telugukiranam

Moorea Island / మూరియా ఐ లాండ్!

Mooriya Island / మూరియా ఐ లాండ్!
హనీమూన్ అనగానే ఏ స్విట్జర్లాండ్ కో, థాయిలాండ్ కో, మెక్సికోకో వెళ్లిపోతారు. ఫ్యామిలీ టూర్ అనేగానే అమెరికాకో, లండన్కో, ఫ్రాన్స్ కో వెళ్లాలనుకుంటారు. కానీ ఇంటర్నెట్లో పెద్దగా కనిపించని.. ప్రపంచమంతా తిరిగిన పర్యాటకులకు కూడా తెలియని ఓ భూతల స్వర్గం ఉంది. అదే మూరియా ఐ లాండ్! ఇది సౌత్ ఫసిఫిక్ ద్వీపసముదాయంలో ఫ్రెంచ్ పాలినేసియాలో ఉన్నది. మూరియా అందాల్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఇక్కడి అనుభూతుల్ని ఆస్వాదించడానికి సమయం చాలదు! జీవితాంతం నిలిచిపోయే హనీమూన్ అనుభవం కావాలనుకునేవారు, జీవితమంతా దాచుకునే అనుభూతిని సొంతం చేసుకోవాలనుకునేవారికి చిరునామా మూరియా.
ఆస్టేలియాకు అవతలి వైపున ఉండే దక్షిణ పసిఫిక్ సముద్రంలో ఫ్రెంచ్ పొలినేసియాలోని ఎత్తయిన ప్రాంతంలో ఉంటుంది మూరియా దీవి. చుట్టూ సముద్రం.. మధ్యలో ఎత్తయిన పర్వతాలు.. మధ్యలో బ్యాక్వాటర్ (నిశ్చలజలాలు)... అత్యద్భుతమైన ప్రకృతి సౌందర్యం నడుమ కొలువై ఉంటుంది మూరియా. దీవి అందాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మిగతా హనీమూన్ ప్రదేశాల్లో లాగా రణగొణ ధ్వనులుండవు. కాలుష్యం ఉండదు. హడావుడి ఉండదు. అంతా ప్రశాంతమైన వాతావరణం. ఎత్తయిన పర్వతాల మీదికి చేరుకోవచ్చు.
దట్టమైన అడవులు చూడొచ్చు. సుందరమైన బీచుల్లో ఆటాడుకోవచ్చు. సముద్రంలో వాటర్ స్పోర్ట్స్ ఆడొచ్చు. బ్యాక్ వాటర్లో నిర్మించిన ‘వాటర్ బంగ్లా’ల్లో విడిది చేయొచ్చు. ఇంకా ఎన్నెన్నో విశేషాల్ని ఆస్వాదించవచ్చు. అంతర్జాతీయ పర్యాటకులు తరచుగా విచ్చేసే ఈ ప్రాంతంలో ఎన్నో లగ్జరీ హోటళ్లున్నాయి. ప్రతి హోటల్.. ప్రత్యేకంగా వాటర్ బంగ్లాలను నిర్మించింది. రెండు మూడు రోజులు వాటిలోనే బస చేయవచ్చు. ఇక్కడి బీచ్లలో సేదదీరడాన్ని పర్యాటకులు ఎంతగానో ఆస్వాదిస్తారు. కొన్ని చోట్ల ఇసుక బీచ్లుంటాయి. ఇంకొన్ని చోట్ల నల్లమట్టి బీచ్లుంటాయి. సముద్రంలో స్కూబా డైవింగ్ చేయడం ఇక్కడ బాగా పాపులర్. దీంతో పాటు మరికొన్ని వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి.
గ్లాస్ బోట్లో విహారం!
నేల మీది అందాలే కాదు.. నీటిలోపలి అందాలు కూడా చూపించడం ఇక్కడి ప్రత్యేకత. సముద్ర విహారం కోసం ఇక్కడ ప్రత్యేకంగా గ్లాస్ బోట్లను ఏర్పాటు చేశారు. వీటిలోకి ఎక్కితే సముద్రం లోపల ఎంతో లోతులో ఉండే సముద్ర జీవుల అందాల్ని బోట్ నుంచే ఆస్వాదించవచ్చు. ఇది అద్భుతమైన అనుభూతిని మిగుల్చుతుందంటారు పర్యాటకులు. సూర్యోదయం, అస్తమయం సమయంలో బ్యాక్వాటర్లో విహరిస్తూ ఇక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించడం గొప్ప అనుభూతినిస్తుంది.
