telugukiranam

Tanzania Tourism… ….టాంజానియా పర్యాటకం

Tanzania Tourism… ….టాంజానియా పర్యాటకం
టాంజానియా తూర్పు ఆఫ్రికా దేశం. టాంజానియా రాజధాని డొడోమా. విస్తీర్ణం 9,45,087 చదరపు కిలోమీటర్లు కరెన్సీ టాంజానియన్ షిల్లింగ్ అధికారిక భాష స్వాహిలి. అయితే ఇంగ్లిష్ కూడా ఎక్కువగా మాట్లాడతారు.
పర్వతాలను, లోతైన లోయల్నీ విశాలమైన గడ్డి మైదానాల్నీ సుందర సరస్సులను వాటి మధ్యలో జీబ్రాల గుంపుల్నీ చిరుతపులుల గుంపులను, ఏనుగులను . అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్నీ అడవి జంతువులను బాగా దగ్గరగా చూడాలంటే ఆఫ్రికాలోని టాంజానియా అటవీ ఉద్యానవనాల్లో సఫారీ ఈ అవకాశం కల్పిస్తుంది
హైదరాబాద్‌ నుంచి విమానంలో టాంజానీయాలోని దారుస్సలాం నగరానికి వెళ్లవచ్చు. వీరి భాషలో దారుస్సలాం అంటే స్వర్గానికి ద్వారం అని అర్థం. ఇది దేశంలోని అతిపెద్ద నగరం. వీధులన్నీ శుభ్రంగా అందంగా ఉంటాయి.. ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెంటీగ్రేడుని మించదు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఇక్కడ 30 శాతం భూమిలో జాతీయ12 పార్కులు , 38 వన్యమృగ సంరక్షణ కేంద్రాలు కలవు. రకరకాల అడవి మృగాలు ఇక్కడ దాదాపుగా నలభై లక్షలకు పైగా ఉన్నాయి. చదరపు కిలోమీటరుకు అత్యధిక సంఖ్యలో మృగాలున్న దేశాల్లో ఇది మొదటిది. ఎక్కువ సంఖ్యలో ఏనుగులున్న దేశాల్లో ఇదీ ఒకటి. ఇక్కడి రువాహ్ నేషనల్ పార్కులో వీటి సంఖ్య అత్యధికం. ప్రపంచంలోనే అతి పెద్ద పీతల జాతైన కోకోనట్ క్రాబ్లు ఈ దేశంలో ఎక్కువగా కనిపిస్తాయి.
టాంజానీయాలో లోని రెండు ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన పర్యాటక ప్రాంతాలు. అవి ఆఫ్రికా ఖండంలో అతి ఎత్తయిన పర్వతం మౌంట్ కిలిమంజారో మరియు Serengeti లాంటి జాతీయ పార్కులు. మనం క్రికెట్ అంటే ఎక్కువగా ఇష్టపడినట్లు వీరంతా ఫుట్బాల్, బాక్సింగ్, రగ్బీలను ఇష్టపడతారు.
వర్షాకాలం మొదలుకాగానే ఇక్కడి నుంచి 20 లక్షలకుపైగా వన్యమృగాలు కెన్యాకు వలస వెళతాయి. దీన్నే ‘ది గ్రేట్ మైగ్రేషన్’ అంటారు.
చిరుతలు చెట్లెక్కడం మనం చూస్తుంటాం. కానీ ఇక్కడి లేక్ మన్యారా నేషనల్ పార్కులో చెట్లెక్కే సింహాల జాతి ఉంది. ఇలాంటివి ప్రపంచం మొత్తంలో ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి. ఇవి పైకెక్కడమే కాదు అచ్చం కోతుల్లా అక్కడే నిద్రిస్తాయి.
మన్యరా జాతీయపార్కు
అరుషలో మన్యరా జాతీయపార్కు టోల్‌గేటు దగ్గర ఐడెంటిఫికేషన్‌ చూపించి, అనుమతి తీసుకోవాలి.
ఈ పార్కులో గుంపులు గుంపులుగా తిరిగే జిరాఫీలను, బబూన్లు(నల్లమూతి కోతులు), అడవి పందులూ, లేళ్ల గుంపులను చూడవచ్చు.
అన్ని జంతువుల్లోకెల్లా పిరికివి అడవి పందులే. పందులు శబ్దం వినగానే పరుగు లంకించుకుంటాయి. ఇక్కడే ఉన్న సరస్సు దగ్గర ఉన్న పక్షుల్లో ఎన్నోరకాలు... రంగు రంగుల .. పిచ్చుకల నుంచి పెలికాన్ల దాకా . చిలుకల నుంచి రాబందుల వరకూ చూడవచ్చు. సరస్సునిండా తామరలు విచ్చుకున్నట్లున్న గులాబీరంగు పెలికాన్‌లను కనువిందు చేస్తాయి
మన్యరా సరస్సు చెట్లెక్కే సింహాలకు ప్రత్యేకం. ఈ రకమైన జాతి ప్రపంచం మొత్తమ్మీద ఈ ఒక్కచోటే కనిపిస్తుంది పర్యాటకుల కోసం సాయం సమయంలో స్థానికుల సాంస్కృతిక కార్యక్రమాలూ ఆక్రోబాటిక్‌ ప్రదర్శనలు ఉంటాయి.
