కరక్కాయను వంటల్లో వాడకపోయినా, ఇంటింటా చిట్కా వైద్యాల్లో విరివిగా వాడతారు. కరక్కాయల్లో చాలా రకాలు ఉన్నాయి. భారత్, నేపాల్, భూటాన్, శ్రీలంక, చైనా, వియత్నాం, మలేసియా తదితర ఆసియా దేశాల్లోని అటవీ ప్రాంతాల్లో ఇవి విరివిగా లభిస్తాయి. ఆయుర్వేద వైద్యంలోను, వివిధ దేశాల సంప్రదాయ వైద్యంలోనూ కరక్కాయలను ఉపయోగిస్తారు.
పోషకాలు: పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
ఆయుర్వేదంలోను, టిబెటన్ సంప్రదాయ వైద్యంలోనూ కరక్కాయను సర్వరోగ నివారిణిగా పరిగణిస్తారు. దగ్గు, ఉబ్బసం వంటి బాధల నుంచి ఉపశమనానికి కరక్కాయను అరగదీసి, తేనెలో కలిపి వాడతారు. ఉసిరికాయ, తానికాయలతో సమపాళ్లలో కరక్కాయలను కలిపి తయారు చేసే త్రిఫల చూర్ణం జీర్ణకోశ సమస్యలకు, మలబద్ధకానికి, మూలవ్యాధికి చక్కని ఔషధంగా పనిచేస్తుంది.