కమ్మని వంటలు...
ప్రపంచంలో ఎక్కడా రుచిచూడని కొత్త వంటకాలు మూరియాలో దొరుకుతాయి. సముద్రంలో దొరికే ఎన్నో జీవులతో ఇక్కడ నాన్వెజ్ డిష్లు వండుతారు. తాహితియన్ వంటలు రుచి చూస్తే ఎప్పటికీ మరిచిపోలేమంటారు.
మూరియాకు పొడి వాతావరణం ఉన్నపుడు వెళ్లడం మంచిది. మే నుంచి అక్టోబరు వరకు ఇక్కడ వాతావరణం పొడిగా ఉంటుంది. మిగతా సమయాల్లో వర్షాలు, చలి వాతావరణం ఇబ్బంది పెడతాయి. మూరియా దీవుల్లో ఎక్కువగా తాహితియన్, ఫ్రెంచ్ భాషలు మాట్లాడతారు. కొందరు ఇంగ్లిష్ గైడ్లు కూడా అందుబాటులో ఉంటారు. మూరియాలోని హోటళ్లు టూరిజం ప్యాకేజీలు అందిస్తున్నాయి. ఇంటర్నెట్లో ఆయా హోటళ్ల వెబ్సైట్లలోకి వెళ్లి పూర్తి సమాచారం తెలుసుకుని ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు.
పోలినేసియా అనేది కొన్ని దీవుల సముదాయం. దక్షిణ పసిఫిక్ సముద్రంలో ఉన్న కొన్ని దీవులు కలిసి పోలినేసియా ఏర్పడింది. వీటిలో మూరియా ఒకటి. ఈ దీవి హృదయాకారంలో ఉంటుంది. కొన్ని వేల ఏళ్ల క్రితం, దక్షిణాసియా నుంచి పోలినేసియాకు కొందరు వలసకు వచ్చారు. వాళ్లు తమకు అనుకూలమైన నివాసం కోసం వెతుకుతూ, చివరకు మూరియా ఐల్యాండ్లో స్థిరపడ్డారు. అప్పట్లో వారు దీన్ని మారీ అనేవారు. అంటే పిరమిడ్ ఆకారంలో ఉన్న రాయి అని అర్థం. ఐతే 1606లో ఈ దీవి గురించి ప్రపంచానికి తెలిసిందని చరిత్ర చెబుతోంది. కెప్టెన్ జేమ్స్ కుక్ మూరియా మీదుగా వెళ్తూ, విశ్రాంతి కోసం తాహితి ప్రాంతంలో బస చేశాడట. అతడి ద్వారానే ఇలాంటి ఒక దీవి ఉందని అందరికీ తెలిసిందట. ఆ తర్వాత ఎంతోమంది ఈ దీవిని అందాలను చూసి మనసు పారేసుకున్నారు.
ఎలా వెళ్లాలి?
మూరియా ఐల్యాండ్లోని తాహితీలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇండియా నుంచి కనెక్టెడ్ ఫ్లైట్ల ద్వారా తాహితికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి కొంత దూరం రోడ్డుమీద ప్రయాణిస్తే, సముద్రపు తీరం వస్తుంది. అక్కడి నుంచి ఏ ఐల్యాండ్కు వెళ్లాలన్నా ఫెరారీల (నౌకలు) మీద వెళ్లిపోవచ్చు. చార్లెస్ డార్విన్ అంతటి వ్యక్తి కూడా ఈ దీవిని ‘పిక్చర్ ఇన్ ద ఫ్రేమ్’ అంటూ పొగిడాడంటే అర్థం చేసుకోవచ్చు. మూరియా దీవిలో గడపడం ఓ గొప్ప అనుభూతి. ఇది ప్రేమికులకు ఇష్టమైన ప్రదేశం. కొత్తగా పెళ్లయిన వాళ్లకు ఆనందంగా గడిపేందుకు అనువైన ప్రదేశం. అందుకే దేశ విదేశాల నుంచి కొత్త జంటలు హనీమూన్కి వస్తుంటాయి. ఆర్థర్ ఫ్రామర్ అనే రచయిత తాను రాసిన ట్రావెల్ గైడులో మూరియాను ప్రపంచంలోనే అత్యంత అందమైన దీవిగా అభివర్ణించాడు.