ ధర 11-18 వేల వరకు ఉంటుంది. విశాఖపట్టణం నుంచి సింగపూర్‌ మీదుగా విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. టికెట్‌ ధర రూ.12-20 వేల వరకు ఉంటుంది.