కావలిసినవి
పచ్చ పెసలు : పావు కిలో
బియ్యం : 2 టేబుల్ స్పూన్లు
మెంతులు : 1 టేబుల్ స్పూను
ఉల్లిపాయలు : రెండు
పచ్చిమిర్చి : 4 కాయలు
జీలకర్ర : 1 టేబుల్ స్పూన్
అల్లం : కొద్దిగా
తయారు చేసే పద్ధతి
దోసెలు కావల్సిన ముందురోజు రాత్రి పెసలను రాళ్ళు, మట్టిగడ్డలు లేకుండా శుభ్రం చేసుకొని నానబెట్టుకోవాలి. మెంతులు, బియ్యాన్ని కూడా వీటితో పాటు నానబెట్టుకోవాలి.
ఉదయాన్నే పెసలలోని నీరు వంపి శుభ్రంగా కడిగిన తరువాత మిక్సీలోగానీ, గ్రైండర్ లోగాని మొత్తగా రుబ్బుకోవాలి. గ్రైండ్ చేసేటపుడు తగినంత నీరు పోయాలి. మొత్తగా గ్రైండ్ చేసిన తరువాత ఈ పిండిని ఒక పాత్రలోనికి తీసుకోవాలి.
స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడెక్కిన తరువాత నూనెతో తుడిచి దోసెలు వేసుకోవచ్చు. వేడెక్కిన పెనం మీద కొద్దిగా నీరు చిలకరించి తుడిస్తే దోసెలు పలుచగా వస్తాయి. పెనం మీద పిండి పరచిన తరువాత కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి కొద్దిగా నూనె వేసి కాల్చుకోవాలి. ఇవన్నీ వేసిన తరువాత దోసెను మధ్యలోకి మడచి రెండు వైపులా కాలిన తరువాత తీయాలి.
ఉల్లిపాయలు, జీలకర్ర, మిర్చి వేయకుండా పైన ఉప్మా పెడితే ఉప్మా పెసరట్టవుతుంది.
ఈ దోసెలకు అల్లం చట్నీ, పొదీనా చెట్నీ, సెనగపప్పు చెట్నీ, వెరుశెనగ గుండ్ల చట్నీ లేక వెరుశెనగ గుండ్లు, శెనగపపప్పు రెండూ కలిపిన చట్నీ టమాటో చెట్నీ మంచి కాంబినేషన్. డయాబెటిస్ వారికి మినప అట్లు కంటే పెసరట్లు మంచిది. కానీ చట్నీమాత్రం టమాటో, పొదీనా వాడితే మంచిది.