header

Vasa/ వస

Vasa/ వస

ఎక్కువగా మాట్లాడేవాళ్లను వసపిట్టలనీ, వాళ్లకు చిన్నప్పుడు బాగా వసబోసి ఉంటారనీ అంటుంటారు. కానీ వస అనేది ఆయుర్వేదంలో అత్యంత శక్తిమంతమైన ఔషధం. దీని సంస్కృతనామం వచ. అదే తెలుగులో వసగా మారింది. గడ్డి జాతికి చెందిన ఈ ఔషధ మొక్క వేరు పిల్లలకు వచ్చే అన్ని రకాల వ్యాధులనీ తగ్గిస్తుందట. అందుకే దీన్ని పిల్లల ఔషధం అనీ పిలుస్తారు. ఒకలాంటి తియ్యని వాసనతో ఉండే దీని వేరుని ఎండబెట్టి పొడి చేసి ఆయుర్వేదంలో రకరకాలుగా వాడుతుంటారు.
తరచూ అజీర్తితో బాధపడే పిల్లలకు దీని వేరుని మంటమీద కాల్చి, పొడి చేసి, ఓ చిటికెడు పొడిని తల్లి పాలతో కలిపి తాగిస్తారు. అరకప్పు మరిగించిన నీళ్లలో ముప్పావు టీస్పూను శొంఠిపొడి, చిటికెడు వసపొడి వేసి తాగితే పెద్దవాళ్లలోనూ జీర్ణ సమస్యలు తగ్గుముఖం పడతాయి.
పిల్లల చేతికి ఈ వేరుని కంకణంగా కడుతుంటారు. వాళ్లు దాన్ని నోట్లో పెట్టుకుని చీకుతుంటే ఆ రసం కొంచెంకొంచెంగా కడుపులోకి వెళ్లి బ్యాక్టీరియా, వైరస్ల్లాంటివి పొట్టలోకి చేరకుండా ఉంటాయట. గొంతునొప్పి, దగ్గులతో బాధపడేవాళ్లు చిన్న వస ముక్కని దంచి, కాసేపు నోట్లో పెట్టుకుని, కొంచెం కొంచెంగా ఆ రసాన్ని మింగితే ఉపశమనం ఉంటుంది. అలాగే మాటలు త్వరగా రానివాళ్లకి కూడా చిటికెడు పొడిని తేనెతో కలిపి నాకిస్తారు.
మతిమరపు, డిప్రెషన్, మూర్ఛ... వంటి నరాల సంబంధ వ్యాధులతో బాధపడేవాళ్లకి వస వేరుని దంచి, మరిగించి, చల్లార్చిన డికాక్షన్ని ఇవ్వడం వల్ల మంచి ఫలితం ఉంటుందట. డయేరియాకీ ఇది మంచి మందే. చిటికెడు వస పొడిని తేనెతో కలిపి ఇస్తే డయేరియా కూడా తగ్గుతుంది.
దీన్నుంచి తీసిన గాఢ తైలాన్ని చర్మసంబంధ ఇన్ఫెక్షన్లు, తలనొప్పి, ఆర్థ్రయిటిస్, కీళ్లనొప్పులు తగ్గడానికీ వాడుతుంటారు.
వసపొడిని కాసిని నీళ్లలో కలిపి ఇంట్లో అక్కడక్కడా చల్లడం ద్వారా కీటకాలను అడ్డుకోవచ్చు. అలాగే దీన్ని పలుచని బట్టలోకట్టి కబోర్డులూ బీరువాల్లో పెట్టితే బొద్దికలూ తెల్లని పుస్తకాల పురుగుల్లాంటివి చేరకుండా ఉంటాయి.