header

Inguva - Asafoetida

ఇంగువ

ఫెరులా జాతి మొక్కల తల్లి వేరు నుంచి స్రవించే ఒక రకమైన జిగురే ఇంగువ. ఈ జిగురును సేకరించి శుభ్రం చేస్తారు. ఈ మొక్కలు ఆఫ్ఘనిస్తాన్, భారతదేశంలో ఎక్కువ. పోషకాల కన్నా ఇందులో ఉండే అంబెల్లి ఫెరోన్, ఫెరూలిక్ ఆమ్లాలతో కూడిన నూనె, జిగురుల వలన దీనికి ఔషధ గుణాలు ఎక్కువ. వీటివలనే ఒకలాంటి వాసన రుచిని కలిగి ఉంటుంది.
పచ్చిగా ఉన్నపుడు కంటే దీనిని వేడి నూనె లేదా నెయ్యిలో వేసినపుడే కమ్మటి వాసన వస్తుంది. అందుకే ఇంగువ పోపు చేర్చిన పప్పు కూర రుచి తెలిసిన వారు ఇంగువ లేకండా కూరలు ఇష్టపడరు. పప్పు కూరల కారణంగా గ్యాస్ చేరకుండా ఉండేందుకే ఇంగువ తప్పనిసరి. ప్రాచీన కాలం నుండి వైద్యంలో దీనిని వాడుతూనే ఉన్నారు. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. కడుపులోనూ ఇతర్రతా అవయవాలలో తలెత్తే మంటలను తగ్గిస్తుంది.
అజీర్ణానికి మంచి మందు. కూరల పోపులలో తప్పక వేస్తే పొట్టలో గ్యాస్ చేరినా పురుగులు ఉన్నా, మలబద్ధకం ఉన్నా, జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది.
అజీర్తి మరీ ఎక్కువగా ఉంటే నాలుగైదు చిన్న ఇంగువ ముక్కలు లేదా అర టీ స్పూను పొడిని అరకప్పు నీటిలో కలుపుకుని తాగితే వెంటనే తగ్గుతుంది.
చిటికెడు ఇంగువపొడిని మజ్జిగలో కలిపి తీసుకుంటే గ్యాస్ తగ్గుతుంది. గ్యాస్ సంబంధిత మందులలో ఇంగువ తప్పకుండా ఉంటుంది.
నెలసరిలో వచ్చే నొప్పిని ఇతర సమస్యలను తగ్గిస్తుంది.
కాస్త ఇంగువలో తేనె, అల్లంపొడి కలిపి తీసుకుంటే శ్యాసకోశ సంబంధ వ్యాధులన్నీ తగ్గుతాయి. గొంతులోనూ ఛాతీలోనూ పేరుకున్న కఫాన్ని తగ్గిస్తుంది. పొడిదగ్గు, కోరింత దగ్గు, బ్రాం కైటీస్, ఆస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధులను అరికడుతుంది.
మధుమేహులకు మందుగా పనిచేస్తుంది. క్లోమగ్రంధిలోని కణాలను ప్రేరేపించి ఇన్సులిన్ ఉత్పత్తి జరిగేలాగా చేసి రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని తగ్గిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ వెంటనే తగ్గాలంటే కాకరకాయ కూరని ఇంగువ చేర్చి వండి తింటే ఫలితం ఉంటుంది. లేదంటే రోజూ రెండు స్పూన్ల కాకరకాయ రసంలో పావుటీ స్పూను ఇంగువపొడి కలుపుకుని తాగితే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
హిస్టీరియా వచ్చిన వారికి ఇంగువ వాసన చూపిస్తే ఫలితం ఉంటుంది.
కాస్త ఇంగువను నీళ్ళలో కలిపి తాగితే మైగ్రయిన్ తలనొప్పి తగ్గుతుంది. పుండ్లనీ గాయాలనీ సైతం తగ్గించగల శక్తి ఇంగువకు ఉంది. ఇంగువను టింక్చర్ లా వాడితే త్వరగా తగ్గినట్లు ఆధారాలు ఉన్నాయి. దీనినుంచి వచ్చే ఘాటైన వాసన వలన క్రిమి కీటకాలు దరిచేరవు.
గర్భిణీ స్త్రీలు దీనిని వాడకూడదు. మిగిలిన వారు దీనిని తగు మోతాదులో వాడాలి.