header

Fenugreek Seeds

మెంతులు
fenugreek seeds

మనదేశంలో మెంతులు ఎక్కవగా వాడరు. కానీ వీటి ప్రాధాన్యతను తెలుసుకుంటే వంటలలో తప్పనిసరిగా వాడతారు. మెంతులలో కరిగే పీచు ఎక్కువ. మెంతులు తినటం వలన జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. దానిద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా పెరుగుతాయి. కనుక డయాబెటిస్ వారు క్రమం తప్పకుండా మెంతులను వాడడం వలన కొంతవరకు డయాబెటిస్ అదుపులో ఉంటుంది. కొలస్ట్రాల్ ను తగ్గించడంలో కూడా మెంతులు సహకరిస్తాయి. ముఖ్యంగా లోడెన్సిటీ లిపోప్రోటీన్ ను తగ్గిస్తాయి. కొలస్ట్రాల్ ను, ట్రైగ్లజరాయిడ్స్ ను శరీరం గ్రహించకుండా అడ్డగిస్తాయి. మెంతులలో ఉండే అత్యధిక పీచువల్ల మలబద్ధకం రానివ్వదు. డయేరియా, అజీర్ణాలను అరికడుతుంది. మెంతిపిండిని ఇంట్లో తయారు చేసుకొని చక్కని స్క్రబ్ లేదా మాస్క్ గా ఉపయోగించుకోవచ్చు. క్రమం తప్పకుండా వాడుతూవుంటే చర్మానికి మెరుపుదనం వస్తుంది. మృతకణాలు తొలగిపోతాయి. నీళ్లలో మెంతులను నానబెట్టి వీటిలో శెనగపిండి, పెరుగుకలిపి చర్మంపై రాసుకోవాలి. నల్లని వలయాలు తగ్గుతాయి. సూర్యకిరణాలవల్ల కమిలిన చర్మానికి సరైన చికిత్స. శిరోజాల పెరుగుదలకు కూడా మెంతులు సహకరిస్తాయి. పొడి లేక నానబెట్టి రోజు క్రమం తప్పకుండా తినటం వలన శిరోజాలకు మేలు జరుగుతుంది. మెంతిపిండి చుండ్రును అరికడుతుంది. ఒక పూర్తి రాత్రి మెంతులను నీటిలో నానబెట్టి వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని తలకు పట్టించి అరగంట ఆగి కడిగివేయాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తుంటే చుండ్రుసమస్య తగ్గుతుంది. మన తెలుగు వంటలలో దోశెలలో రుచికోసం, రంగుకోసం మెంతులు కలుపుతారు. కానీ గోధుమ, శెనగపిండి, రాగిపిండిలతో చపాతీలు, పరోటాలు, ఇడ్లీ పిండిలో, ప్యాన్ కేక్స్ చేసేటపుడు కొద్దిమెతాదులో మెంతిపిండి కలిపితే (ఎక్కువ కలిపితే చేదు వస్తుంది) పీచుశాతం పెరిగి జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రతివారు క్రమంతప్పకుండా మెంతులను తినవచ్చు. రాత్రంతా మెంతులను నానబెట్టి ఉదయం పూట ఏమీ తినకుండా ఆ నీటిని త్రాగవచ్చు. తరువాత కనీసం ఒక అరగంటసేపు ఏమీ తినరాదు. మామూలుగా ఒక టీస్పూన్ మెంతులు తినవచ్చు. ఎలర్జీ కలవారు డాక్టర్ సలహాపై వీటిని వాడవలెను