నవనారసింహ క్షేత్రాలతో కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఒకటి. ఈ క్షేత్రంలో స్వామివారు ప్రహ్లాదుని సమేతంగా దర్శనమిస్తారు. కదిరి చెట్టు మూలం నుండి స్వామివారు అష్టబాహవులతో (ఎనిమిది చేతులతో) స్వయంభువుగా అవతరించాడని కధనం. చుట్టు పక్కల బృగుతీర్థము, ద్రౌపది తీర్ధం, కుంతి తీర్ధం, పాండవతీర్ధం వ్యాసతీర్ధాలు ఉన్నవి.
ఆయ విశేషాలు : ఎత్తయిన ప్రహరీతో విశాలమైన ఈ దేవాలయం 13వ శతాబ్ధంలో దశలవారీగా అభివృద్ధి చెందినదని ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తుంది. ప్రధాన ఆలలయంలో రంగమండపం, గర్భగుడి, అంతరాయం, ప్రదక్షణాపధం, ముఖమండపం, అర్ధమండపాలు ఉన్నవి. రంగమండపంలో శిల్పకళారీతులు అత్యంత సుందరంగా ఉంటాయి. వీటి మీద చిత్రించిన చిత్రాలు శతాబ్ధాల కాలం నాటివి. కొంత రంగు వెలసినా స్పష్టంగా ఉన్నవి. ఇక్కడ ఆశ్ఛర్యం కలిగించే విషయం ధ్వజస్తంభం భూమి పునాదులలో కాకుండా రాతిబండపైన నిలపెట్టడం.
ఉత్సవాలు : ప్రతి సంవత్సరం ఫాల్గుణమాసం (మార్చి నెలలో) స్వామి వారి బ్రహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలను చూసేందుకు కదిరి చుట్టుపక్కల వారే కాక కర్ణాటక, తమిళనాడు నుండి కూడా ప్రజలు వస్తారు. స్వామివారి రథం 120 టన్నుల బరువుతో 45 అడుగుల ఎత్తులో ఉంటుంది. రధం ఊరేగింపు సమయంలో భక్తులు రధంపై దవణం, పండ్లు, మిరియాలు చల్లుతారు. తరువాత వాటిని స్వామివారి ప్రసాదంగా తీసుకుంటారు.
ఆలయవేళలు : ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12-45 ని॥వరకు
మ॥12-45 నుండి సా॥04-30 ని॥ వరకు గుడి మూసివేస్తారు
సా॥ 04-30 ని॥ నుం రాత్రి 08-30 ని॥ వరకు తెరచి ఉంచుతారు.
వసతి సౌకర్యాలు : ఇక్కడ బసచేయ గోరువారు ఆలయం ప్రాంగణంలో ఉన్న వసతి గృహాలలో బసచేయవచ్చు.
ప్రయాణసౌకర్యాలు : అనంతపురం జిల్లా కదిరిలో ఈ దేవాలయం ఉన్నది. పాకాల -ధర్మవరం రైలు మార్గంలో కదిరి స్టేషన్‌లో దిగవచ్చు. అనంతపురం నుండి (94 కి.మీ) కదిరికి బస్సులో కూడా వెళ్ళవచ్చు.