గోరోన్గోరో.. గోరోన్గోరో వెళ్లే దారిలో రోడ్డుకు ఆనుకుని ఓ వైపు పెద్ద లోయ, లోయలో నుంచి రోడ్డుకన్నా ఎత్తుగా పెరిగిన పెద్ద చెట్లు, రోడ్డుకి రెండోవైపు కేవలం మూడు నాలుగు అడుగుల ఎత్తులో గోధుమరంగు పొదలతో నిండిన పెద్ద మైదానం. పచ్చని ప్రకృతిలో ప్రయాణం ఆహ్లాదకరంగా సాగుతుంది.
గోరోన్గోరో క్రేటర్‌ ...ఇది పెద్ద అగ్నిబిలం. సుమారు 3.4 మిలియన్‌ సంవత్సరాల క్రితం భారీ విస్ఫోటం సంభవించి, ఓ పెద్ద అగ్నిపర్వతం పేలిపోయిందనీ అది పేలినచోట ఓ పెద్ద గుంత ఏర్పడిందనీ చెబుతారు. బిలం అంచుమీదుగా ప్రయాణించి వ్యూపాయింట్‌ దగ్గర ఆగి బిలాన్ని చూడవచ్చు. ఈ బిల వైశాల్యం వైశాల్యం 260 చదరపు మైళ్లు. పైనుంచి కిందకి వెళ్లాలంటే 4 కిలోమీటర్లు ప్రయాణించాలి. బిలంలో గుండ్రంగా తిరుగుతూ వెళ్తుంది రోడ్డు. బిలం లోపలకి టెలీస్కోపులో చూస్తే జంతువులు కనబడుతుంటాయి.
ఆ బిలం ఏర్పడిన కొన్ని సంవత్సరాలకు అక్కడ పడ్డ వర్షం నీళ్లు, బయటకు పోయే దారిలేక ఓ సరస్సు ఏర్పడిందనీ దానివల్లే అక్కడ జంతువులూ మనుషులూ చేరారనీ అంటుంటారు. ఆదిమ మానవుడి అడుగుజాడలు అక్కడ కనిపించాయనీ, వాటిని మ్యూజియంలో భద్రపరిచామనీ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. యునెస్కో ఈ ప్రాంతాన్ని ప్రపంచ సాంస్కృతిక సంపదల్లో ఒకటిగా భావించి కాపాడుతోంది. బిలం అడుగువరకూ వెళితే విశాలమైన మైదానంలోకి ప్రవేశించినట్లుంటుంది. చిన్న చిన్న సరస్సులు చాలా ఉంటాయి.
వేలకొద్దీ జింకలూ మరోవైపు వందలకొద్దీ జీబ్రాలు. మరోవైపు అడవి దున్నలూ, బైసన్లు. సరస్సుల దగ్గర రకరకాల పక్షులు కనబడతాయి. ఇక్కడే ఓ పెద్ద ఏనుగు అన్నింటికన్నా ముందుకు నడుస్తుంటే మిగిలిన ఏనుగులు దాని వెనకే పిల్లలతో సహా వెళుతుంటాయి. అన్నింటికన్నా ముందున్న ఏనుగు దారి సురక్షితమని నిర్ణయించుకున్నాక మిగతా వాటిని వెనక అనుసరించమంటుంది
నక్కలూ, తోడేళ్ల గుంపులు కనిపిస్తాయి. క్రేటర్‌ అంచుపైనే రిసార్టులు ఉంటాయి. వీటిని తీసుకుంటే తనివితీరా క్రేటర్‌ అందాలు చూడవచ్చు.
సెరెంగెటి జాతీయ ఉద్యానవనం...
సెరెంగెటి అరణ్యంలో సింహాలు గుంపులుగా తిరుగుతాయి ఈ అడవిలో 80 సింహాలు ఉన్నాయట. ఎక్కువగా నిద్రపోతుంటాయవి. ఒక్కో సింహం రోజుకి సుమారు 22 గంటలు నిద్రపోతుందట. హైనాలు., ఎనిమిది అడుగుల ఎత్తులో ఉన్న ఆస్ట్రిచ్‌లనూ చూడవచ్చు. అవి పరిగెడుతుంటే తమాషాగా అనిపిస్తుంది.
ఇక్కడ ఉన్న నీళ్లలో వందలాది హిప్పోలు సేదతీరుతుంటాయి. ఇవి ఎక్కువసేపు నీటిలోనే ఉంటాయి. వాటిని చూస్తుంటే వాగులో పెద్ద బండరాళ్లులాగా ఉంటాయి. హిప్పోలు ఒక్కొక్కటీ 15 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పులతో ఒక్కోటీ 3 టన్నుల బరువుతో చిన్నసైజు ఏనుగంత ఉంటాయి. వీటికి పుట్టిన పిల్లలు 75 కిలోల బరువు ఉంటాయి. మాంసాహారులు కాకపోయినా వీటికి కోపం ఎక్కువ. దగ్గరకు వచ్చిన జంతువుల్ని నోటికి చిక్కించుకుందంటే అది ముక్కలై బయటకు రావాల్సిందే.