శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ యోగనరసింహస్వామిగా, ఊగ్రనరసింహస్వామిగా రెండురూపాలలో కొలువై ఉన్నాడు. ఈ దేవాలయం ఒక వేయు సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది. హిరణ్యకశిపుని వధానంతరం నరసింహస్వామి తన ఊగ్రరూపాన్ని ఇక్కడ విరమించుకొని యోగముద్రలో వెలశాడని ప్రతీతి. అందుకనే ఈ స్వామిని యోగనరసింహుడని కూడా అంటారు. ఇక్కడ స్వామివారు యోగాసీనుడై శ్రీక్ష్మీసమేత నృసింహస్వామి స్వయంభు సాలగ్రామ రూపంలో పద్మాసనంలో కోరమీసాలతో, ప్రసన్నవదనంతో దర్శనమిస్తాడు. మరో ఆలయంలో ఊగ్రరూపంతో దర్శనమిస్తాడు. ధర్మపురి రాజైన ధర్మవర్మచే ఈ లఆయం నిర్మించబడినది.
ధర్మవర్మ స్వామివారి సౌమ్యరూపం కోసం , బ్రహ్మ, విష్ణుమూర్తులను ప్రార్థించగా వారు అనుగ్రహించి నరసింహస్వామివారి శాంతరూపాన్ని దర్శింపచేస్తారు. ప్రతిరోజూ ఈ దేవాలయానికి సుమారు 1,000 మంది భక్తులు వస్తారు. స్వామివారికి నిత్యపూజలు (సుప్రభాతసేవ, అభిషేకం, అర్చనలు మొదగునవి) మరియు ప్రత్యేక పూజలు జరుపుతారు.
స్వామివారికి బ్రహోత్సవాలు (జాతర) ప్రతి సంవత్సరం ఫాల్గుణమాసంలో (ఫిభ్రవరి లేక మార్చి నెలలో) వైభవంగా జరుగుతాయి.
ధర్మపురిలో ఇంకా గణపతి దేవాలయం, శివపార్వతల దేవాలయం, నందీశ్వరుని దేవాయాలు కూడా ఉన్నవి. ఈ పవిత్రమైన క్షేత్రం గోదావరీ నదీతీరంలో కలదు. ధర్మపురి ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలకు, వైదిక విద్యకు, జ్యోతిష్‌శాస్త్రానికి పేరుపొందినది. ధర్మపురి క్షేత్రం పితృకర్మకు, కుజదోష నివారణకు ప్రసిద్ధి చెందినది.
ఎలా వెళ్ళాలి? : కరీంనగర్ నుండి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ధర్మపురి ఉన్నది. కరీంనగర్ నుండి ధర్మపురికి బస్సులో వెళ్ళవచ్చు.